చరణ్ – హిరాణి! వాట్ ఎ కాంబో

‘ఆర్.ఆర్.ఆర్‘ ప్రభంజనం తర్వాత గ్లోబర్ స్టార్స్ గా అవరతించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ‘ఆర్.ఆర్.ఆర్‘ చిత్రంలోని రామ్, భీమ్ లుగా చెర్రీ, తారక్ లు పోషించిన పాత్రలు ఎప్పటికీ మరవలేనివి. అందుకే బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ అంతా ఈ ఇద్దరు క్రేజీ స్టార్స్ తో పనిచేయడానికి పోటీ పడుతున్నారు. ఈ లిస్టులో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందున్నాడు. ‘బ్రహ్మాస్త్ర‘ డైరెక్టర్ అయన్ ముఖర్జీ తో ‘వార్ 2‘కి ఓ.కె. చెప్పాడు తారక్. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ఓ బాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అతను అలాంటి ఇలాంటి డైరెక్టర్ కాదు. ఇప్పటివరకూ అపజయమెరుగని దర్శకుడిగా బీటౌన్ లో ఓ సెపరేట్ క్రేజున్న డైరెక్టర్. అతనే రాజ్ కుమార్ హిరాణి. తొలుత ఎడిటర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజ్ కుమార్ హిరాణి 2003లో ‘మున్నాభాయ్ ఎమ్.బి.బి.స్‘తో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మొత్తం సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలో ‘మున్నాభాయ్‘ రీమేక్ అయ్యింది. ఈ చిత్రం రీమేక్ గానే తెలుగులో చిరంజీవి ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్‘ రూపొందింది.

ఇక ఆ తర్వాత రాజ్ కుమార్ హిరాణి చేసిన ‘లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పి.కె., సంజు‘ వేటికవే భారీ విజయాలు సాధించాయి. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో ‘డంకి‘ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ఈ వెర్సటైల్ డైరెక్టర్. ‘డంకి‘ తర్వాత రాజ్ కుమార్ హిరాణి.. రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్న మాట.

ప్రస్తుతం రామ్ చరణ్ ముంబైలో విహరిస్తున్నాడు. ధోని తో కలిసి ఓ యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ యాడ్ షూట్ తో పాటు రాజ్ కుమార్ హిరాణితో చేయబోయే సినిమాకి సంబంధించిన చర్చల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడట చెర్రీ. అన్నీ ఓ.కె. అయితే త్వరలోనే చరణ్-హిరాణి ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం.

Related Posts