వెండితెరపై వినాయక్ మాస్

తన దరికి చేరిన కథకు కమర్షియల్ హంగులు అద్ది జనరంజకం చేయడంలో సిద్ధహస్తుడు మాస్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్. మాస్ ను గెలిస్తే చాలు.. వెండితెరపై వెలిగిపోవచ్చు.. ఇది ఆ తెర పుట్టినప్పటి నుంచి అందరూ నమ్ముతున్న సూత్రం. అందుకే ఆ ఫార్ములా ఇంతవరకూ పాత బడలేదు. అదే మాస్ ఫార్ములాని కథావస్తువుగా ఎంచుకుని పలు బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు వి.వి.వినాయక్. అక్టబర్ 9న మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ వినాయక్ పుట్టినరోజు.

దర్శకుడు వినాయక్ పేరు వింటే చాలు ఆయన సినిమాల్లో గాల్లోకి లేచిన సుమోలు, బాంబు పేలుళ్ళు గుర్తుకు వస్తాయి. ప్రతి అంశాన్ని కమర్షియల్ యాంగిల్‌లో చూసి ఆయన సన్నివేశాలను చిత్రీకరించిన తీరూ గుర్తుకు రాకమానదు. వినాయక్ సినిమాలను పరిశీలిస్తే.. ఎలాంటి కథకైనా తనదైన కమర్షియల్ తళుకులు అద్ది, జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ పయనంలో అదరహో అనిపించిన అపూర్వ విజయాలూ ఉన్నాయి. ఉస్సూరుమనిపించిన చిత్రాలూ లేకపోలేదు. అయినా వినాయక్ దర్శకునిగా తన బ్రాండ్‌ను జనం మదిలో చెరిగిపోకుండా చేసుకున్నాడు.

పరిశ్రమలో ఓ కొత్త దర్శకుడికి అవకాశం రావడం ఎంత కష్టమో దర్శకులైన ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటిది తొలిసారిగా నిర్మాతగా మారిన బెల్లంకొండ సురేష్ వినాయక్ ను నమ్మాడు. దీంతో వినయ్ కాన్ఫిడెన్స్ రెండింతలైంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇంకా మీసాలు కూడా రాని కుర్రాడితో తొడ కొట్టించాలన్న ఆలోచనకు దారి తీసింది. సుమోలను గాలిలో లేపుతూ వినయ్ చేసిన మాస్ సీన్స్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.

‘ఆది‘ లాంటి సినిమా చేసిన తర్వాత మాస్ కు కేరాఫ్ అయిన బాలయ్య వినయ్ కు అవకాశం ఇవ్వడమే అతని ప్రతిభకు తార్కాణం. బాలయ్య, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి‘ సూపర్ హిట్ కాకపోయినా.. అందులోని సుమోల సీన్ కు ఫిదా కాని ప్రేక్షకుడు లేడు. రెండో సినిమాకే బాలయ్యలాంటి హీరోతో డ్యూయొల్ రోల్ చేయించి శెభాష్ అనిపించుకున్నాడు వినాయక్.

రెండు సినిమాలతోనే వినాయక్ టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అప్పటి వరకూ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న రాజు తొలి సారిగా నిర్మాతగా మారుతూ.. వినయ్ ను దర్శకుడిగా ఎంచుకున్నాడు. దానికి హీరోగా నితిన్ ను ఎంచుకున్నారు. అదే ‘దిల్‘. ‘దిల్‘ సూపర్ హిట్ కావడమే కాదు.. నిర్మాత రాజుకు ఇంటిపేరుగానూ మారిపోయి ఇప్పుడాయన దిల్ రాజుగా మారాడు.

ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో వినాయక్ ఎక్స్ పర్ట్. ఫైట్ సీన్ అయినా వార్నింగ్ ఇచ్చే సీన్ అయినా దాన్ని ప్రేక్షకులకు మెంటల్ గా కనెక్ట్ చేయడంలోనే అతని సక్సెస్ దాగుంది. వినాయక్ ముందు నుంచీ చిరంజీవి అభిమాని. మరి ఆయన అభిమానులు కాని వారే చిరుతో సినిమా తీయాలని కలలు కంటారు. అలాంటి వినాయక్ కు ఇంకెంత క్యూరియాసిటీ ఉండాలి.

