ఈ సమ్మర్ మామూలుగా ఉండదు

చిన్న సినిమాలు ఎన్ని వచ్చినా.. పెద్ద సినిమాలు చేసే సౌండ్ ముందు అవి కనిపించవు. అందుకే ఎవరెన్ని చెప్పినా.. బిగ్ స్టార్స్ మూవీస్ అంటే బాక్సాఫీస్ వద్ద కనిపించే సందడి ఇతర సినిమాలకు కనిపించదు. కొన్నాళ్లుగా కరోనా కారణంగా తెలుగు సినిమా పరిశ్రమలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలై ఫైనల్ గా అందరూ కలిసి సమ్మర్ కే చేరారు. మార్చి నుంచి మొదలు కాబోతోన్న ఈ కొత్త సినిమాల సందడి ఎలా ఉండబోతోంది. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
ఫిబ్రవరి నుంచి కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. అయితే ఈ నెలలో ఖిలాడీ తప్ప ఆ రేంజ్ లో సౌండ్ చేసే సినిమా మరోటి కనిపించడం లేదు. అయితే నెలాఖరులో వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు గని. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు. బాక్సింగ్ గేమ్ నేపథ్యంలో తెరకెక్కిన గని చిత్రంలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. కిరణ్ అనే కొత్త దర్శకుడ పరిచయం అవుతున్నాడీ చిత్రంతో. ఆ మధ్య విడుదల చేసిన టీజర్, సాంగ్స్ అన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఈ సినిమాపై పరిశ్రమలో కూడా మంచి బజ్ వినిపిస్తోంది. ఇక మార్చి నుంచి సిసలైన సినిమాల జాతర మొదలు కాబోతోంది. పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కరుగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సద్ధమవుతున్నాయి. ఈ మేరకు క్లాష్ లేకుండా ఆల్రెడీ ప్రొడ్యూసర్ గిల్డ్ లోని నిర్మాతలు మాట్లాడుకున్నారు. అందుకే ఒకరి తర్వాత ఒకరుగా బరిలోకి దిగబోతున్నారు. అయితే అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ.. మార్చి 11 లేదా 18న ప్రభాస్ రాధేశ్యామ్ విడుదల కావొచ్చు అంటున్నారు.
ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ అనిపించుకుంటోన్న ఆర్ఆర్ఆర్ కూడా ముందు చెప్పిన డేట్స్ లో కాకుండా మధ్యలో వస్తోంది. మొదట వీరు మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తాం అని ప్రకటించారు. కానీ ఈ రెండు డేట్స్ లో కాకుండా మార్చి 25న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ మల్టీ స్టారర్ ను రాజమౌళి డైరెక్ట్ చేశాడు. దేశవ్యాప్తంగా ఈ మూవీ కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మార్చిలోనే రాబోతోన్న మరో బిగ్గెస్ట్ మూవీ భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ఈచిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. పవన్ సరసన నిత్య మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. మళయాలంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా వస్తోన్న ఈచిత్రం కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నదే. భీమ్లా నాయక్ విషయంలో చిన్న సస్పెన్స్ మెయిన్టేన్ చేస్తోంది టీమ్. ఈ సినిమాను మార్చి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తాం అని ప్రకటించారు. అయితే మార్చిలో కాకుండా ఏప్రిల్ 1నే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. నిజానికి ఈ డేట్స్ రాకముందే వీళ్లు ఏప్రిల్1కి ఫిక్స్ అయ్యారు. ఈ టైమ్ లో మరో సినిమా లేదు కాబట్టి.. భీమ్లా నాయక్ అదే రోజు రావొచ్చు. సో.. ఏప్రిల్ ఎండలను మొదటి రోజు నుంచే భీమ్లా నాయక్ మండించబోతున్నాడు.
ఏప్రిల్ 14న తెలుగు చిత్రాలు కాకపోయినా మరో మూడు బిగ్ మూవీస్ ఉన్నాయి. కన్నడ స్టార్ యశ్ నటించిన కెజీఎఫ్ చాప్టర్, తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ తో పాటు హిందీ మూవీ లాల్ సింగ్ చద్దా ఉన్నాయి. ఈ మూడు తెలుగు మార్కెట్ పై డైరెక్ట్ గా ప్రభావం చూపించే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మూవీస్ క్లాష్ విషయంలో ఇంకేదైనా క్లారిటీ వస్తుందా లేదా అనేది చూడాలి.
మార్చి చివరలో వెటరన్ స్టార్స్ మధ్య వార్ జరగబోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3 చిత్రాన్ని రీసెంట్ గా అనౌన్స్ చేసినట్టుగానే ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు. ఎఫ్2 కు సీక్వెల్ గా వస్తోన్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఎఫ్3 కూడా గత చిత్రంలా బాక్సాఫీస్ వద్ద హిలేరియస్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందనుకుంటున్నారు. ఎఫ్3 వచ్చిన నెక్ట్స్ డే 29న మెగాస్టార్, మెగా పవర్ స్టార్ నటించిన ఆచార్య విడుదల కాబోతోంది. నిజానికి ఆచార్యను ఏప్రిల్ 1న విడుదల చేయాలనుకున్నారు. బట్ వాయిదా వేసుకున్నారు. బట్ ఫైనల్ గా ఏప్రిల్ 29కి వెళ్లిపోయింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీపైనా చాలా అంచనాలున్నాయి. తండ్రి కొడుకు కలిసి మొదటి సారి నటించడంతో పాటు కంటెంట్ పరంగా వైవిధ్యంగా ఉందనే పేరు రావడంతో ఆచార్య కోసం చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక సమ్మర్ మార్కెట్ కు సరైన ఫినిషింగ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందిన సర్కారువారి పాట చిత్రాన్ని మే 12న విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ చెప్పుకున్న సినిమాల్లాగా ఏ హడావిడీ లేకుండా ప్రశాంతంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పైగా అన్ని సినిమాలు చూసిన వారికి ఆఖర్లో వచ్చే మహేష్ మూవీపైనా అంచనాలతోనే ఉంటారు. మొత్తంగా ఈ మూవీస్ రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్ చేసుకున్నాయి. కానీ ఈ సారైనా సరిగ్గా జరుగుతుందా లేదా అనేది కరోనాపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఈ వైరస్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇక రాబోయే రోజుల్లో పూర్తిగా అంతమైపోవాలని.. తెలుగు సినిమా పరిశ్రమకు మునుపటి రోజులు రావాలని కోరుకుందాం.

Related Posts