నాట్యాభినేత్రి శోభన బయోగ్రఫీ

నాట్యం నుంచి నటన లోకి దూకిన వాళ్లని చాలా తేలికగా గుర్తించవచ్చు. వాళ్ల అభినయం కాస్త విపులంగా ఉంటుంది. ముఖంలో భావాలు పలికించడంలోనూ ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. శోభన నటనలో ఈ ప్రత్యేకత స్పష్టంగా చూడొచ్చు. తెలుగులో అందరు హీరోలతోనూ నటించి తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న శోభన చంద్రకుమార్ పిళ్లై మార్చి 21, 1970న కేరళలో తిరువనంతపురంలో జన్మించింది.

ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా పాపులర్ అయిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలే శోభన. వారి వారసత్వంలోనే నాట్యంలోకీ తరువాత నటనలోకీ కాలు పెట్టింది. తెలుగులో శోభనకు గుర్తింపు తెచ్చిన చిత్రం ‘విక్రమ్’. అంతకు ముందే ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. అయితే నాగార్జున ఎంట్రీ మూవీ కావడంతో ‘విక్రమ్’కి కాస్త ప్రత్యేకత దక్కింది. అందులో శోభన నటనకూ నాట్యానికీ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

శోభన జస్ట్ గ్లామర్ సేక్ హీరోయిన్స్ రోల్స్ మాత్రమే చేయలేదు. తను పెర్ఫామర్ కూడా. అదే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకుంది కూడా. ఆ క్రమంలోనే తనలోని పెర్ఫామర్ ను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చింది. అలా చేసిన చిత్రాల్లో ‘అభినందన’ కూడా ఒకటి. అందులో ప్రేమకీ, బాధ్యతకీ మధ్య మానసిక సంఘర్షణ పడే యువతిగా అద్భుతంగా నటించింది.

చిరంజీవి స్వీయ నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం ‘రుద్రవీణ’లో దళిత యువతిగా శోభన నటన ఆకట్టుకుంటుంది. ఆత్మాభిమానం కలిగిన అమ్మాయిగా హుందాగా నటించింది. ముఖ్యంగా జెమినీగణేశన్ మీరు అంటరాని వాళ్లా అన్నప్పుడు…శోభన కళ్లల్లో చూపించిన భావాలు అనితరసాధ్యాలు. చిరంజీవిని పట్టుకుని ముట్టుకోవచ్చే అనడంలో తనదైన ముద్ర వేస్తుంది.

గ్లామర్ అంటే అశ్లీలత కాదనే కాన్షస్ నెస్ విపరీతంగా ఉన్న నటి శోభన. తను తెర మీద కనిపించినంత సేపూ ఆడియన్స్ ను ఆహ్లాదపరుస్తుంది. ‘రుద్రవీణ‘లోనే లలిత ప్రియ కమలం పాటలో తన నాట్యం కలగలసిన నటన ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. సరిగ్గా ఇలాంటి ఏరియాల్లోనే ప్రేక్షకులకు శోభన గుర్తొస్తూంటుంది.

మెగాస్థార్ చిరంజీవితో ‘రుద్రవీణ’ తర్వాత మరో చిత్రం చేసింది శోభన. కమర్షియల్ గా పెద్ద విజయం సాధించిన ఆ చిత్రం ‘రౌడీ అల్లుడు‘. అందులో చిలుకా క్షేమమా అంటూ వచ్చే డ్యూయట్ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. డాన్స్ తెలిసిన హీరోహీరోయిన్స్ మధ్య వచ్చే డ్యూయట్లకు కాస్త ప్రత్యేకత యాడ్ అవుతుంది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో నాలుగు చిత్రాలు చేసింది శోభన. వీరిద్దరి కాంబినేషన్ లో మొదట వచ్చిన చిత్రం ‘అల్లుడుగారు’. రాఘవేంద్రరావు డైరక్ట్ చేసిన ఈ మూవీలో శోభన అల్లరిగా ప్రారంభమై…బాధ్యతతో ముడిపడే పాత్రలో కనిపిస్తుంది. మోహన్ బాబు ను తిట్టడం కాదు…తీవ్ర స్థాయిలో గొడవ పడే సీన్ లో శోభన చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. మోహన్ బాబుకు ఏ మాత్రం తీసిపోకుండా అల్లరి చేస్తుంది.

