గాండీవధారి అర్జున

రివ్యూ : గాండీవధారి అర్జున
తారాగణం : వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, అభినవ్ గోమటం, రవి వర్మ, వినయ్ రాయ్, విమలా రామన్, నరైన్ తదితరులు
ఎడిటర్ : ధర్మేంద్ర కాకరాల
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ : ముకేష్ జి, అమోల్ రాథోడ్
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

ప్రవీణ్ సత్తారు, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడు ఇద్దరూ అప్పటికి చెరో ఫ్లాప్ తో ఉన్నారు.దీంతో ఈ సారి స్ట్రాంగ్ కబ్ బ్యాక్ ఇస్తారు అని భావించారు చాలామంది. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ ఇది కంప్లీట్ గా ప్రవీణ్ సత్తారు సినిమా అనిపించుకుంది.అంచనాల పరంగా చూస్తే భారీగా అయితే కనిపించలేదు అనే చెప్పాలి.అయినా రిలీజ్ వరకూ బజ్ ఉంటుందనుకున్నారు. ఓపెనింగ్స్ చూస్తే అలా కనిపించలేదు. మరి ఈ మూవీ ఎలా ఉంది.. ? ప్రవీణ్, వరుణ్ ఏమైనా మ్యాజిక్ చేశారా అనేది చూద్దాం.

కథ :
అర్జున్(వరుణ్ తేజ్) రా ఏజెంట్ గా పనిచేస్తూ రిజైన్ చేసి ఇంగ్లండ్ కు వెళ్లిపోతాడు.తన తల్లి వైద్యానికి అవసరమయ్యే డబ్బును సంపాదించేందుకు అక్కడ హై ప్రొఫైల్ పర్సన్స్ కు సెక్యూరిటీ ఇచ్చే ఓ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు.అలాంటి వ్యక్తి వద్దకు ఇండియా నుంచి గ్లోబల్ వార్మింగ్ మీద జరిగే ఇంటర్నేషనల్ సమ్మిట్ కు వెళ్లిన ఓ సెంట్రల్ మినిస్టర్ ప్రొఫైల్ వస్తుంది. ఆ మినిస్టర్ కు ప్రాణహాని ఉంటుంది. అతన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాడు అర్జున్. మినిస్టర్ తో ఆయన సెక్రటరీ ఐరా(సాక్షి వైద్య) ఉంటుంది. ఐరాకి, అర్జున్ కి ఒక పాస్ట్ కూడా ఉంటుంది.దాని వల్లే అతను ఆ మిషన్ నుంచి తప్పుకుంటాడు. మరి సెంట్రల్ మినిస్టర్ కు ఎవరి వల్ల ప్రాణహాని ఉంది..? అర్జున్, ఐరాల గతం ఏంటీ..? అర్జున్ తల్లికి ఏమైంది..? అర్జున్ తిరిగి సెంట్రల్ మినిస్టర్ ను కాపాడతాడా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది.. :

కొన్ని కథలు సులువుగానే ఊహించొచ్చు. ఈ కథ కూడా అలాంటిదే. సినిమా అంతా యూకేలో సాగుతుంది.సిఎన్.జి అనే కంపెనీకి ఇండియాలోని పర్యావరణాన్ని రక్షించే బాధ్యత(లేదా కాంట్రాక్ట్)ఇచ్చే ప్రయత్నం చేస్తుంది యూకే. ఆ సదస్సులో ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల జరిగే నష్టాలను ఆధారాలతో సహా ప్రెజెంట్ చేయాలనుకుంటాడు సెంట్రల్ మినిస్టర్. అందుకే అతన్ని చంపాలనుకుంటారు. అందుకోసం అతని మనవరాలును అడ్డు పెట్టుకుంటాడు విలన్ కమ్ మినిస్టర్ మాజీ అల్లుడు. ఆ పాపను కాపాడి మినిస్టర్ బాధ్యత నెరవేర్చేలా చేయడమే ఈ చిత్ర కథ.కాకపోతే ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో జరుగుతున్న ప్రకృతి విధ్వంసానికి కారణం ఎవరు..? దాని వల్ల తలెత్తుతున్న సమస్యలేంటీ..? పర్యావరణం ఎలా పాడవుతుంది.. అంతు చిక్కని వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి అనే పాయింట్స్ ను చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఇందుకోసం చివరి పావుగంట వరకూ వెయిట్ చేయించాడు. దానికి ముందైనా గొప్ప కథ, కథనం కనిపిస్తుందా అంటే లేదు. ఇంకా చెబితే ఇండియాలో పర్యావరణం పాడవుతున్న విషయాన్ని మినిస్టర్ వరకూ తెచ్చేది ఓ ఎన్విరాన్ మెంట్ స్టూడెంట్. ఆమె యూకే అతనికి పెన్ డ్రైవ్ ఇచ్చే వరకూ అతనికి ఈ విధ్వంసం గురించి తెలియదు.

