వెండితెర సంచలనం ‘అల్లూరి సీతారామరాజు’

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయిగా చెప్పుకునే చిత్రాల్లో ‘అల్లూరి సీతారామరాజు’ మొదటి వరుసలో నిలుస్తుంది. కృష్ణ నటించిన 100వ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. మే 1, 1974న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’.. ఈరోజుతో 50 వసంతాలు పూర్తిచేసుకుంది.

ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని రూపొందించిన చిత్రమే ‘అల్లూరి సీతారామరాజు’. ఈ సినిమాలో కృష్ణ టైటిల్ రోల్ లో కనిపించగా.. విజయనిర్మల, జగ్గయ్య, గుమ్మడి, కాంతారావు, చంద్రమోహన్, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య వంటి వారు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కృష్ణ సోదరులు ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం కథ విషయానికొస్తే.. బ్రిటీష్ పరిపాలన పట్ల చిన్ననాటి నుంచీ వ్యతిరేకత పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు, పోరాటాలు తెలుసుకుంటాడు. సీత అనే అమ్మాయిని ప్రేమించి, దేశసేవ కోసం పెళ్ళి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు. ఆపైన మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు నేతృత్వంలో.. గంటందొర, మల్లుదొర వంటి స్థానిక వీరుల మద్దతుతో ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది. బ్రిటీష్ వారు ప్రజలను హింసించడం తట్టుకోలేక సీతారామరాజు లొంగిపోయి మరణించడంతో సినిమా ముగుస్తుంది.

ఈ సినిమాలో కొంతభాగానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, మిగిలిన చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. అలాగే.. ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలను మరో ప్రముఖ దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ పూర్తిచేశారు. ఆదినారాయణరావు సంగీతంలో రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’ ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యింది. వి.ఎస్.ఆర్. స్వామి ఛాయాగ్రహనం ఈ సినిమాకి సాంకేతికంగా మరో అదనపు బలం. అన్నింటికీ మించి ‘అల్లూరి సీతారామరాజు’ విజయంలో కీలక భూమిక పోషించింది డైలాగ్స్. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి సమకూర్చిన డైలాగ్స్ కు ఎంతో మంచి పేరొచ్చింది.

సినిమా స్కోప్ లో నిర్మాణమైన చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ పేరొందింది. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి 19 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో-ఏషియన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శన, బహుమతి వంటివి పొందింది. ఈ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా’ పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది.

Related Posts