‘ప్రసన్నవదనం‘ రివ్యూ

నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు
సినిమాటోగ్రఫి: ఎస్‌.చంద్రశేఖరన్‌
సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌ ఆర్‌
నిర్మాతలు: మణికంఠ జేఎస్‌, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌
దర్శకత్వం: అర్జున్‌ వై.కె.
విడుదల తేది: 03-05-2024

తెలుగులో వరుసగా వైవిధ్యభరిత కథలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలందుకుంటున్నాడు సుహాస్. ఈకోవలోనే ‘ప్రసన్నవదనం‘ సినిమాతో ఈరోజు (మే 3) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సుకుమార్ శిష్యుడు అర్జున్ వై.కె. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. మరి.. ఈరోజు విడుదలైన ‘ప్రసన్నవదనం‘ ఎలా ఉంది? ఆడియన్స్ అటెన్షన్ ను పొందడంలో సఫలం అయ్యిందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ
సూర్య (సుహాస్‌) ఒక రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా తలకు గట్టిగా దెబ్బ తగలడంతో ఫేస్ బ్లైండ్ నెస్ డిజార్డర్ వస్తుంది. దీంతో.. ఎవరినీ గుర్తుపట్టలేడు. అయినా.. తన లోపం గురించి ఎవరికీ తెలియకుండా మ్యానేజ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో దారుణమైన హత్య చూస్తాడు. అమృత ( సాయి శ్వేతా) అనే అమ్మాయి సూర్య క‌ళ్ల ముందే హత్యకు గురువుతుంది. ఆమెను లారీ కింద తోసేసి చంపేస్తారు. సూర్యకు ఫేస్ బ్లైండ్ నెస్ వుండటం వ‌ల్ల హంత‌కుడిని గుర్తించ‌లేడు. అయితే.. హత్యకు గురైన అమృత‌కు న్యాయం జరగాలని భావించిన సూర్య.. పోలీసుల‌కు హ‌త్య గురించి చెబుతాడు? ఆ తర్వాత సూర్య అదే కేసులో నిందితుడిగా ఎలా మారాడు? ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా అతను ఎదుర్కొన్న కష్టాలేంటి? మధ్యలో ఆద్య (పాయ‌ల్ రాధాకృష్ణ)తో ప్రేమాయణం ఎలాంటి మలుపులకు కారణమైంది? అనేది మిగతా కథ.

విశ్లేషణ
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కథల్లో కనిపించే కొత్తదనం ‘ప్రసన్నవదనం‘లో కూడా చూడొచ్చు. సుకుమార్ దగ్గర దర్శకత్వం, రచన శాఖల్లో ఎంతో అనుభవం సంపాదించిన దర్శకుడు అర్జున్ వై.కె. ‘ప్రసన్నవదనం‘ కోసం యూనిక్ పాయింట్ తీసుకున్నాడు. ఇప్పటివరకూ తెలుగులో రానటివంటి ఫేస్ బ్లైండ్ నెస్ అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది.

ఫేస్ బ్లైండ్ నెస్ అనే పాయింట్ ను క్రైమ్ స్టోరీలో మిక్స్ చేసి ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి అర్జున్ చేసిన ప్రయత్నం అభినందనీయం. అందులో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు కూడా. అయితే.. థ్రిల్లర్ సినిమాల్లో ఉండే వేగం ఈ సినిమాలో కొన్ని చోట్ల మిస్సయ్యింది. ఫ‌స్ట్ హాఫ్ లో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. మర్డర్ జరిగిన అనంతరం కథ వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తికరం అనిపిస్తుంది. సెకండాఫ్ లోని సన్నివేశాలు గ్రిప్పింగ్ గా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా కొత్తగా ఉన్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
సిల్వర్ స్క్రీన్ పై నేచురల్ పెర్ఫామెన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నటుల్లో సుహాస్ కూడా ఉంటాడు. ఇక.. ఈ సినిమాలో సూర్య పాత్రలో ఎప్పటిలాగే సుహాస్ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ లోనూ అదరగొట్టాడు. సుహాస్, పాయల్ మధ్య లవ్ ట్రాక్ బాగుంది. మరొక నాయిక రాశీ సింగ్ పోలీస్ పాత్రలో కనిపించింది. వైదేహి గా పోలీస్ పాత్రకు రాశీ సింగ్ బాగా సూటయ్యింది. వైవా హర్ష, నితిన్ ప్రసన్న పాత్రలు కూడా ఈ సినిమాలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. నందు, సాయి శ్వేత.. తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికపరంగా ఈ సినిమాకి బలం రచన. మొదటి సినిమాయే అయినా.. తన గురువు సుకుమార్ మార్క్ ను ప్రతీ సీన్ లో ప్రతిబింబించేటట్టు చేయడంలో డైరెక్టర్ అర్జున్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ‘బేబి‘తో బడా హిట్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్.. ఈ సినిమాలో తన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. చంద్రశేఖరన్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది.

చివరగా
మొత్తంగా.. క‌థ‌లో మ‌లుపులు, సుహాస్ న‌ట‌న, ద్వితియార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ‘ప్రసన్నవదనం‘ సినిమాకి మంచి ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకి మైనస్ గా చెప్పుకోవాల్సి వస్తే.. ప్రారంభ సన్నివేశాలే అంతగా ప్రభావం చూపించవు. మొత్తంగా.. క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ‘ప్రసన్నవదనం‘ బాగా నచ్చుతుంది.

రేటింగ్ : 3 / 5

Related Posts