‘ది 100‘ టీజర్.. రూత్ లెస్ పోలీసాఫీసర్ గా సాగర్

ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌.. ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సాగర్ హీరోగా నటించిన ‘షాదీ ముబారక్‌’ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఇప్పుడు మరోసారి హీరోగా వెండితెరపై మురిపించబోతున్నాడు సాగర్. ‘ది 100‘ అనే వైవిధ్యమైన టైటిల్ తో సాగర్ హీరోగా కొత్త చిత్రం రాబోతుంది.

ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపిఎస్ అధికారి పాత్రలో సాగర్ కనిపించబోతున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ చిత్రాన్ని రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కిస్తున్నారు. ‘యానిమల్, అర్జున్ రెడ్డి‘ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్నందిస్తుండడం విశేషం. అలాగే.. సీనియర్ టెక్నీషియన్ శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘ది 100‘ మూవీ నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజయ్యింది.

టీజర్ విషయానికొస్తే.. ఏదో విషయంలో తప్పు చేశాడనే నెపంతో పోలీసాఫీసర్ విక్రాంత్ ను విచారిస్తుంది డిపార్ట్ మెంట్. ‘చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఈగో ఫీలవుతున్నారా? లేకపోతే తప్పులు చేయడానికే డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయ్యారా?‘ అంటూ ఆఫీసర్స్ అతన్ని అడగడం.. ఆ తర్వాత అతను ఓ మర్డర్ మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో విలన్ల పాలిట రూత్ లెస్ పోలీసాఫీసర్ గా చెలరేగిపోవడం వంటి విజువల్స్ టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి.

ఇక టీజర్ చివర్లో.. తనని విచారిస్తున్న ఆఫీసర్లను ఉద్దేశిస్తూ ‘నేను ఏం చెప్పినా మీరు నమ్మరు.. మీరు ఎక్స్ పెక్ట్ చేసేది నేను చెప్పను.‘ అంటూ విక్రాంత్ పాత్రలో సాగర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. టీజర్ తో మంచి మార్కులు వేయించుకున్న ‘ది 100‘ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts