రివైండ్ 2023.. తెలుగులో అనువాద సినిమాల జోరు

ఒకప్పుడు పరభాషా చిత్రాల్ని డబ్బింగ్‌ బొమ్మలంటూ ఓ గాటిన కట్టేసేవారు. కానీ.. ఇప్పుడవన్నీ పాన్‌ ఇండియా ట్యాగ్‌ తగిలించుకొని దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది ఇతర భాషల నుంచి తెలుగులోకి చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు స్ట్రెయిట్ మూవీస్ కి దీటుగా రాణించాయి.

జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైంది విజయ్ ‘వారసుడు‘. పేరుకు తమిళ సినిమాయే అయినా.. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు తెలుగు వారే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రమిది. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య‘, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి‘ లతో పాటుగా ‘వారసుడు‘ విడుదలైంది. కానీ.. ఈ సినిమా మెగాస్టార్, నటసింహం క్రేజ్ ముందు అంతగా నిలబడలేకపోయింది. అయితే.. తెలుగులో డీసెంట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక.. విజయ్ నటించిన మరో చిత్రం ‘లియో‘ కూడా తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించింది. తొలుత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి.. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది.

జనవరిలో టాలీవుడ్ బాక్సాఫీస్ ను బాగా ప్రభావితం చేసిన మరో డబ్బింగ్ మూవీ ‘పఠాన్‘. కింగ్ ఖాన్ షారుక్ ని మాత్రమే కాదు.. యావత్ బాలీవుడ్ ని సైతం తిరిగి ఫామ్ లోకి తీసుకొచ్చిన సినిమా ఇది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఇదే ఏడాది ద్వితియార్థంలో ‘జవాన్‘తో మరోసారి బాక్సాఫీస్ కింగ్ గా నిలిచాడు షారుక్. ఈసారి ‘పఠాన్‘కి మిన్నగా ‘జవాన్‘ టాలీవుడ్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది.

ఈ ఏడాది తెలుగులో జోరు చూపించిన అనువాద సినిమాలలో ‘జైలర్‘ కూడా ముందు వరుసలో నిలుస్తోంది. దాదాపు పుష్కర కాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ను మళ్లీ ఫుల్ ఫామ్ లో నిలబెట్టిన మూవీ ఇది. ‘బీస్ట్‘తో విమర్శలు ఎదుర్కొన్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే.. ఆ విమర్శకుల నోళ్లను ‘జైలర్‘తో మూయించాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఈ మూవీలో రజనీకాంత్ స్టైల్స్, స్వాగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా.. ఈ చిత్రానికి తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.

విజయ్ నటించిన ‘వారసుడు‘ సినిమాని తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు తెరకెక్కించినట్టే.. ఫిబ్రవరిలో విడుదలైన ధనుష్ ‘సార్‘ మూవీని కూడా తెలుగు దర్శకుడు, నిర్మాతే రూపొందించారు. అయితే.. ఈ సినిమా బైలింగ్వల్ గా తెరకెక్కింది. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ‘సార్‘ తమిళం కంటే మిన్నగా తెలుగులో మంచి విజయాన్ని సాధించింది.

బాలీవుడ్ నుంచి షారుక్ తో పాటు.. రణ్ బీర్ కపూర్ కూడా ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్ పై పెద్ద ప్రభావాన్నే చూపించాడు. రణ్ బీర్ కపూర్ నటించిన ‘యానిమల్‘ని ఫక్తు తెలుగు సినిమాగానే ఆదరించారు సినీ ప్రేమికులు. అందుకు ప్రధాన కారణం ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రణ్ బీర్ లోని రస్టిక్ యాక్టింగ్ టాలెంట్ ను బయటకు తీసిన ‘యానిమల్‘ తెలుగులోనూ భారీ వసూళ్లు సాధించింది.

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 కూడా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఇంకా.. తమిళం నుంచి తెలుగులో విడుదలైన ‘బిచ్చగాడు 2’ విజయాన్ని సాధించింది. ‘బిచ్చగాడు‘ తెలుగులో మంచి ఆదరణ దక్కించుకోవడంతో.. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘బిచ్చగాడు 2‘ని బాగా ఆదరించారు. శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు‘, సిద్ధార్థ్ ‘చిన్నా‘ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అదే సమయంలో ఎన్నో అంచనాలతో వచ్చిన కార్తీ ‘జపాన్‘, విశాల్ ‘మార్క్ ఆంటోని‘, లారెన్స్ ‘జిగర్తాండ 2, చంద్రముఖి 2‘ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి.

Related Posts