తెలుగు సినిమా తమిళమయం అవుతోంది

తెలుగు సినిమావాళ్లు తెలుగు వారిని ప్రోత్సహించరు అంటారు. ఈ మాట ఎక్కువగా హీరోయిన్ల విషయంలో వినిపిస్తుంది. హీరోయిన్లే కాదు.. టెక్నీషియన్స్ విషయంలోనూ ఈ వివక్ష ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు తెలుగులో టివి రాజు, సత్యం, సాలూరి వంటి వారు అద్భుతమైన సంగీతం అందిస్తున్నా.. తమిళ్ నుంచి ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్ లాంటి వారిని ఎక్కువగా ప్రోత్సహించారు.

తర్వాత కూడా ఇళయరాజానే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రాజ్ కోటి, కీరవాణి, మణిశర్మ వంటి వారు వచ్చిన తర్వాత కొంత వరకూ తమిళ్ వారి డామినేషన్ తగ్గింది. అప్పుడప్పుడూ ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ కాలేదు.

ఆస్కార్ విన్నర్ అయిన ఏఆర్ రహ్మాన్ 1994లోనే తెలుగులో సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్ చిత్రాలకు సంగీతం ఇస్తే రెండూ పోయాయి. తర్వాత కొన్నాళ్లకు పవన్ కళ్యాణ్ కొమురం భీమ్, మహేష్‌ బాబు నాని చిత్రాలకు సంగీతం ఇస్తే ఈ రెండూ డిజాస్టర్స్ అయ్యాయి.

అప్పటి నుంచి రహ్మాన్ తెలుగువాళ్లు పట్టించుకోలేదు. కానీ అప్పుడప్పుడూ కొంతమంది తమిళ్ దర్శకులు తెలుగులో హల్చల్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం మొత్తం హవా వారిదే. వరుసగా స్మాల్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ కోలీవుడ్ సంగీత దర్శకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి ఆ లిస్ట్ ఎలా ఉందో చూద్దాం.

జివి ప్రకాష్‌ కుమార్

ఏఆర్ రహ్మాన్ మేనల్లుడుగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు జివి ప్రకాష్ కుమార్. కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఇప్పటికే 80కి పైగా సినిమాలకు సంగీతం అందించాడు. సంగీతం చేస్తూనే హీరోగానూ రాణిస్తున్న జివి ప్రకాష్‌.. రీసెంట్ గా తెలుగులో సార్ అనే చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ఈ మూవీని వాళ్లు తమిళ్ సినిమా లిస్ట్ లోనే వేసుకున్నారు.

ఈ సినిమా తర్వాత జివి ప్రకాష్‌ పై టాలీవుడ్ మనసు పారేసుకుందా అన్నట్టుగా అతని చేతిలో ఇప్పుడు ఏకంగా ఐదు తెలుగు సినిమాలున్నాయి. రవితేజ టైగర్ నాగేశ్వరరావు అతని తొలి తెలుగు సినిమాగా చెప్పొచ్చు. తర్వాత వరుసగా నితిన్ – వెంకీ కుడుముల సినిమా, వైష్ణవ్ తేజ్ ఆదికేశవతో పాటు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో దుల్కర్ సాల్మన్ నటించబోతోన్న తెలుగు సినిమాకూ అతనే సంగీత దర్శకుడు. ఈ ఐదు సినిమాలతో అతను టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

అనిరుధ్ రవిచంద్రన్

కోలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు అనిరుధ్. అతనికోసం మనవాళ్లు వెర్రెత్తిపోతున్నారు. గతంలోనే పవన్ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి, నాని గ్యాంగ్ లీడర్ చిత్రాలకు సంగీతం ఇచ్చాడు. బట్ ఈ రెండు సినిమాలూ పోయాయి.

అయినా ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న దేవర చిత్రానికి అతనే సంగీత దర్శకుడు. అలాగే విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబోలో దిల్ రాజు నిర్మించే సినిమాకూ అతనే సంగీత దర్శకుడు. ఈ రెండు సినిమాలతో పాటు నాగ చైతన్య – చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చే సినిమా కోసం కూడా అతన్ని సంప్రదిస్తున్నారు.

సంతోష్ నారాయణన్

రీసెంట్ గా తెలుగులో దసరా సినిమాతో పరిచయం అయ్యాడు సంతోష్‌ నారాయణన్. ఈ మూవీతో ఏకంగా అతనికి ప్రాజెక్ట్ కే తగిలింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తోన్న ప్రాజెక్ట్ కే సంగీతం ఇవ్వడం అంటే సంతోష్ కు ఓ లైఫ్‌ టైమ్ అచీవ్ మెంట్ లాంటిదే అని చెప్పాలి. దీంతో పాటు శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేష్ 75వ సినిమాగా వస్తోన్న సైంధవ్ కు అతనే సంగీతం ఇస్తున్నాడు. రీసెంట్ గా అనౌన్స్ అయిన మహి వి రాఘవ యాత్ర2 చిత్రానికీ అతన్నే సంగీత దర్శకుడుగా తీసుకున్నారు.

ఏఆర్ రహ్మాన్

తెలుగులో రెహ్మాన్ సంగీతం అందించిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. అయినా ఇంకా అతని వెనక పడుతున్నారు మన మేకర్స్. లేటెస్ట్ గా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోతోన్న చిత్రానికి రెహ్మాన్ ను ఫైనల్ చేసుకున్నారు. రహ్మాన్ తెలుగు సినిమా చేస్తే ఫ్లాప్ అని తెలిసినా వాళ్లు ఈ ఆస్కార్ విన్నర్ వైపే మొగ్గు చూపించారు. అలాగే చందు మొండేటి- నాగ చైతన్య సినిమాకు కూడా రెహ్మాన్ ను అనిరుధ్ తో పాటుగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఇంకా ఎవరూ కన్ఫార్మ్ కాలేదు.

హ్యారీస్ జయరాజ్

తెలుగులో అప్పుడప్పుడూ మెరిసే హ్యారీస్ జయరాజ్ తమిళ్ లో డల్ అయ్యాడు. బట్ తెలుగులో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం అతను నితిన్ – వక్కంతం వంశీ కాంబోలో వస్తోన్న చిత్రంతో పాటు నాగశౌర్య 24వ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో అతని సంగీతం కీలకం అయ్యి.. సినిమాలూ విజయం సాధిస్తే.. హ్యారీస్ కు తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది.

యువన్ శంకర్ రాజా

ఇక యువన్ శంకర్ రాజా కూడా ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. మరి ఇంతమంది మధ్య మనవాళ్లు ఎక్కడా అంటే మాత్రం పెద్దగా కనిపించడం లేదు అనే చెప్పాలి. నిజానికి ఈ రేంజ్ సంగీతం ఇచ్చేవాళ్లు మన దగ్గర లేరా అంటే ఉన్నారు. కానీ అవకాశాలివ్వరు. ఇలా బయటి నుంచి తెచ్చి సంగీతం చేయించడం ఓ ప్యాషన్ అనుకుంటున్నారు కానీ.. దీని వల్ల బడ్జెట్ పెరగడం తప్ప పెద్దగా యూజ్ ఏం ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా తెలుగులో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హవా తగ్గదు అనే చెప్పాలి.

Related Posts