మహేష్ – విజయ్ మల్టీస్టారర్ ఈసారైనా సెట్ అవుతోందా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ దళపతి విజయ్ కి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. మహేష్ బాబు ఎలాగూ రీమేక్స్ చేయడు. అయితే.. మహేష్ నటించిన ‘ఒక్కడు, పోకిరి‘ వంటి సినిమాలను తమిళంలో రీమేక్ చేసి ఘన విజయాలందుకున్నాడు దళపతి విజయ్. ఇక.. మహేష్ బాబు, విజయ్ కలయికలో సినిమా రూపొందించాలని గతంలో చాలామంది డైరెక్టర్స్ ట్రై చేశారు.

వెటరన్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్‘ని మహేష్, విజయ్ కాంబోలో తెరకెక్కించాలనుకున్నాడు. కారణాలేమైనా అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత విక్రమ్, కార్తీ, జయం రవి కలయికలో ‘పొన్నియిన్ సెల్వన్‘ తీశాడు మణిరత్నం. గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా ‘స్నేహితుడు‘ సినిమా కోసం మహేష్, విజయ్ లను కలపాలనుకున్నాడు. అదీ కుదరలేదు. ఆ తర్వాత మురుగదాస్ సైతం వీరిద్దరి కలయికలో మల్టీస్టారర్ కోసం ఎదురుచూశాడు. కానీ.. ‘స్పైడర్‘ ఫ్లాప్ తో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయింది.

లేటెస్ట్ గా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. విజయ్, మహేష్ లను ఒకే ఫ్రేములో చూపిస్తానంటున్నాడు. విజయ్ తో ఇప్పటికే ‘బీస్ట్‘ వంటి ఫ్లాప్ ఇచ్చిన నెల్సన్.. తాను మళ్లీ దళపతితో సినిమా చేస్తే.. అది మల్టీస్టారర్ గానే ఉండబోతుందని హింట్ ఇచ్చాడు. ‘జైలర్‘ మూవీ విషయంలో తాను అప్లై చేసిన ఫార్ములానే విజయ్ చిత్రానికి ఫాలో అవుతాయని ఇటీవల ఓ ఇంటర్యూలో తెలిపాడు. తెలుగు నుంచి మహేష్ బాబు, హిందీ నుంచి షారుక్ ఖాన్, మలయాళం నుంచి మమ్ముట్టి వంటి స్టార్స్ ను విజయ్ సినిమాలో నటింపజేస్తానని దళపతి ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. అయితే.. ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీ అవుతోన్న విజయ్.. ఇప్పట్లో సినిమాలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ చేస్తే.. అది కూడా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తే.. మహేష్-విజయ్ మల్టీస్టారర్ ను కచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

Related Posts