చిరంజీవి-వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్

నిన్నటితరం సీనియర్ హీరోస్ ను తలచుకోగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. దశాబ్దాలుగా చెక్కుచెదరని స్టార్ డమ్ ఈ కథానాయకుల సొంతం. అయితే.. ఇప్పటివరకూ ఈ నలుగురిలో ఏ ఇద్దరూ కూడా కలిసి మల్టీస్టారర్ చేయలేదు. వీరి కలయికలో మల్టీస్టారర్ వస్తే చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం త్వరలో ఆసనమయ్యే అవకాశం రాబోతుంది. చిరంజీవి, వెంకటేష్ కలయికలో మల్టీస్టారర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

గతంలో చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో ఒక సినిమాని నిర్మించాలని నిర్మాత రామానాయుడు ప్రయత్నించారు. కానీ.. అది కుదరలేదు. అయితే.. వెంకటేష్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’ సినిమాలోని ఒక పాటలో.. సీనియర్ హీరోస్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతో సహా.. చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ కలిసి ఒకే ఫ్రేములో సందడి చేశారు. ఆ విధంగా చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు ఒకే ఫ్రేములో వెండితెరపై మురిపించారు.

ఇక.. అప్పుడు రామానాయుడు సెట్ చేయాలనుకున్న చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ ఇప్పుడు రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన వెంకీ 75 సెలబ్రేషన్స్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా సోదరుడు వెంకటేష్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను.. మా కాంబోకి సరిపడ ఒక స్టోరీ రావాలని కోరుకుంటున్నట్టు‘ తెలిపారు. మరి.. చిరు, వెంకీ కాంబోలో మల్టీస్టారర్ కి ఏ దర్శకుడు కథ సిద్ధం చేస్తాడో చూడాలి. మరోవైపు.. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ లతో మల్టీస్టారర్స్ చేసి మెప్పించాడు విక్టరీ వెంకటేష్.

Related Posts