మరో బ్లాక్ బస్టర్ పై కన్నేసిన వెంకీ అండ్ బ్రో

చాలామంది కన్నడ సినిమా పరిశ్రమ వారిని అంటారు కానీ.. తెలుగులోనూ రీమేక్ సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆ కాలం హీరో వెంకటేష్ కెరీర్ లో రీమేక్ సినిమాలే ఎక్కువ విజయాలు సాధించాయి. అవార్డులు మాత్రం స్ట్రెయిట్ చిత్రాలకు వచ్చాయి. ఆరు పదుల వయసులో ఉన్న ఇప్పటికీ రీమేక్ లు చేయడంలో ముందే ఉంటున్నాడు వెంకటేష్. రీసెంట్ గా కూడా దృశ్యం రెండు భాగాలూ రీమేక్ చేసి ఓటిటిలో విడుదల చేసి విజయాలు అందుకున్నాడు. అలాగే తమిళ్ బ్లాక్ బస్టర్ అసురణ్ ను నారప్పగా రీమేక్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్3 సినిమాను ఫినిష్ చేసి ఉన్నాడు. దీని తర్వాత మరో కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదు. తరుణ్ భాస్కర్ తో సినిమా అంటూనే ఉన్నారు కానీ.. అది ఇప్పటి వరకూ ఏ కొలిక్కీ రాలేదు. ఈ టైమ్ లో మరో రీమేక్ చేయాలనే భావనలో వెంకటేష్ తో పాటు ఆయన అన్న సురేష్ బాబు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
లేటెస్ట్ గా మళయాలంలో వచ్చిన సినిమా ‘బ్రో డాడీ’. మోహన్ లాల్, మీనా, పృథ్వీరాజ్ సుకుమారన్, కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేశారు. పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మోహన్ లాల్ అతనికి తండ్రిగా నటించడం విశేషం. ఇంతకు ముందు వీరి కాంబోలో లూసీఫర్ వచ్చింది. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఆ చిత్రాన్నే తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. అయితే లూసీఫర్ పూర్తి సీరియస్ చిత్రం.కానీ బ్రో డాడీ అవుట్ అండ్ ఎంటర్టైనర్. రీసెంట్ గా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోన్న బ్రో డాడీకి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మస్ట్ వాచ్ మూవీ అంటున్నారు. విశేషం ఏంటంటే.. ఈ మూవీలో పెళ్లీడుకొచ్చిన కొడుకు ఉన్న మోహన్ లాల్, మీనా దంపతులు మరోసారి బిడ్డకు జన్మనివ్వబోతుంటారు. అదే టైమ్ లో కొడుకు కూడా తను ప్రేమించిన అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పడానికి వస్తాడు. ఈ మొత్తం కన్ఫ్యూజింగ్ డ్రామా హిలేరియస్ గా వర్కవుట్ కావడంతో బ్రో డాడీకి మంచి అప్లాజ్ వస్తోంది.
సో.. ఇప్పుడు బ్రో డాడీని తెలుగులో వెంకటేష్, రానా హీరోలుగా రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట సురేష్ బాబు. ఇప్పటికే అక్కడి మేకర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట. వెంకీ, రానా కలిసి నటించాలని చాలాకాలంగా ఓ మంచి కథకోసం చూస్తున్నారు. రీసెంట్ గా వీరు ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఏదేమైనా ఇలా రీమేక్ లతోనే మిగతా కెరీర్ నెట్టుకురావాలని వెంకీ భావిస్తున్నాడో లేక.. ఇవైతే సేఫ్ గేమ్ లా ఉంటాయని వెంకీ బ్రదర్ సురేష్ బాబు ఫీలవుతున్నాడో కానీ.. బ్రో డాడీనీ తెలుగులో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట.

Related Posts