లంబసింగి మూవీ రివ్యూ.

లంబసింగి.. ఈ పేరుతో సినిమా రావడం.. గ్లామర్ బ్యూటీ , బిగ్ బాస్ ఫేమ్ దివి వద్యా , భరత్‌రాజ్ మెయిన్‌లీడ్ చేయడంతో ఆసక్తి క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్లు సాధించిన కళ్యాణ్‌ కృష్ణ కురసాల ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెట్టడం కూడా సినిమాకు బజ్ క్రియేట్ అయ్యింది. నవీన్ గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘లంబసింగి’ అనుకున్న అంచనాలను రీచ్ అయ్యిందా లేదా ? ఈ రివ్యూలో చూద్దాం.

కథ : లంబసింగి ఊరికి కానిస్టేబుల్‌గా అప్పాయింట్ అవుతాడు వీరబాబు (భరత్‌రాజ్). చాలామంది మాజీ నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాసం కల్పించే ఊరు అది. లంబసింగికి పోస్టింగ్ తీసుకుని బస్సు దిగగానే వీరబాబు నర్స్‌గా పనిచేసే హరిత (దివి వద్యా) ను చూస్తాడు. వెంటనే ఆకర్షితుడవుతాడు. పునరావాసం కల్పించబడ్డ నక్సలైట్ల సంతకాలు తీసుకుని అబ్జర్వేషన్‌ చేయడం వీరబాబు డ్యూటీ. ఈ హరిత ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తుంది. ఆమెను ప్రేమలో పడేసే క్రమంలో హరిత తండ్రితో సంతకాలు చేయించే డ్యూటీ పేరుతో ట్రై చేస్తుంటాడు. ఓ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకు దగ్గరవుతాడు వీరబాబు. తను ప్రేమిస్తున్నట్టు చెప్తాడు. కానీ హరిత రిజెక్ట్ చేస్తుంది. ఓరోజు ఒక్కడే స్టేషన్‌లో ఉండగా నక్సలైట్లు దాడి చేసి స్టేషన్‌లో ఉన్న ఆయుధాలు తీసుకెళ్తారు.. ఆ దాడిలో వీరబాబు గాయపడతాడు.. అక్కడ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. అదేంటి ? హరిత ప్రేమను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ? చివరికేమయిందనేది తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ : లంబసింగి అనేది అందమైన ఊరు. ఆ ఊరిపేరుతో కథ చెప్తున్నపుడు అంతే అందమైన ప్రేమకథను ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ప్రేమలో ఉండే వేరియేషన్స్‌ని, ఓ సామాజిక అంశాన్ని జోడించి చక్కగా డిజైన్ చేసాడు దర్శకుడు. ముఖ్యంగా హరిత క్యారెక్టర్‌ చాలా ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌ అంతా.. హీరో హీరోయిన్ ని ప్రేమలో పడేసే క్రమాన్ని చూపించాడు. కాస్త స్లో నేరేషన్‌లా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథ వేగం పుంజుకుంటుంది. ఇక అక్కడినుంచి ప్రేక్షకులు పూర్తిగా కథలో లీనమవుతారు. వన్ లైనర్స్‌, వీరబాబు, రాజు క్యారెక్టర్లు చేసే కామెడీ బాగా పేలాయి. సాదాసీదా ప్రేమ కథగా మొదలుపెట్టి ఎమోషనల్‌ ఫీల్ ఆడియెన్స్ బయటకొచ్చేలా చేస్తుంది లంబసింగి.

నటీనటులు : ఈ సినిమాకి మెయిన్ అస్సెట్‌ దివి వద్యా. ఇప్పటిదాకా దివిని ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో చూసాం . కానీ ఈ సినిమాలో సహజ నటనతో ఆకట్టుకుంటుంది. హరిత పాత్రలో దివి నటన చూడముచ్చటగా ఉంది. వీరబాబు క్యారెక్టర్‌లో భరత్‌రాజ్ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ తన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. కామెడీ విషయంలోనూ భరత్‌రాజ్‌ భేష్ అనిపించాడు. ఇక వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.

టెక్నిషియన్స్ : నవీన్ గాంధీ దర్శకత్వ ప్రతిభకు ‘లంబసింగి’ బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించేలా తీసాడు. బోర్‌ కొట్టకుండా తీయడంలో సక్సెస్‌ అయ్యాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సెకండాఫ్‌ను పరిగెత్తించాడు. లంబసింగి అనే ప్రపంచంలోకి ప్రేక్షకుడు వెళ్లేలా డిజైన్ చేసాడు. ఆర్‌.ఆర్‌ ధృవన్ మ్యూజిక్ మరో హైలైట్‌. వినగానే ప్రతి పాట ఎక్కేసేలా ఉంటుంది. తెరపై కూడా వాటిని అందంగా ప్రెజెంట్ చేశాడు కె.బుజ్జి. ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి కూడా తన పనితనంతో మెప్పించాడు.

రేటింగ్ : 2.5 / 5

బోటమ్‌లైన్‌ : లంబసింగి.. ఆకట్టుకునే అందమైన ఎమోషనల్ డ్రామా

Related Posts