కొత్త సంవత్సరంలో క్రేజీ మూవీస్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది స్టార్స్ హంగామా మామూలుగా ఉండదు. 2023లో అస్సలు సినిమాలే విడుదల చేయని మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఈ ఏడాది కొత్త సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు.. లాస్ట్ ఇయర్ కి మిన్నగా ఈ ఇయర్ న్యూ మూవీస్ తో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్, ప్రభాస్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి లాస్ట్ ఇయర్ ‘బ్రో’ సినిమా ఒక్కటే వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆ చిత్రాలే.. ‘హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’. అయితే.. ఈ ఏడాది జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాతే ఈ సినిమాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నాడు పవన్. ఈనేపథ్యంలో.. ఈ ఏడాది పవన్ నుంచి రెండు సినిమాలైతే పక్కాగా వస్తాయనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.

‘సర్కారు వారి పాట’ తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాని విడుదల చేయని మహేష్.. ఈనెలలో సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో మురిపించబోతున్నాడు మహేష్. ప్రిన్స్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన టీమ్.. ఈనెల 6న ట్రైలర్ రిలీజ్ చేయబోతుంది.

ఇదే సంవత్సరం మహేష్ మోస్ట్ అవైటింగ్ మూవీ కూడా షురూ కాబోతుంది. అదే దర్శకధీరుడు రాజమౌళితో సూపర్ స్టార్ చేయబోయే సినిమా. ఈ సినిమా కోసం దాదాపు దశాబ్దంగా ఎదురుచూస్తున్నాడు మహేష్ బాబు. ఇప్పటివరకూ రాజమౌళి తీసిన సినిమాలు పాన్ ఇండియాని టార్గెట్ చేస్తే.. మహేష్ తో చేయబోయే మూవీ పాన్ వరల్డ్ రేంజులో ఉండబోతుంది. ఈ సినిమా కథ అంతా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ తో అడ్వంచరస్ గా సాగనుంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకోనుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ గా అవతరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ‘దేవర’ సినిమాతో రెడీ అవుతున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ‘దేవర’ మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇదే సంవత్సరం బాలీవుడ్ మూవీ ‘వార్ 2’తో బిజీ కానున్నాడు యంగ్ టైగర్. ఈ సంవత్సరం తారక్ నుంచి ‘దేవర’ ఫస్ట్ పార్ట్ ఒకటే వచ్చే అవకాశం ఉంది. ‘వార్ 2, దేవర 2’ సినిమాలు వచ్చే యేడాదే విడుదలకానున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా కూడా ఈ ఏడాది నుంచే పట్టాలెక్కనుంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ కి 2023 మిశ్రమ ఫలితాన్నందించింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఆదిపురుష్’ ఏమాత్రం అలరించలేదు. అయితే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేసిన ‘సలార్’ సెన్సేషనల్ హిట్ అయ్యింది. రెబెల్ స్టార్ ని మళ్లీ ‘సలార్’ ఫుల్ ఫామ్ లో నిలబెట్టింది. ఇదే ఊపులో ఈ ఏడాది ముచ్చటగా మూడు సినిమాలతో బిజీ కానున్నాడు ప్రభాస్. వీటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది ‘కల్కి’. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ క్రేజీ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె వంటి భారీ తారాగణం ఉంది. త్వరలోనే ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత మారుతి డైరెక్షన్ లో చేస్తోన్న సినిమాని కూడా ప్రభాస్ ఈ సంవత్సరమే విడుదల చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఇక.. ఇదే ఏడాది సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట ప్రభాస్. ఇంకా.. ప్రభాస్ కిట్టీలో మోస్ట్ అవైటింగ్ ‘సలార్ 2’ కూడా ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ గా మరోసారి బాక్సాఫీస్ ను కొల్లగొట్టడానికి ఈ సంవత్సరమే రాబోతున్నాడు. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ ‘ది రూల్’ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలకు ముస్తాబవుతోంది. ఫస్ట్ పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో.. సెకండ్ పార్ట్ ను అంతకు మూడు, నాలుగు రెట్లు బిగ్ కాన్వాస్ తో తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాకి సంబంధించి పాటల ప్రమోషన్ ఈ రెండు, మూడు నెలల్లోనే మొదలుకానుంది. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని, సందీప్ రెడ్డి డైరెక్షన్ లో మరో సినిమాని లైన్లో పెట్టాడు ఐకాన్ స్టార్. అయితే.. ఈ రెండు సినిమాలకంటే ముందే ‘జవాన్’ డైరెక్టర్ అట్లీతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. త్వరలోనే అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

తన మిత్రుడు ఎన్టీఆర్ తరహాలోనే మరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా 2023లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ఈ సంవత్సరం మాత్రం చరణ్ నుంచి ‘గేమ్ ఛేంజర్’ పక్కాగా ఆడియన్స్ ముందుకు రానుంది. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు.. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమాని మార్చి నుంచి పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్-బుచ్చిబాబు మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Related Posts