భగవంత్ కేసరి ట్రైలర్.. బాక్సాఫీసు బద్దలే

నటసింహం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘గా దసరా బరిలోకి దూకుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలైతే మామూలుగా లేవు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి వచ్చిన అప్లాజ్ అంతా ఇంతా కాదు. ఇక.. లేటెస్ట్ గా ‘భగవంత్ కేసరి‘ ట్రైలర్ వచ్చేసింది.

‘నువ్వు ఏడున్నా ఇట్ల దమ్ముతో నిలబడాలే. అప్పుడే ఈ దునియా నీకు బాంచన్ అంటది’ అనే బాలయ్య డైలాగుతో ట్రైలర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత తన కూతురు (శ్రీలీల)ను ఆర్మీలోకి పంపాలనే ప్రయత్నాలు చేయడం.. ఆమె మాత్రం ఆర్మీకి వెళ్లడానికి ఆసక్తి కనబర్చకపోవడం ట్రైలర్ లో కనిపించింది. అయినా బాలయ్య మాత్రం శ్రీలీల ను ఎలాగైనా బతిమాలో, కాళ్లుపట్టుకునే ఆర్మీకి పంపాలని డిసైడవ్వడం వంటి డైలాగ్స్ ట్రైలర్ లో కనిపించాయి. ఇక శ్రీలీలను షేర్ లెక్క స్ట్రాంగ్ చేయాలి అనే డైలాగ్ తో విలన్లతో యుద్ధం ప్రారంభమవుతోంది. తన కూతురిని ఇబ్బంది పెట్టిన రౌడీలతో భగవంత్ కేసరి యుద్దానికి సిద్ధం అవుతాడు. అప్పటి నుంచి బాలయ్య మార్క్ తో ట్రైలర్ ఆద్యంతం వేగం పుంజుకుంది.

‘ఎత్తిన చెయ్యెవరిదో తెలియాలి.. తెరిచిన నోరెవ్వరిదో తెలియాలి.. మిమ్మల్ని పంపిన కొడుకెవరో తెలియాలి..‘ అంటూ తన మార్క్ డైలాగ్స్ తో నట విశ్వరూపాన్ని చూపించాడు బాలకృష్ణ. ఆ తర్వాత విలన్ గా అర్జున్ రాంపాల్ ఎంట్రీ కూడా బాగుంది. ఎక్కువగా హిందీలో మాట్లాడే అర్జున్ రాంపాల్ పాత్రతో.. హిందీలోనూ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు నటసింహం.
ట్రైలర్ కి మరో మెయిన్ ప్లస్ పాయింట్స్ తమన్ మ్యూజిక్, రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ, రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్.

ట్రైలర్ లో పాత్రల విషయానికొస్తే.. బాలకృష్ణ, శ్రీలీల తర్వాత కాజల్ కనిపిస్తుంది. అయితే.. ట్రైలర్ లో కాజల్ కి తక్కువ స్కోపే కనిపించింది. ఇక.. ట్రైలర్ ఆద్యంతం మిడిల్ ఏజ్ మ్యాన్ గా కనిపించిన బాలయ్య.. ట్రైలర్ చివరిలో యంగ్ ఏజ్ లో అదరగొట్టాడు. దీన్ని బట్టి.. ‘భగవంత్ కేసరి‘ మూవీ రెండు పీరియడ్స్ లో జరగబోతున్నట్టు అర్థమవుతోంది.

షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న గ్రాండ్‌గా ‘భగవంత్ కేసరి‘ విడుదల కాబోతుంది. మొత్తంమీద.. ట్రైలర్ తోనే బాక్సాఫీస్ ను బద్దలు కొడతాననే హింట్ ఇచ్చిన నటసింహం.. దసరా బరిలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related Posts