అసలే సినిమా డిజాస్టర్ అయింది. భారీ నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలను ఎలా పూడ్చుకోవాలో తెలియక తంటాలు పడుతున్న భోళా శంకర్ మూవీ నిర్మాతలపై కోర్ట్ నుంచి కొత్త పిడుగు పడింది. ఈ చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకరలపౌ నాంపల్లి క్రిమినల్ కోర్ట్ లో చీటింగ్ కేస్ తో పాటు వివిధ కేసులు నమోదయ్యాయి.
ఈ సినిమా విడుదలను ఆపాలని అప్పుడే కోర్ట్ కు వెళ్లిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ ఈ కేస్ ను వేశాడు. అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్” సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారని, ఆ సినిమాకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి మూడు రాష్ట్రాల హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ ను బ్యాంకు ద్వారా తాను చెల్లించడం జరిగిందని, అయితే తనకు కేవలం విశాఖపట్నం వరకే తనకు హక్కులను ఇచ్చారని శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైజాగ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్) వెల్లడించారు.
ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. “తాను వెళ్లి నిర్మాతలను సంప్రదించగా, ‘భోళా శంకర్” సినిమా విడుదలకు ముందు తన డబ్బులు తిరిగి చెల్లిస్తామన్నారు. అండర్ స్టాండింగ్ లెటర్ ఇచ్చారు. గత పదమూడేళ్లుగా వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా “రంగస్థలం” వంటి అనేక పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన నేను సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం వల్ల నాకు రావలసిన డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించాను. అయితే వారు నన్ను పట్టించుకోలేదని,నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. దాంతో తన డబ్బుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయించడం జరిగింది.
నేను చెల్లించిన 30 కోట్ల రూపాయల డబ్బును రికవరీ చేసుకునేందుకు సూట్ ఫైల్ చేసుకోమని హైదరాబాద్ సివిల్ కోర్టు అనుమతినిచ్చింది. ఆ మేరకు న్యాయ పోరాటం చేస్తున్నా.. ” అని సతీష్ స్పష్టం చేశారు. మరోవైపు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సదరు నిర్మాతలపై వివిధ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన చెప్పారు.మరి ఈ కేస్ లో సతీష్ కు న్యాయం జరుగుతుందా లేదా అనేది తర్వాతి మేటర్ అయితే దీనికి కౌంటర్ గా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేదే ఆసక్తికరంగా మారింది.