క్రిస్మస్ మూవీస్ .. టగ్ ఆఫ్ వార్ తప్పదా

క్రిస్మస్.. ఒకప్పుడు తెలుగు సినిమాకు అంత మంచి సీజన్ కాదు అనుకునేవారు. బట్ కొన్నాళ్లుగా మంచి సినిమా ఎప్పుడు వస్తే అదే మంచి సీజన్ గా మారింది. అలా క్రిస్మస్ కు కూడా పోటీలు పడి మరీ సినిమాలు విడుదల చేస్తున్నారు. ఈ యేడాది ఆ పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే తెలుగు నుంచి చాలా సినిమాలు లైనప్ అయ్యి ఉన్నాయి. వీరికి పోటీగా డబ్బింగ్ సినిమాలు కూడా దండయాత్ర చేయబోతున్నాయి. ఈ దండయాత్ర చూస్తే.. ఖచ్చితంగా తెలుగు సినిమాలకూ సమస్యలు తప్పవు అనిపిస్తోంది. అదే టైమ్ లో మన సినిమాలు కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతున్నాయి. సో వార్ ఒన్ సైడ్ మాత్రం కాదు.. టగ్ ఆఫ్ వార్ తప్పదు అనిపించేలా ఉన్నాయీ సినిమాలు.


తెలుగు నుంచి క్రిస్మస్ మూవీస్ గా ఇప్పటికే నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న డిసెంబర్ 21న రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంది. కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఫాదర్ సెంటిమెంట్ తో సాగే లవ్ స్టోరీ అంటున్నారు. లేటెస్ట్ గా వచ్చిన పాటతో సినిమాకు ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చు. ఈ మూవీని ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.

ఇక డిసెంబర్ 22న సుధీర్ బాబు నటించిన హరోంహర విడుదల కాబోతోంది. 23న విక్టరీ వెంకటేష్‌ 75వ సినిమాగా సైంధవ్ రాబోతోంది. రుహానీ శర్మ, శ్రధ్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మీయా ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతోన్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. హిట్, హిట్2 చిత్రాల ఫేమ్ శైలేష్‌ కొలను డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై మొదటి నుంచీ అంచనాలున్నాయి. ఈ సైంధవ్ ను కూడా ప్యాన్ ఇండియన్ మూవీగా విడుదల చేయబోతున్నారు.


23నే వస్తోన్న మరో తెలుగు సినిమా ఎక్స్ ట్రార్డినరీ మేన్. నితిన్, శ్రీ లీల జంటగా నటించిన ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. మొదట్లో ఏ సందడీ లేకపోయినా సడెన్ గా సీన్ లోకి వచ్చింది. ఆ మధ్య విడుదలైన డేంజర్ పిల్లా పాట యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం వరుస డిజాస్టర్స్ లో ఉన్నాడు. వాటి నుంచి బయటపడాలంటే ఇంత పోటీలో ఉంటే కష్టం. సో.. క్రిస్మస్ కు రాబోతోన్న తెలుగు సినిమాలైతే ఇవి.


వీరిని భయపెట్టేలా కనిపిస్తోన్న రెండు డబ్బింగ్ లున్నాయి. ఒకటి బాలీవుడ్, మరో హాలీవుడ్. ఈ యేడాది వరుసగా బ్లాక్ బస్టర్స్ తో దూసుకువస్తున్నాడు షారుఖ్ ఖాన్. పఠాన్ తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు జవాన్ కూడా మరో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయబోతోందని అంచనాలున్నాయి. ఈ రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత కంట్రీ మొత్తం అభిమానించే రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో చేసిన సినిమా డంకీ విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ చిత్రాన్ని నెక్ట్స్ ఇయర్ కు పోస్ట్ పోన్ చేస్తారు అనే వార్తలు బలంగా వినిపించాయి. అంతే బలంగా ఆ వార్తలను తిప్పి కొడుతోంది మూవీ టీమ్. ఈ మూవీ అనుకున్న టైమ్ కే డిసెంబర్ 22నే విడుదల చేస్తాం అంటున్నారు. జవాన్ తర్వాత షారుఖ్ కు సౌత్ లో కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అది మన తెలుగు సినిమాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.


ఇక కొన్నాళ్ల క్రితం ఆక్వామేన్ అంటూ అచ్చంగా ఓ తెలుగు ఊరమాస్ సినిమాను తలపించారు హాలీవుడ్ మేకర్స్. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రూపొందింది. ఆక్వా మేన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్ అనే పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని కూడా క్రిస్మస్ బరిలోనే విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తే కళ్లు తిప్పుకోలేం అన్నట్టుగా ఉంది. మరోసారి విజువల్ వండర్ ను చూడబోతున్నాం అనేలా ఉంది.

సో.. ఈ రెండు సినిమాలూ తెలుగులోనే కాదు.. ఆయా ప్రాంతీయ భాషా చిత్రాలపై గట్టి ప్రభావమే చూపిస్తాయి అంటున్నారు విశ్లేషకులు. అఫ్‌ కోర్స్ అందుకు వీరి దగ్గర సరుకు కూడా ఉండాలి. అది మొదటి ఆటకే తేలిపోతుంది కాబట్టి.. ఈ సారి బాక్సాఫీస్ బరిలో తెల్లమొకం వేసేది ఎవరో మొదటి రోజే తెలిసిపోతుంది. మొత్తంగా ఈ సారి క్రిస్మస్ ఇంతకు ముందెప్పుడూ లేనంతగా ఓ రేంజ్ బాక్సాఫీస్ వార్ కు వేదిక కాబోతోంది.

Related Posts