సినీ పద్మాలు.. చిరంజీవికి పద్మవిభూషణ్

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మవిభూషణ్ పొందిన నటుడిగా చిరంజీవి నిలవనున్నారు. ‘దేశంలో రెండో పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ రావడం గొప్ప విషయమని.. తన అభిమానులు, సినీ జగత్తు వల్లే ఇది తనకు వచ్చిందని.. ఈ క్రెడిట్ వారిదే’ అంటూ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2006లో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది.

తమిళనాడుకు చెందిన నటీమణి వైజయంతీమాల బాలి కూడా పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. 1933లో జన్మించిన వైజయంతీమాల 1949లో తమిళ చిత్రం ‘వళకై’తో తెరంగేట్రం చేశారు. అదే సినిమా తెలుగులో ‘జీవితం’ పేరుతో విడుదలైంది. ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లి అక్కడ అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఒకవిధంగా దక్షిణాది నుంచి హిందీ చిత్ర సీమకు వెళ్లి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తొలితరం నటీమణి వైజయంతీమాల గా చెప్పొచ్చు.

ఇటీవలే మరణించిన తమిళ నటుడు విజయకాంత్ కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు అగ్ర కథానాయకుడిగా అలరించిన విజయకాంత్ అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం పలకరించారు. కెప్టెన్ గా అందరికీ సుపరిచితుడైన విజయకాంత్ రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్ర వేశారు. గత డిసెంబర్ లో అనారోగ్యంతో కన్నుమూశారు విజయకాంత్.

పద్మభూషణ్ పురస్కారాల్లో మరో సినీ పద్మం మిథున్ చక్రవర్తి ఉన్నారు. తనదైన డ్యాన్సులతో యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపి డిస్కో డ్యాన్సర్ అనిపించుకున్న మిథున్ చక్రవర్తి బెంగాలీ, హిందీ సినిమాలలో అగ్ర నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం తన నటనతో మంత్రముగ్దుల్ని చేశారు మిథున్.

ప్రముఖ గాయని ఉషా ఉతప్‌ ని పద్మభూషణ్ పురస్కారం వరించింది. 1947 లో తమిళ అయ్యర్‌ కుటుంబంలో జన్మించారు ఉషా ఉతప్. చిన్నప్పటి నుంచే సంగీత ప్రపంచంలో పెరిగిన ఆమె పలు భాషల్లో గాయనిగా రాణించారు. ఇంకా.. ప్రముఖ సంగీత దర్శకుడు ప్యారేలాల్‌ రాంప్రసాద్‌ శర్మను పద్మభూషణ్ వరించింది. 1940 సెప్టెంబర్‌ 3న మంబయిలో జన్మించిన ఈయనను అందరూ ముద్దుగా బాబాజీ అని పిలుచుకుంటారు. హిందీ చిత్ర సీమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ప్యారేలాల్ రాంప్రసాద్ శర్మ సంగీతాన్ని సమకూర్చారు.

Related Posts