సంక్రాంతి ఫైట్ మామూలుగా లేదు

ఈ సంక్రాంతి ఫైట్ మామూలుగా ఉండేలా లేదు. ప్రతీ సంవత్సరం సంక్రాంతి బరిలో మూడు, నాలుగు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే.. వాటిలో రెండు, మూడు పెద్ద చిత్రాలైతే.. మరో ఒకటి, రెండు చిన్న చిత్రాలు ఉంటాయి. కానీ.. ఈసారి సంక్రాంతి సమరం సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. విడుదలవుతోన్న ఆరు సినిమాలు వేటికవే విభిన్నంగా రాబోతున్నాయి.

సంక్రాంతి వంటి సీజన్లలో ముందుగా బెర్తులు ఖరారు చేసుకోవడం కామన్ గా జరిగేదే. అయితే.. సంక్రాంతి దగ్గర పడుతోన్న కొద్దీ వాటిలో కొన్ని సినిమాలు వాయిదా పడుతూ ఉంటాయి. కానీ.. ఈసారి సంక్రాంతికి ఎవరూ తగ్గేదే లే అంటూ పోటాపోటీగా ప్రచార చిత్రాలతో దూకుడు పెంచుతున్నారు. ఇక.. ఈ సంక్రాంతి సమరంలో అందరి చూపు ముందుగా వస్తోన్న ‘గుంటూరు కారం‘పైనే. మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబోలో వస్తోన్న సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజవ్వగా.. రేపు ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ‘గుంటూరు కారం‘ సినిమాతో పాటే.. పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది ‘హనుమాన్‘.

కాంపిటేషన్ ఎక్కువగా ఉండడంతో ‘హనుమాన్‘ వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కానీ.. ‘హనుమాన్‘ టీమ్ మాత్రం తాము కూడా ఏమీ తక్కువ కాదంటూ ఇటీవలే విడుదల తేదీని మరోసారి గుర్తు చేసింది. ‘గుంటూరు కారం‘ వస్తోన్న జనవరి 12నే ‘హనుమాన్‘ కూడా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే.. తెలుగు, తమిళంలలో హెవీ కాంపిటేషన్ ఉన్నా.. మిగతా భాషల్లో మాత్రం ‘హనుమాన్‘కి సంక్రాంతి సీజన్ కలిసొచ్చే అంశమే.

జనవరి 13న సంక్రాంతి కానుకగా రాబోతున్న చిత్రాలు ‘సైంధవ్, ఈగల్‘. అన్ని తరహా పాత్రలను ఈజీగా పోషించే వెంకటేష్, రవితేజ నటిస్తున్న సినిమాలివి. ఇక.. ఈ రెండు సినిమాల్లోనూ ఈ సీనియర్ హీరోలిద్దరూ వైవిధ్యంగా కనిపిస్తున్నారు. వెంకటేష్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘సైంధవ్‘ వస్తుంటే.. రవితేజ హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘ఈగల్‘ రాబోతుంది.

విడుదల తేదీలు ప్రకటించకపోయినా సంక్రాంతి బరిలో పక్కాగా వస్తామంటోన్న మరో రెండు చిత్రాలు ‘నా సామి రంగా, ఫ్యామిలీ స్టార్‘. గత సంక్రాంతి సీజన్లలో ‘సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు‘ వంటి విజయాలందుకున్న నాగార్జున ‘నా సామి రంగా‘ సినిమాని కూడా సంక్రాంతికి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. షూటింగ్ కి ముందే ఈ సినిమా కోసం ఓ స్పెషల్ ప్రోమోని షూట్ చేసి.. ఆమధ్య నాగార్జున బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నాగ్ లుక్ అదిరిపోయింది.

ఎమ్.ఎస్.రాజు తర్వాత సంక్రాంతి రాజుగా పేరు సంపాదించుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు. సంక్రాంతి సీజన్లలో కచ్చితంగా తన సినిమా ఉండేలా చూసుకునే దిల్ రాజు.. వచ్చే సంక్రాంతి కానుకగా ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమాని తీసుకొస్తున్నాడు. విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో ‘గీత గోవిందం‘ క్రేజ్ తో ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతి బరిలో వస్తోన్న చిత్రాల్లో పక్కా ఫ్యామిలీ కంటెంట్ తో వస్తోన్న సినిమా ఇదే అన్నట్టు అనిపిస్తుంది.

Related Posts