ఆ… ఒక్కటీ అడక్కు‘ సినిమా రివ్యూ

నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్, రితూ చౌదరి, అరియానా తదితరులు
సినిమాటోగ్రఫి: సూర్య
సంగీతం: గోపీ సుందర్‌
ఎడిటింగ్: చోట కె ప్రసాద్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: రాజీవ్‌ చిలక
దర్శకత్వం: మల్లి అంకం
విడుదల తేది: 03-05-2024

కామెడీకి హీరోయిజాన్ని తీసుకొచ్చిన అతికొద్ది హీరోల్లో అల్లరి నరేష్ ఒకరు. అయితే.. మధ్యలో కొన్ని విలక్షణమైన పాత్రలతో అలరించిన అల్లరోడు.. కాస్త గ్యాప్ తర్వాత నటించిన ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ ‘ఆ… ఒక్కటీ అడక్కు’. మల్లీ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలకా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఈరోజు (మే 3) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడంలో పాసయ్యిందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ
గణపతి అలియాస్ గణ (అల్లరి నరేష్) సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఉద్యోగి. తన చేతుల మీద ఎన్నో పెళ్ళిళ్ళు చేస్తాడు కానీ తనకు పెళ్లి కుదరదు. అయితే.. అతని తమ్ముడికి మాత్రం పెళ్లయ్యి సుమారు పదేళ్ల కూతురు కూడా ఉంటుంది. పెళ్లికోసం అతను చేయని ప్రయత్నాలు ఉండవు. చివరకు పెళ్లికోసం ఒక మ్యాట్రిమోనీలో మెంబర్షిప్ తీసుకుంటాడు.

మాట్రిమోనీ నుంచి వచ్చిన మ్యాచ్ లో భాగంగా సిద్ది( ఫరియా అబ్దుల్లా)ని చూస్తాడు గణ. కాకపోతే ఆమె గణ పెళ్లి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తుంది. మరి.. చివరకు గణ పెళ్లి ప్రతిపాదనను.. సిద్ధి ఆమోదించిందా? మధ్యలో మ్యాట్రిమోనీ సంస్థలు చేస్తున్న మోసాలు ఏంటి? వంటి విశేషాలతో ఈ సినిమా కథ సాగుతోంది.

విశ్లేషణ
పెళ్లి కాని ప్రసాద్ అనగానే మనకు విక్టరీ వెంకటేష్ గుర్తుకొస్తారు. ‘మల్లీశ్వరి‘ చిత్రంలో వెంకటేష్ తన పెళ్లికోసం ఎలాంటి పాట్లు పడతాడో.. ‘ఆ.. ఒక్కటీ అడక్కు‘ సినిమాలోనూ గణపతి పాత్రలో అల్లరి నరేష్ అదే పంథాలో పెళ్లికోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే.. ఈ సినిమాలో పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువతీయువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు? అనే సీరియస్ ఇష్యూని చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మల్లి అంకం.

అల్లరి నరేష్ పోషించిన పెళ్లికాని ప్రసాద్ టైప్ క్యారెక్టర్ గతంలో చాలా సినిమాల్లో వచ్చేయడంతో.. ఆ క్యారెక్టర్ లో కొత్తదనం లోపిస్తుంది. ఫస్టాప్ అంతా కామెడీతో నడిచిన సినిమా.. సెకండాఫ్ లో సీరియస్ టోన్ లోకి వెళ్లిపోతుంది. మ్యాట్రీమోనీ మోసాలు చుపించే క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ బోరింగ్ గా అనిపిస్తాయి.

అలాగే.. హీరో అంత వయసొచ్చే వరకూ పెళ్లిచేసుకోకపోవడానికి ఒక కారణం ఉందంటూ బిల్డప్ ఇచ్చి.. చివరకు అసలు విషయం తెలిసినప్పుడు చూసే ప్రేక్షకులకు అంతేనా అనిపిస్తుంది. కొన్ని విభిన్న తరహా పాత్రల తర్వాత మళ్లీ ఈ సినిమాతో కామెడీ బాట పట్టిన అల్లరి నరేష్ ను.. ‘ఆ.. ఒక్కటీ అడక్కు‘లో మనము కొత్తగా చూడడానికి ఏమీ లేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
అల్లరి నరేష్ ఎప్పటిలాగే తనదైన కామెడీతో నవ్వించడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్ని చోట్ల అది వర్కవుట్ అయ్యింది కూడా. ఇక.. హీరోయిన్ ఫరియా విషయానికొస్తే.. సినిమాలో ఆమేది కీలక పాత్రే. ఆమె పాత్రను దర్శకుడు ఇంకా బలంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ జానీ లీవర్ తనయ జెమీ లీవర్ ఈ సినిమాలో ప్రాధాన్యత గల పాత్రలో నటించింది. ఇంకా.. వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అజయ్, అనీష్ కురువిల్ల, రాజీవ్ కనకాల, రఘు బాబు, గోపరాజు రమణ వంటి చాలామంది తారాగణం ఈ సినిమాలో ఉన్నారు. వాళ్ల పాత్రల పరిధి మేరకు వారంతా ఫర్వాలేదనిపిస్తారు.ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్నందించడంటే నమ్మబుద్ధి కాదు. అతను అందించిన పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. కెమరాపనితనం ఫ‌ర్వాలేదు.

చివరగా
ఈ సినిమాలో కథా నేపథ్యం, అల్లరి నరేష్ నటన వంటి ప్లస్ పాయింట్స్ ఉన్నా.. రొటీన్ గా సాగే కథనంతో సినిమా బోరింగ్ గా మారుతోంది. మొత్తంగా.. ఈవీవీ సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్ కాంబోలో వచ్చి సూపర్ హిట్టైన ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ క్లాసిక్ టైటిల్ తో వచ్చిన ఈ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

రేటింగ్ : 2.5/ 5

Related Posts