శోభన చెన్నై లోని చిదంబరం నాట్య అకాడెమీ లో శిక్షణ పొందింది. ఆమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ . భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో శోభన ప్రత్యేక శ్రద్ద కనపరుస్తారు. అందుకే… డాన్సర్ గా చరిత్ర సృష్టించారు. తెర మీద ఏ భావాన్నైనా చిటికెలో పలికించగలిగారు. మణిరత్నం ‘దళపతి‘లో రజనీకాంత్ కాంబినేషన్ లో నటించింది. సుందరీ నీవే నేనంటా పాటలో సున్నితమైన హావభావాలతో అలరిస్తుంది.

ఎనభై దశకంలో వచ్చిన క్లాసికల్ డాన్సర్స్ అందరిలోకీ శోభన అగ్రస్థానానికి ఎదిగింది. నాట్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన శోభన రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. కళార్పణ అనే సంస్ధ ప్రారంభించి అనేక మందికి నాట్యంలో శిక్షణ ఇస్తోంది. ‘నారీ నారీ నడుమ మురారి‘ చిత్రంలో బాలకృష్ణతో కమర్షియల్ డాన్స్ చేసినా…అందులోనూ ఓ స్పెషల్ గ్రేస్ కనిపిస్తుంది.

1994లో విడుదలైన ‘మణిచిత్రతళు‘ అనే మళయాల సినిమాకు గాను ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. తరువాత 2001 వ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి రేవతి దర్శకత్వం వహించిన ‘మిత్ర్ మై ఫ్రెండ్‘ అనే ఆంగ్ల చిత్రానికి గాను రెండవసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా రంగం నుంచి నాట్యానికే తన మొదటి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.

శోభన తో అద్భుతంగా హాస్యరసపోషణ చేయించారు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో శోభన చేసిన ‘అప్పుల అప్పారావు‘ టాలీవుడ్ కి సంబంధించినంత వరకు ప్రత్యేకమే. క్లాసికల్ డాన్సర్ శోభన చేత పోలీస్ పాత్ర చేయించేశారు ఈవీవీ.

కామెడీ అనేది సీరియస్ గా ఉంటూ కూడా చేయచ్చని ప్రూవ్ చేసిన నటి శోభన. వంశీ రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ ఎంటర్ టైనర్ ‘ఏప్రిల్ ఒకటి విడుదల’లో శోభన పాత్ర తీరు అదే. ఒకే ఒక్క కోరిక కోరి హీరోను ముప్పతిప్పలు పెట్టే పాత్ర అది. అందులో రాజేంద్రప్రసాద్ తో పెళ్లికి షరతు పెట్టే సన్నివేశంలో శోభన హావభావాలు చాలా గొప్పగా నడుస్తాయి.

నాగార్జున తొలి చిత్ర కథానాయిక అయిన శోభన ఆయనతో చాలా గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘రక్షణ’. తను చేసేది హీరోయిన్ పాత్రే అయినా అందులో కాస్త ప్రత్యేకత ఉండాలని ఆశించే నటి శోభన. తనదైన స్పార్క్ చూపించడానికి అవకాశం ఉండే కారక్టర్ల కోసం వెంపర్లాడే ప్రయత్నంలోనే తను ఎక్కువ చిత్రాలు చేయలేకపోయిందనేది అభిమానుల అభిప్రాయం.

తెలుగులో చాలా గ్యాప్ తర్వాత 2006లో మోహన్ బాబు తో ‘గేమ్’ సినిమాలో నటించింది. ఇక మలయాళంలో సురేష్ గోపీతో కలిసి ‘వరనే అవశ్యముండు’ అనే మూవీలో కనువిందు చేసింది. నాట్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శోభన.. తన మనసుకి నచ్చిన పాత్ర దొరికితే చేస్తుంది.

1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో శోభనను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోను నటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణించిన వ్యక్తి శోభన. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు. 1994లో శోభన కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసింది. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం.

శోభన పెళ్లి చేసుకోలేదు. తన జీవితాన్నే నాట్యానికే అంకితం చేసింది. అయితే.. 2011లో అనంత నారాయణి చంద్రకుమార్ అనే పాపను దత్తత తీసుకుంది.

Related Posts