రివైండ్ 2023.. హీరో ఆఫ్ ది ఇయర్ బాలకృష్ణ

తెలుగు సినిమాకి మెయిన్ అట్రాక్షన్ ఎవరంటే హీరో అనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో హీరోలను వెండితెర ఇలవేల్పులుగా కొలుస్తుంటారు. తమ అభిమాన కథానాయకులు నటించిన సినిమాలను.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు అభిమానులు. ఇక.. తమ అభిమానులను రంజింపజేయడానికి ఆయా హీరోలు కూడా అంతే స్థాయిలో కష్టపడుతుంటారు. మరి.. ఈ ఏడాది మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎలాంటి సినిమాలు అందించారు.. ఏ ఏ కథానాయకులు విజయాలందుకున్నారు ఈ రివైండ్ 2023లో చూద్దాం.

ముందుగా వెటరన్స్ విషయానికొద్దాం. ఆరు పదుల వయసు దాటినా ఇంకా నవ యవ్వన ఉత్సాహంతో ప్రేక్షకులను రంజిపంపజేయడానికి వరుస సినిమాలతో బిజీగా సాగుతున్నారు మన వెటరన్ స్టార్స్. టాలీవుడ్ కి నాలుగు స్థంభాల వంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లలో.. ఈ ఏడాది నాగార్జున, వెంకటేష్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించలేదు. మిగిలిన మెగాస్టార్, నటసింహం రెండేసి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.

సంక్రాంతి కానుకగా జనవరిలో ‘వీరసింహారెడ్డి’తో బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేసిన బాలకృష్ణ.. దసరా కానుకగా అక్టోబర్ లో ‘భగవంత్ కేసరి’తో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఊరమాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ రెండు సినిమాలు కథాంశాలు పరంగా వేటికవే విభిన్నమైనవి. అయినా.. ఈ రెండు సినిమాల్లోనూ తనదైన మాస్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ట్రీట్ అందించాడు నటసింహం. అందుకే.. ఈ ఏడాది టాలీవుడ్ కి హీరో ఆఫ్ ది ఇయర్ గా నటసింహం బాలకృష్ణ పేరే చెప్పాలి.

రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత అసలు సిసలు హిట్ కోసం ఎదురుచూసిన మెగాస్టార్ కి సైతం.. ఈ ఏడాది ఆ విజయం లభించింది. సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’గా మెగాస్టార్ మాస్ రోల్ లో మెస్మరైజ్ చేశాడు. ఆరున్నర పదుల వయసు దాటినా.. మెగాస్టార్ లో ఇంకా ఆ గ్రేస్, ఆ స్టైల్ తగ్గలేదనడానికి ‘వాల్తేరు వీరయ్య’ నిదర్శనం. అన్ని ఎమోషన్స్ తో ఈ సినిమాని డైరెక్టర్ బాబీ అద్భుతంగా ఆవిష్కరించాడు. అయితే.. ద్వితియార్థంలో ‘భోళా శంకర్’తో ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు మెగాస్టార్.

వెటరన్స్ తర్వాత నేటితరం స్టార్ హీరోస్ విషయానికొద్దాం. టాలీవుడ్ లో నేటితరం స్టార్ హీరోస్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్. అయితే వీరిలో ఇద్దరు తప్పితే.. మిగతా నలుగురు బడా హీరోలు 2023లో ఖాతా తెరవలేదు. ఈ సంవత్సరం మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ నుంచి సినిమాలేవీ రాలేదు.

ప్రెజెంట్ స్టార్ హీరోస్ లో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరొకరు రెబెల్ స్టార్ ప్రభాస్. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ కాంబోలో మల్టీస్టారర్ గా రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళ చిత్రం ‘వినోదాయ సిత్తం’ రీమేక్ గా సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ కు, డైలాగ్స్ కు మంచి పేరొచ్చింది.

రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి ఈ సంవత్సరం రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ‘ఆదిపురుష్’ కాగా.. మరొకటి ‘సలార్’. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఆదిపురుష్’ తీవ్రంగా నిరాశపరిస్తే.. ఇయర్ ఎండింగ్ లో రిలీజైన ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా దూసుకెళ్తుంది. విడుదలైన ఆరు రోజులకే వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు కొల్లగొట్టింది. సంక్రాంతి వరకూ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ‘సలార్’ కలెక్షన్ల సునామీ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

మిగతా స్టార్స్ విషయానికొస్తే మాస్ మహారాజ రవితేజ ఈ సంవత్సరం ముచ్చటగా మూడు సినిమాలను విడుదల చేశాడు. వీటిలో ‘వాల్తేరు వీరయ్య’ మల్టీస్టారర్ అయితే.. మిగతా సినిమాలు ‘రావణసుర, టైగర్ నాగేశ్వరరావు’. మెగా మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయాన్ని సాధించింది. కానీ.. ‘రావణసుర, టైగర్ నాగేశ్వరరావు’ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేపోయాయి.

నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది మార్చిలో ‘దసరా’ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రంలో ధరణి పాత్రలో ఆద్యంతం రస్టిక్ లుక్ లో సరికొత్త నాని కపిపించాడు. ఇక.. డిసెంబర్ లో రిలీజైన ‘హాయ్ నాన్న’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నేచురల్ స్టార్. బాలకృష్ణ తర్వాత రెండు సినిమాలను రిలీజ్ చేసి.. రెండింటితోనూ హిట్స్ కొట్టిన ఘనతను ఈ ఏడాది నాని సొంతం చేసుకున్నాడు.

ఇంకా.. మిగతా హీరోల్లో సాయిధరమ్ తేజ్ మెగా మల్టీస్టారర్ ‘బ్రో’తో ఫర్వాలేదనిపిస్తూ.. ‘విరూపాక్ష’తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి ‘స్కంద’ పెద్ద ఫ్లాప్ మిగిల్చింది. గోపీచంద్, వరుణ్ తేజ్, అఖిల్ వంటి హీరోలు ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు.

Related Posts