కొన్ని కాంబినేషన్స్ పై ఎప్పుడూ ఆసక్తే ఉంటుంది. ఎప్పుడో ఇరవైయేళ్ల క్రితం వస్తుందనుకున్న కాంబినేషన్ లో సినిమా ఇప్పుడు వస్తుందంటే కూడా ఆ ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా వారిపై అంచనాలున్నట్టే లెక్క. ఆ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి, పూరీ జగన్నాథ్. రెండు దశాబ్ధాల క్రితమే చిరంజీవితో సినిమా చేయాలని ఆటో జానీ అనే టైటిల్ తో కథ రాసుకుని వెళ్లి కలిశాడు. కానీ తన కమిట్మెంట్స్ తో చిరంజీవి అప్పుడు టైమ్ ఇవ్వలేదు. కానీ కొంతకాలం తర్వాత తన కొడుకును హీరోగా పరిచయం చేసే బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఫుల్ గా నిర్వర్తించాడు పూరీ.

చరణ్‌ లో హీరోకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటినీ ఎక్స్ పోజ్ చేశాడు. ఆ తర్వాతైనా చిరంజీవితో సినిమా చేయాలనుకున్నాడు పూరీ. ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లిపోయాడు. నిజానికి ఆ టైమ్ లో పూరీ జగన్నాథ్ వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫైర్ మీదున్నాడు. అందుకే ఈ కాంబోలో సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అయినట్టే అని భావించారు ఆడియన్స్. అప్పుడు కుదరని ఈ కాంబోలో ఇప్పుడు సినిమా రాబోతోందనే వార్త హల్చల్ చేస్తోంది.


కొన్నాళ్లుగా పూరీ జగన్నాథ్ వరుసగా డిజాస్టర్స్ చూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో కోలుకున్నాడు అని భావించేలోపే.. లైగర్ తో మరో డిజాస్టర్ పడింది. ఈ మూవీ ఎఫెక్ట్ అతన్ని పర్సనల్ గా కూడా బాగా కుంగదీసింది. అయినా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఆర్టిస్టుగా చిన్న పాత్రలో నటించాడు.అప్పుడే పూరీ బాధ చూసి చిరు.. అతన్ని ఓదార్చాడు. ఫ్లాపులు కామనే అని హితబోధ చేశాడు. అంతేకాక ఆటోజానీ కథతో వచ్చేయమని కూడా చెప్పాడు.

అయితే ఆటోజానీ ఇప్పుడు వర్కవుట్ కాదని చెప్పాడు పూరీ. ఫైనల్ గా మరో కథతో వెళ్లి మెగాస్టార్ ను ఒప్పించాడని టాక్. మెగాస్టార్ కూడా నెక్ట్స్ ఇయర్ లోనే ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలనుకుంటున్నాడు. నిజానికి ఈ టైమ్ లో అతను వెంకీ కుడుములతో చేయాల్సి ఉంది. వెంకీ చెప్పిన కథ నచ్చకపోవడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఆ డేట్స్ ను పూరీ జగన్నాథ్ కు ఇవ్వబోతున్నాడు.


మరి పూరీ జగన్నాథ్ ఈ సారైనా కాస్త పెన్ దగ్గర పెట్టుకుని మంచి కథ చెప్పగలిగితే ప్రేక్షకులు ఆదరించేందుకు రెడీగా ఉన్నారు. లేదూ లైగర్ రిజల్టే రిపీట్ అయితే.. ఓదార్చడానికి మెగాస్టార్ కూ కుదరదు.