సంక్రాంతి వార్ ఫిక్స్ అయింది. కానీ ఎవరు ఎప్పుడు వస్తున్నారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ముఖ్యంగా ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఫైట్ దిగుతుండటంతో మరోసారి అటు ఇండస్ట్రీతో పాటు ఇటు ఆడియన్స్ లో కూడా ఓ రకమైన క్రేజ్ మొదలైంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సంక్రాంతి నుంచి తప్పుకుంటారు అని అనుకున్నారు. అందుకు కారణం.. నిర్మాణ సంస్థలు సేమ్ కావడమే.

బట్.. ఇద్దరు హీరోల్లో ఎవరూ తగ్గేదే లే అని భీష్మించుకోవడంతో క్లాష్ తప్పడం లేదు. ఆ తప్పకపోవడం అనే మేటర్ నుంచి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో మంచి హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ వార్ లో తను ఎప్పుడు వస్తున్నాడు అనేది తేల్చాడు బాలయ్య. జనవరి 12న వీరనరసింహారెడ్డిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ గా నటించాడు. బాలయ్య అఖండతో, గోపీచంద్ క్రాక్ తో భారీ హిట్స్ ఇచ్చి ఉన్న తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.


ఇక మెగాస్టార్ కూడా వాల్తేర్ వీరయ్యగా వింటేజ్ లుక్ తో ఊరిస్తున్నాడు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కూడా శ్రుతి హాసనే హీరోయిన్ కావడం విశేషం. రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఊర్వశీ రూతేలా ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంది. వాల్తేర్ వీరయ్య కూడా సంక్రాంతి బరిలోనే ఉన్నాడు. అయితే ఏ డేట్ కు వస్తున్నాడు అనేది ఇంకా ఖచ్చితంగా చెప్పలేదు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ఈ వీర సింహారెడ్డి వచ్చిన రెండు రోజులకు వీరయ్య వస్తాడు అంటున్నారు. అంటే జనవరి 14న వస్తున్నట్టు టాక్. రెండు రోజుల గ్యాప్ అంటే ఇద్దరికీ ఇబ్బంది ఉండదు.


ఇక వీరితో పాటు తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా సంక్రాంతి బరిలోనే వారసుడుగా వస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. వంశీ పైడిపల్లి దర్శకుడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని తమిళ్ లో జనవరి 12న విడుదల అని అనౌన్స్ చేశారు. కానీ తెలుగులో డబ్బింగ్ సినిమా అన్న ట్యాగ్ పెట్టేశారు కాబట్టి ఇక్కడా అదే డేట్ కు వస్తుందా లేదా అనే చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ ను కూడా వీళ్లు క్లియర్ చేస్తే ఇక సంక్రాంతి వార్ లో ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారు అనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.