అయినా అతనికి ప్రాణహాని ఉండటం విచిత్రంగా ఉంది. అఫ్ కోర్స్ ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తారు. హీరోతో పాటు ఉండగానే ఆమెను చంపేస్తారు. ఇది సగటు తెలుగు ప్రేక్షకుడికి మింగుడు పడని విషయం. ఇది ఎంత సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తి పాత్ర అయినా మన ప్రేక్షకులు హీరోను హీరోగానే చూస్తారు కదా. ఇక ఫస్ట్ హాఫ్ లో వరుణ్ తేజ్ ఎక్కడా తెలివైన ఏజెంట్ గా కనిపించడు. ఏ సాహసాలూ ఉండవు. ఉన్న ఒక్క అవకాశంలో ఒక అమ్మాయి చనిపోతున్నా ఏం చేయడు. పైగా ఆ కేస్ తన మీదకు వస్తే తప్పించుకు తిరిగి ఆమెను చంపిన వాడిని తెచ్చి పోలీస్ లకు దొంగతనంగానే అప్పగిస్తాడు.ఇవన్నీ చూస్తే ఓ సూపర్ కాప్ లా కానీ.. సూపర్ ఏజెంట్ లా కానీ అతను కనిపించడు. తన ప్రేమ కథ, అతని తల్లి కథ కూడా సహజంగా అనిపించదు. ఇక నాజర్ కుటుంబ వ్యవహారం ఇన్వాల్వ్ అవడం కూడా అంత అవసరం అనిపించదు. ఇదంతా కథను ముందుకు తీసుకువెళ్లే సన్నివేశాలే తప్ప.. కథలో సహజంగా భాగమైనట్టుగా ఉండవు.ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా సిల్లీగా ఉంటుంది. ఆ ఫైట్ జరుగుతున్నప్పుడే నాజర్.. మన దేశ పర్యావరణం ఎందుకు కలుషితం అవుతుందనే కోణంలో ఓ ప్రెజెంటేషన్ ఇచ్చి.. అందుకు కారణం యూకే అని తేలుస్తాడు. ఇది నాజర్ నటన వల్ల ఆకట్టుకుంటుంది. కానీ ప్రవీణ్ చెప్పాలనుకున్న అసలు పాయింట్ ఇదే. ఈ పాయింట్ కోసం మిగతా సినిమా అంతా ఏవేవో చూపించడం మైనస్ గా అనిపిస్తుంది. ప్రవీణ్ సినిమాల్లో యాక్షన్ బావుంటుంది. సాధారణ సినిమాల్లోనే స్టైలిష్ గా చూపించిన అతను ఈ మూవీలో మాత్రం తేలిపోయాడు. ఓవరాల్ గా చూస్తే ఇదో రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మిగిలిపోతుంది.

నటన పరంగా వరుణ్ తేజ్ ఈ పాత్రను బలవంతంగా చేస్తున్నాడా అనిపిస్తుంది. ఒక్కోసారి సిన్సియర్ గా కనిపించినా ఒక్కోసారి కన్ఫ్యూజింగ్ గా ఉంటాడు. ఓ రకంగా ఈ పాత్రను అతను పూర్తిగా అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది కూడా. సాక్షివైద్య ఐఏఎస్ గా సూట్ కాలేదు. కానీ పాత్రగా బానే నటించింది. మిగిలింది నాజర్. అతనే ఈ సినిమాకు బలమైన పిల్లర్.తనవంతుగా బాగా చేశాడు. విలన్ గా వినయ్ రాయ్ బావున్నా.. అతని పాత్రలో బలం లేదు. విమలా రామన్ ఓకే. అభినవ్ గోమటంను వాడుకోలేదు. రవివర్మ, నరైన్, మనీష్ చౌదరి ఓకే. ఎన్విరాన్ మెంటల్ స్టూడెంట్ గా రోషిణి ప్రకాష్ బాగా చేసింది.

టెక్నికల్ గా నేపథ్య సంగీతం బావుంది.రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. కొన్ని షాట్స్ బలే ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ పరంగా పెద్దగా కంప్లైంట్స్ లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా ప్రవీణ్ సత్తారు ఎంచుకున్న పాయింట్ బావుంది. దాన్ని ఎఫెక్టివ్ గా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. ఇలాంటి పాయింట్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకుడిలో తెలియని భయం, బాధ్యత కనిపించాలి. అది పూర్తిగా మిస్ అయింది. అయినా ఒక మంచి సందేశం మిళితమైన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాలి అనే సజెస్ట్ చేయాలి.

ప్లస్ పాయింట్స్ :
వరుణ్ తేజ్
సంగీతం
సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

కథ, కథనం
దర్శకత్వం
యాక్షన్ సీక్వెన్సెస్
ఫస్ట్ హాఫ్

ఫైనల్ గా : గాండీవం ధరించడం మర్చిపోయిన అర్జునుడు

రేటింగ్ : 2.5/5

– బాబురావు. కామళ్ల

Related Posts