సీనియర్ హీరోల 2024 క్యాలెండర్

మెగాస్టార్ చిరంజీవికి గత ఏడాది మిశ్రమ ఫలితాన్ని మిగిల్చింది. ప్రథమార్థంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’తో ఘన విజయాన్నందుకున్న చిరు.. ద్వితియార్థంలో ‘భోళా శంకర్’తో ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. ఇక.. 2024లో మెగాస్టార్ నుంచి ఖచ్చితంగా ఒక సినిమా విడుదల గ్యారంటీ. అదే మెగా 156. ‘బింబిసార’తో బంపర్ హిట్ అందుకున్న వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో మరో మూవీని లైన్లో పెట్టాడు మెగాస్టార్. అలాగే.. అనిల్ రావిపూడితో చిరు చేయబోయే ప్రాజెక్ట్ పైనా త్వరలో క్లారిటీ రానుంది.

హిట్స్ లో హ్యాట్రిక్ కొట్టేసిన నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాని చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీలో బాలయ్య ను నెవర్ బిఫోర్ యాక్షన్ అవతార్ లో చూపిస్తున్నాడట డైరెక్టర్ బాబీ. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కనిపించబోతున్నాడు. ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నెక్ట్స్ మూవీస్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంక్రాంతి బరిలో ‘నా సామిరంగ’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు కింగ్ నాగార్జున. మలయాళం చిత్రం ‘పొరింజు మరియమ్ జోస్’ రీమేక్ గా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘నా సామిరంగ’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక.. ఈ ఏడాదే తన ప్రతిష్ఠాత్మక వందో సినిమాని అనౌన్స్ చేయబోతున్నాడు నాగ్.

నాగార్జున వందో చిత్రంకోసం సిద్ధమవుతుంటే.. వెంకటేష్ తన ప్రతిష్ఠాత్మక 75వ చిత్రంగా ‘సైంధవ్’ చేస్తున్నాడు. ‘హిట్’ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ సంక్రాంతి బరిలో సందడి చేయబోతుంది. సెంటిమెంట్, యాక్షన్ మేళవింపుతో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ‘సైంధవ్’ మంచి విజువల్ ట్రీట్ అందిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైనా త్వరలో క్లారిటీ రానుంది.

Related Posts