బాలీవుడ్ ని శాసిస్తున్న సౌత్ డైరెక్టర్స్

హిందీ చిత్ర పరిశ్రమ అంటేనే భారతీయ సినిమా మొత్తాన్ని ప్రతిబింబించే పరిశ్రమగా గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో పనిచేసే నటీనటులు, దర్శకనిర్మాతలకు దేశవ్యాప్తంగా రికగ్నిషన్ ఉంటుంది. అమితాబ్ మొదలుకొని షారుఖ్, అమీర్, సల్మాన్, హృతిక్ వంటి హీరోలకు ఉండే పాపులారిటీ వేరే లెవెల్. అలాగే.. కరణ్ జోహార్, రాజ్ కుమార్ హిరాణి, సంజయ్ లీలా భన్సాలీ వంటి డైరెక్టర్స్ కి కూడా భారీ స్థాయిలోనే గుర్తింపు ఉంది.

అయితే ‘బాహుబలి‘ తర్వాత ఈ సమీకరణాలన్నీ మారిపోయాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ, రాజ్ కుమార్ హిరాణి పేర్లు వినిపిస్తే.. ‘బాహుబలి‘ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి స్టార్ డైరెక్టర్ గా మారాడు రాజమౌళి. దర్శకధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే తెలుగుతో పాటు దక్షిణాది సినీ అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తారో.. అంతకు మించిన రీతిలో ఇప్పుడు యావత్ భారతదేశ సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రాజమౌళి తెలుగు హీరోలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. అది మన స్టార్స్ కి కూడా వరంగా మారిందనే చెప్పాలి. రాజమౌళి సినిమాలో నటిస్తే చాలు పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని రాజమౌళి ప్రపంచవ్యాప్తం చేస్తే.. కన్నడ ఇండస్ట్రీని గ్లోబల్ లెవెల్ లో నిలబెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ‘ఉగ్రం‘ చిత్రంతో కన్నడలో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్.. తొలి సినిమాతోనే శాండల్ వుడ్ లో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రశాంత్ సెకండ్ మూవీ ‘కె.జి.యఫ్‘ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విడుదలకు ముందు భారీ అంచనాలు లేకపోయినా.. రిలీజ్ తర్వాత ‘కె.జి.యఫ్‘ పాన్ ఇండియా లెవెల్ లో ఓ ప్రభంజనమే సృష్టించింది. ఆ తర్వాత ‘కె.జి.యఫ్2‘తో మరోసారి పాన్ ఇండియా సర్కిల్స్ లో హాట్ హాట్ డిస్కషన్స్ కు కారణమయ్యాడు ప్రశాంత్ నీల్. బాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా ప్రశాంత్ నీల్ తో పనిచేయడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయినా ప్రశాంత్ కూడా ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.

తెలుగు, కన్నడ తరహాలో.. తమిళం నుంచి పాన్ ఇండియా సర్కిల్స్ ను ఊపేస్తున్న పేర్లు లోకేష్ కనకరాజ్, అట్లీ. ‘ఖైదీ, విక్రమ్‘ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన సినిమాటికి యూనివర్శ్ ను సృష్టించుకున్నాడు లోకేష్ కనకరాజ్. కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్‘ సినిమా సౌత్ తో పాటు నార్త్ లోనూ ఓ ఊపు ఊపేసింది. హై ఇంటెన్స్ స్క్రీన్ ప్లేతో సాగే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ ‘విక్రమ్‘ తర్వాత ఇప్పుడు ‘లియో‘తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు లోకేష్. ఆ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య లతో సినిమాలను లైన్లో పెట్టాడు.

లోకేష్ కనకరాజ్ తమిళ హీరోలతోనే కొనసాగుతుంటే.. మరో యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ఒకడుగు ముందుకేసి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో సినిమా చేశాడు. సెప్టెంబర్ 7న రిలీజైన షారుఖ్-అట్లీ ‘జవాన్‘ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ ‘జవాన్‘ వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అట్లీ అంటే బాలీవుడ్ లో ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అట్లీతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్స్ అంతా క్యూ కడుతున్నారు. కానీ అట్లీ మాత్రం మళ్లీ సౌత్ లో విజయ్ తో పనిచేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. అల్లు అర్జున్ తోనూ అట్లీ ఒక సినిమాని లైన్లో పెట్టాడు.

సౌత్ నుంచి వెళ్లి నార్త్ ను ఊపేసిన డైరెక్టర్స్ లిస్టులో టాలీవుడ్ నుంచి సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నాడు. ఒకే ఒక్క చిత్రం ‘అర్జున్ రెడ్డి‘తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి.. ఇదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్‘గా రీమేక్ చేసి అక్కడా భారీ విజయాన్ని సాధించాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ‘యానిమల్‘ సినిమా రాబోతుంది. బాలీవుడ్ చాక్ లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమాలో రణ్ బీర్ కి జోడీగా రష్మిక నటిస్తే.. కీలక పాత్రల్లో అనిల్ కపూర్, బాబీ డియోల్ కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ తో ‘యానిమల్‘పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేసిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత మాత్రం వరుసగా అల్లు అర్జున్, ప్రభాస్ వంటి టాలీవుడ్ స్టార్స్ ని లైన్లో పెడుతున్నాడు.

Related Posts