బోయపాటికి ముందుగా డేట్స్ ఇచ్చేదెవరు?

ప్రస్తుతం తెలుగులో కథానాయకులకు దీటుగా దర్శకుల హవా నడుస్తోంది. తాము నిర్దేశించిన బడ్జెట్‌లో.. నిర్దేశించిన కథానాయకులతో సినిమాలు చేస్తున్నారు నేటితరం టాప్ డైరెక్టర్స్. అలాంటి దర్శకుల్లో మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒకడు. తొలి సినిమా ‘భద్ర’ నుంచి ఇప్పటివరకూ మాస్ సబ్జెక్ట్స్ తోనే సినిమాలు చేస్తూ.. కథానాయకుల మాస్ ఇమేజ్‌ను మరింత పెంచడంలో సిద్ధహస్తుడుగా పేరుగాంచాడు బోయపాటి.

‘అఖండ‘తో అద్భుతమైన విజయాన్నందించిన బోయపాటికి.. లేటెస్ట్ మూవీ ‘స్కంద‘ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఎనర్జిటిక్ రామ్, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మూవీలో ఓవర్ డోస్ యాక్షన్ కు ఓ రేంజులో విమర్శలు వచ్చాయి. బోయపాటి కథ విషయంలో ఎక్కువ కసరత్తులు చేయకుండా ఓన్లీ మాస్ ఎలిమెంట్స్ నే నమ్ముకుంటాడనే కామెంట్స్ వినిపించాయి.

ఇక ‘స్కంద‘ తర్వాత బోయపాటి సినిమా ఎవరితో అనేదే ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. అయితే ‘స్కంద‘ కంటే ముందే బోయపాటి.. సూర్య, అల్లు అర్జున్ లను లైన్లో పెట్టాడు. వాళ్లిద్దరూ బోయపాటితో సినిమాకి ఓ.కె. కూడా చెప్పారు. సూర్య, బన్నీ లలో హీరో ఎవరైనా సరే బోయపాటి తో సినిమా నిర్మించడానికి గీతా ఆర్ట్స్ కూడా ముందుకొచ్చింది. కానీ ‘స్కంద‘ తర్వాత సమీకరణాలు మారాయి. అటు సూర్య, ఇటు బన్నీ ఇప్పటికిప్పుడు బోయపాటితో సినిమా అంటే ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

పైగా అల్లు అర్జున్ ‘పుష్ప2‘ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత అట్లీ, సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్స్ లైన్లో ఉన్నారు. సూర్య కూడా సుధా కొంగర సినిమాతో పాటు వెట్రిమారన్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మైథలాజికల్ సబ్జెక్ట్ తో ‘కర్ణ‘ చిత్రం కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

సూర్య, అల్లు అర్జున్ తో పాటు బోయపాటి విష్ లిస్ట్ లో ఉన్న మరో హీరో మహేష్ బాబు. ప్రస్తుతం ‘గుంటూరు కారం‘తో బిజీగా ఉన్న మహేష్ ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఆ చిత్రం మొదలైతే.. ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. దాంతో ఇప్పుడు బోయపాటి నెక్స్ట్ మూవీకి హీరో ఎవరనేదే? మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మిగిలింది.

Related Posts