అయితే కేవలం అభిమానిగా కాకుండా ప్రతిభ కొలమానంగా చిరుతో సినిమాకు ఛాన్స్ వచ్చింది. తమిళంలో హిట్ అయిన ‘రమణ‘ను తెలుగులో ‘ఠాగూర్‘గా మార్చి వినాయక్ చేసిన దర్శకత్వ ప్రతిభకు ఆ సినిమా చిరు టాప్ టెన్ మూవీస్ లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ఖైదీ నంబర్ 150‘ మూవీతో చిరు రీ ఎంట్రీని బంపర్ హిట్ చేశాడు వినాయక్.

ఆది సినిమా తో ఇండస్ట్రీలో సెటిల్ అయిన వినయ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో రెండో సినిమాగా వచ్చిన సాంబ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయితే.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘అదుర్స్‘ మూవీలో అదుర్స్ అనిపించేలా రెండు పాత్రలు చేయించాడు వినాయక్.

యాక్షన్ సినిమా అయితే అంచనాలు పెరిగి దెబ్బయిపోతామని డిఫరెంట్ గా కామెడీతో కాసులు కొల్లగొట్టారు. ఇక.. అప్పటికే ‘ఆర్య‘ అంటూ లవర్ బాయ్ లా ఆకట్టుకున్న అల్లు అర్జున్ ని.. ‘బన్నీ‘ అనే సాఫ్ట్ టైటిల్ తో యాక్షన్ హీరోగా నిలబెట్టాడు..

వినాయక్ కు దర్శకుడిగా ఎంత గొప్ప పేరున్నా కామెడీని డీల్ చేయడంలో కాస్త తడబడతాడు అనే పేరూ ఉంది. తన సినిమాల్లో కామెడీ ఉన్నా.. యాక్షన్ సీన్స్ తో పోల్చుకుంటే అంత గొప్పగా ఉండవనేవారు. అయితే.. ‘కృష్ణ, అదుర్స్‘ సినిమాలతో తాను కామెడీని తీర్చిదిద్దడంలోనూ మేటి అని నిరూపించుకున్నాడు వినాయక్.

ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేష్ చేత ‘లక్ష్మీ‘ అంటూ చాలాకాలం తర్వాత యాక్షన్ సినిమా చేయించి ఆశ్చర్యపరిచాడు వినాయక్. సెంటిమెంట్ తో నిండిన ఈ సినిమాలో కథ రొటీనే అయినా ట్రీట్మెంట్ తో ఆకట్టున్నాడు వినాయక్.

ఇక.. ప్రభాస్ తో ‘యోగి‘ తీసి నిరాశపరిచినా.. రామ్ చరణ్ కి ‘నాయక్‘ వంటి మెగా హిట్ అందించాడు. అయితే.. బెల్లంకొండ శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను‘గా నిలబెట్టిన వినాయక్.. అఖిల్ కి మాత్రం అదిరిపోయే లాంఛ్ ఇవ్వలేకపోయాడు.

తానే హీరోగా పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ను బాలీవుడ్ లోనూ స్టార్ గా నిలబెట్టే ప్రయత్నం చేశాడు వినాయక్. తెలుగులో సూపర్ హిట్టైన ‘ఛత్రపతి‘ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. కానీ.. ‘ఛత్రపతి‘ హిందీ రీమేక్ వినాయక్ కి విజయాన్నందించలేకపోయింది.

ఆమధ్య నటుడిగానూ పరిచయమవ్వాలనుకున్నాడు. వినాయక్ హీరోగా ‘శీనయ్య‘ అనే సినిమా ప్రారంభమయ్యింది. కానీ.. మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం వినాయక్ కొత్త సినిమాకోసం కథల అన్వేషణలో ఉన్నాడు.

మరి.. త్వరలోనే వినాయక్ కొత్త సినిమా ప్రకటించి మళ్లీ వెండితెరపై తన మార్క్ మాస్ ను చూపిస్తాడని ఆశిస్తూ.. మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం.

Related Posts