సుకుమార్ కాంపౌండ్ నుంచి మరో డైరెక్టర్

హీరో డామినేటింగ్ ఇండస్ట్రీగా చెప్పుకునే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ కి ఉండే క్రేజే వేరు. ఆ దర్శకులు హీరోలకు దీటుగా పారితోషికాలు పుచ్చుకుంటున్నారు. హీరోలకు దీటుగా ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతోన్న సుక్కూ.. తాను ఎదగడమే కాకుండా.. తన శిష్యులను కూడా దర్శకులుగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రెజెంట్ టాలీవుడ్ లోని అరడజనుకు పైగా డైరెక్టర్స్.. సుకుమార్ కాంపౌండ్ నుంచి రావడం విశేషం.

సుకుమార్ కాంపౌండ్ నుంచి మొదటగా వచ్చిన దర్శకుల్లో పల్నాటి సూర్య ప్రతాప్ ను చెప్పొచ్చు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ‘కుమారి 21ఎఫ్’ సంచలన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నిఖిల్, అనుపమ జంటగా ’18 పేజెస్’ మూవీని డైరెక్ట్ చేశాడు సూర్య ప్రతాప్. ఈ చిత్రాన్ని కూడా సుకుమార్.. గీతా ఆర్ట్స్ 2 సంస్థతో నిర్మించాడు. ఇక.. సుకుమార్ శిష్యుల్లో తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు సాధించిన ఘనత పొందాడు బుచ్చిబాబు.

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని సాధించిన ‘ఉప్పెన’ సినిమా.. హీరోగా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ గా కృతి శెట్టి లకు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ డమ్ ను తీసుకొచ్చింది. ‘ఉప్పెన’ విజయం తర్వాత బుచ్చిబాబు ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఇక.. సుక్కూ అసిస్టెంట్స్ లో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ డైరెక్టర్ మున్నా ఒకడు. యాంకర్ ప్రదీప్ హీరోగా రూపొందిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ‘ప్లే బ్యాక్’ మూవీ డైరెక్టర్ హరి ప్రసాద్ జక్కా కూడా సుకుమార్ శిష్యుడే.

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల కూడా శ్రీకాంత్ శిష్యుడే. ‘దసరా’ సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ నానితోనే శ్రీకాంత్ ఓదెల సినిమా చేస్తున్నాడు. ఇక.. ‘విరూపాక్ష’తో సాయిధరమ్ తేజ్ కి బడా హిట్ అందించిన కార్తీక్ దండు కూడా సుకుమార్ రైటింగ్స్ నుంచే డైరెక్టర్ గా మంచి విజయాన్ని సాధించాడు.

లేటెస్ట్ గా సుహాస్ ‘ప్రసన్నవదనం’ సినిమాతో సుకుమార్ మరో శిష్యుడు అర్జున్ వై.కె. దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుకుమార్ తో ‘జగడం’ చిత్రం నుంచి ట్రావెల్ అవుతూ వచ్చాడు అర్జున్. ఈ యంగ్ డైరెక్టర్ లో మంచి రైటింగ్ టాలెంట్ ఉందని గురువు సుకుమారే స్వయంగా చెప్పాడు. మరి.. మే 3న విడుదలవుతోన్న ‘ప్రసన్నవదనం’తో అర్జున్ ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.

Related Posts