‘డంకి‘ మూవీ రివ్యూ

నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, దియా మీర్జా, బోమన్ ఇరాని తదితరులు
దర్శకత్వం: రాజ్ కుమార్ హిరానీ
నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్‌ కుమార్ హిరానీ
సంగీతం: ప్రీతమ్
విడుదల తేదీ: డిసెంబర్ 21, 2023

ఈ ఏడాది ‘పఠాన్, జవాన్‘ చిత్రాలతో బాలీవుడ్ ని తిరిగి ఫామ్ లోకి తీసుకొచ్చిన ఘనత కింగ్ ఖాన్ షారుక్ ది. ఈ సంవత్సరం ముచ్చటగా తన మూడో సినిమా ‘డంకి‘తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. హిందీ చిత్ర సీమలో అపజయమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరాణి ఈ సినిమాని తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డంకి‘ ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలు అందుకుందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ
అక్రమ కారణాలతో దేశంలోకి ప్రవేశించాలనుకునే వారికి డంకి అనే పదం వర్తిస్తుంది. హిరానీ కథ పంజాబ్‌ లో ప్రారంభమవుతుంది. సైనికుడైన హర్డీ సింగ్ (షారుక్) యుద్ధంలో తనని కాపాడిన వ్యక్తిని వెతుక్కుంటూ పంజాబ్ లోని ఒక ఊరికి వెళతాడు. అయితే తనకు సాయం చేసిన వ్యక్తి ప్రాణాలతో లేడని.. అతని చెల్లెలు మను (తాప్సీ) సహా కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుంటాడు. ఆమెకి సాయం చెయ్యాలని నిర్ణయించుకుని అక్కడే ఉండిపోతాడు. అయితే తన కష్టాలు తీరాలంటే లండన్ వెళ్లడమే మార్గమని అనుకుంటుంది మను. ఆమెతో పాటు స్నేహితులది అదే ఆలోచన. మరి.. సరైన పత్రాలు లేకుండా అక్రమ మార్గంలో వాళ్లు లండన్ లోకి ఎలా ప్రవేశించారు? వారికి షారుక్ ఖాన్ ఎలా సహాయం చేశాడు? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ
భారతదేశం నుండి అక్రమ వలసదారులు విదేశాల్లోకి వెళ్లడానికి ప్రమాదకరమైన మార్గాలను ఆశ్రయించి, తరచుగా తమ జీవితాలను త్యాగం చేయడం వంటి ముఖ్యమైన అంశంతో రూపొందిన చిత్రమిది. చట్టవిరుద్ధమైన వలసదారుల సంబంధిత సమస్యను, ప్రధానమైన ప్రేమకథతో అందంగా మిళితం చేసి వెండితెరపై ఆవిష్కరించాడు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. ఫస్టాప్ అంతా కామెడీతో ఆద్యంతం వినోదాన్ని పంచగా.. సెకండాఫ్ మాత్రం గాడి తప్పిందని చెప్పొచ్చు. షారుక్ అండ్ టీమ్ దేశాల సరిహద్దులను దాటుతూ లండన్ చేరే క్రమం చాలా కృత్రిమంగా కనిపిస్తుంది. అలాగే వారంతా లైఫ్ రిస్క్ తీసుకుని.. అక్రమ మార్గాల ద్వారా లండన్ వెళ్లాలి అనుకోవడానికి సరైన కారణాలు కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమయ్యాడు హిరానీ.

నటీనట, సాంకేతిక వర్గం
ఈ ఏడాది రెండు బడా యాక్షన్ మూవీస్ తో విజువల్ ట్రీట్ అందించిన షారుక్ నుంచి వచ్చిన ఫుల్ లెన్త్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో షారుక్ డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు. యంగ్ లుక్స్ లో కనిపించినప్పుడు సహజత్వం లోపించిందని చెప్పొచ్చు. తాప్సీ తన పాత్రకు న్యాయం చేసింది. మను పాత్రలో సరిగ్గా సరిపోయింది. విక్కీ కౌశల్ ఉన్నది కాసేపే అయినా అతని పాత్ర మంచి ప్రభావం చూపిస్తుంది. బోమన్ ఇరానీ, విక్రమ్ కోచర్, అనిల్ గ్రోవర్ పాత్రలు బాగున్నాయి.

సాంకేతిక వర్గం విషయానికొస్తే దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ గత సినిమాలతో పోల్చితే కథ పరంగా ఈ సినిమాలో కొన్ని తప్పులు ఉన్నట్టు అర్థమవుతోంది. మ్యూజిక్ సోసో గా అనిపిస్తే.. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ఓవరాల్ గా ‘డంకి‘ ఓ.కె. అనిపిస్తుంది.

Related Posts