‘బాక్‘ సినిమా రివ్యూ

నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులు
సినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామి
సంగీతం: హిప్ హాప్ తమిళ
ఎడిటింగ్‌: ఫెన్నీ ఓలీవర్
నిర్మాత: ఖుష్బూ
దర్శకత్వం: సుందర్.సి
విడుదల తేది: 03-05-2024

తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు సినిమాలొచ్చాయి. ఇప్పుడు నాల్గవ చిత్రంగా ‘అరణ్మనై 4’ రూపొందింది. ఈ సినిమాని తెలుగులో ‘బాక్‘ పేరుతో విడుదల చేశారు. సుందర్ .సి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా.. కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి వంటి వారు కూడా ఈ హారర్ కామెడీలో నటించారు. మరి.. ఈరోజు (మే 3) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హారర్ మూవీ ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
హీరో సుందర్.సి ఒక న్యాయవాది. అతని చెల్లెలు తమన్నా. అన్నాచెల్లెళ్లు ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. తమన్నా పెళ్లి చేసుకుని వేరే ఊర్లో భర్తతో నివసిస్తుంటుంది. ఒక రోజు తమన్నా తన భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనే వార్త సుందర్.సి కి వస్తుంది. తన సోదరిని కోల్పోయిన బాధలో ఉన్న అతను.. ఆమె పిల్లలను చూసుకోవడానికి ఊరు వెళ్తాడు. అక్కడకు వెళ్లిన తర్వాత తన చెల్లెలు ఆత్మహత్యతో చనిపోలేదని తెలుసుకుంటాడు. దీంతో.. అసలు తన సోదరికి, ఆమె భర్తకు మధ్య ఏం జరిగింది? వంటి విశేషాలను అక్కడి స్థానిక వైద్యురాలు (రాశి ఖన్నా) సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈకోవలో.. అతను ఎలాంటి అవరోధాలు ఎదుర్కొన్నాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ
సుందర్.సి గతంలో తీసిన ‘అరణ్మనై‘లోని మూడు సినిమాల తరహాలోనే ‘బాక్‘ మూవీ టెంప్లేట్ ఉంటుంది. అయితే.. ఈ హారర్ కామెడీని ‘మంచి vs చెడు’ అనే ఫార్ములాతో తీర్చిదిద్దాడు సుందర్.సి. రెండు ఆత్మలు వేర్వేరు కారణాలతో పోరాడడాన్ని ఈ సినిమాలో చూపించాడు. ఈ మూవీలో మాంసాన్ని తినే, రూపాలు మార్చుకునే ‘బాక్‘ అనే దెయ్యాన్ని ఆవిష్కరించాడు.

అయితే.. ప్రచార చిత్రాలతో బాగా భయపెట్టిన ‘బాక్‘.. థియేటర్లలో ఆ ప్రభావం చూపించలేదనే చెప్పాలి. ఫస్టాఫ్ అంతా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నా.. అవంతగా వర్కవుట్ అవ్వలేదు. సినిమాలోని కొన్ని సీరియస్ సిట్యుయేషన్స్ లోనూ ఫోర్స్ డ్ కామెడీ డైలాగ్స్, ఏజ్ ఓల్డ్ జోక్స్, ఆ సన్నివేశాలను బోరింగ్ గా మార్చేశాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
హీరోగా సుందర్.సి. షటిల్ట్ పెర్ఫామెన్స్ చేశాడు. ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన తమన్నా, రాశీ ఖన్నా కూడా తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక.. కోవై సరళ పాత్ర ఎక్కువగా అరుపులకే పరిమితమైంది. ఆ అరుపులు భయపెట్టేలా కాకుండా.. వెగటు పుట్టేలా అనిపిస్తాయి. తమిళం వరకూ వేరే ఆర్టిస్టులను పెట్టుకున్నా.. తెలుగులో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్ కామెడీ కూడా అంతగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి.

దర్శకుడిగా ఒకప్పుడు ఘన విజయాలందించిన సుందర్.సి.. ‘బాక్‘ విషయంలో పూర్ ఎక్స్ క్యూషన్ కనిపిస్తుంది. హీరో, దర్శకుడు తానే కాబట్టి.. అది కూడా అందుకు కారణం కావొచ్చు. సాంకేతికపరంగా చెప్పుకోవాల్సి వస్తే.. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ప్రభావం చూపించవు. కొన్ని చోట్ల వి.ఎఫ్.ఎక్స్ నాసిరకంగా ఉన్నాయి.

చివరగా
‘అరణ్మనై‘ అనే సిరీస్ ఓ కమర్షియల్ ఫ్రాంఛైస్ గా సాగుతోంది. లాజిక్స్ పెద్దగా వెతక్కుండా.. ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే పరమావధిగా ఈ సిరీస్ కొనసాగుతోంది. లేటెస్ట్ మూవీ ‘బాక్‘ కూడా అందులో భాగమే. హారర్ కామెడీస్ ఇష్టపడే ప్రేక్షకులకు ‘బాక్‘ వన్ టైమ్ వాచ్ అని చెప్పొచ్చు.

రేటింగ్ :2.5/ 5

Related Posts