‘రత్నం‘ సినిమా రివ్యూ

నటీనటులు: విశాల్, ప్రియ భవాని శంకర్, సముద్రఖని, యోగి బాబు, మురళిశర్మ తదితరులు
సినిమాటోగ్రఫి: ఎం. సుకుమార్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఎడిటింగ్‌: టి.ఎస్. జై
స్టంట్స్: కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, విక్కీ
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్, ఇన్వేనియో ఆరిజిన్
దర్శకత్వం: హరి
విడుదల తేది: ఏప్రిల్ 26, 2024

విశాల్ అంటేనే యాక్షన్ స్టార్. ఇక.. విశాల్ లోని యాక్షన్ ను మరింత ఎలివేట్ చేయడంలో సిద్ధహస్తుడు డైరెక్టర్ హరి. ఈ ఇద్దరి కాంబోలో ఇంతకుముందు వచ్చిన ‘భరణి, పూజ‘ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కలిసి పనిచేసిన చిత్రం ‘రత్నం‘. ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘రత్నం‘ సినిమాతో వీరు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? సినిమా ఎలా ఉంది? వంటి విశేషాలు ఈ విశ్లేషణలో చూద్దాం.

కథ
డైరెక్టర్ హరి గత సినిమాల తరహాలోనే ఈ చిత్రం కథ ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో జరుగుతుంది. నగరి ఎమ్మెల్యే పన్నీరు స్వామి (సముద్రఖని)కి కుడిభుజంలా ఉంటాడు రత్నం (విశాల్). ఆ ఏరియాలో రత్నం కు ఎదురులేదు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఒక్క నిమిషం ఆలస్యం చేయడు. వెంటనే రంగంలోకి దిగిపోతాడు. మరోవైపు తిరుత్తణి ఏరియాలో లింగం (మురళీశర్మ) ఆగడాలు మితి మీరిపోతుంటాయి. లింగం మనుషులు మల్లిక (ప్రియా భవానీ శంకర్)ను హతమార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. రత్నం తిరిగే ఏరియాలోనే మల్లిక మీద అటాక్ ప్లాన్ చేస్తారు. మల్లికను ఎప్పుడో చూసినట్టు.. తనకు బాగా కావాల్సిన వ్యక్తి అనిపించడంతో.. తనను ఎలాగైనా కాపాడాలనుకుంటాడు రత్నం. ఆమెకు అండగా నిలబడతాడు. అసలు మల్లిక ఎవరు? లింగం బ్రదర్స్ ( మురళీ శర్మ, హరీష్ పేరడీ, అలాగే మరొకరు) ఎందుకు మల్లికను టార్గెట్ చేశారు? చివరికి రత్నం మల్లికని కాపాడాడా లేదా? అనేదే మిగతా స్టోరీ.

విశ్లేషణ
ఒక అమ్మాయికి సమస్య.. ఓ రౌడీ ఆమె కోసం నిలబడి విలన్స్ తో పోరాడతాడు. కథ పరంగా ఇంతే. గతంలో చాలాసార్లు సిల్వర్ స్క్రీన్ పై చూసిన సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు డైరెక్టర్ హరి ‘రత్నం‘ కోసం మళ్లీ పాత సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ హరి గత సినిమాలన్నీ మన మైండ్ లో చక్కర్లు కొడతాయి. హరి తీసిన ఎన్నో సినిమాల మాదిరిగానే ఇదీ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ లోనూ ఏమాత్రం కొత్తదనం కనిపించదు.

సినిమా ప్రారంభం నుంచి కాస్త ఆసక్తి పెంచుతూ వెళ్లిన దర్శకుడు దాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతూనే ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ మీద మరింత ఆసక్తి పెంచేలా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ కి వెళ్ళిన తర్వాత కథలో వేగం తగ్గిపోతుంది. ఇంకా సినిమా అయిపోలేదా? అనే ఫీలింగ్ వస్తుంది. ట్విస్టులు కూడా ముందే ఊహించేవిగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మితిమీరిన రక్తపాతం కుటుంబం అంతా కలిసి చూసే అవకాశాన్ని దూరం చేయొచ్చు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
విశాల్‌ కు ఇలాంటి తరహా పాత్రలు కొత్తేమీ కాదు. కెరీర్ ఆరంభం నుంచి ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నాడు. ఇక.. ‘రత్నం‘ పాత్రలో విశాల్ ఒదిగిపోయినా.. కథలో బలం లేకపోతే ఎవరూ ఏం చేయలేరు. ప్రియా భవానీ శంకర్ పాత్రకి మంచి ఇంపార్టెన్స్ ఉంది. సముద్రఖని సపోర్టింగ్ రోల్ లో ఫర్వాలేదనించాడు. మురళీ శర్మ తనదైన విలనీలో రెచ్చిపోయాడు. ఇక.. యోగి బాబు ఉన్నా ఈ సినిమాలో కామెడీ కోసం పెద్దగా చేసిందేమీ లేదు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో దుమ్మురేపే దేవిశ్రీ.. ‘రత్నం‘కి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాడనిపిస్తుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ.. హరి గత సినిమాల తరహాలోనే రేసీగా సాగుతాయి.

చివరగా
మొత్తంగా.. ‘రత్నం‘ ప్యూర్లీ యాక్షన్ ప్రియుల కోసమే. లాజిక్స్, లింక్స్ వెతికితే సినిమా నచ్చదు. ఓవరాల్ గా ‘భరణి, పూజ‘ సినిమాలతో మంచి విజయాలందుకున్న విశాల్-హరి కాంబోకి ‘రత్నం‘తో హ్యాట్రిక్ హిట్ అనుమానమే!

రేటింగ్ : 2 / 5

Related Posts