టాలీవుడ్ ను అవమానిస్తున్న సలార్ మేకర్స్

ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇతర మేకర్స్ ను గౌరవించడం సంస్కారం. ఈ విషయంలో కాస్త తక్కువగా కనిపిస్తోంది హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ తో పాటు ఆ బ్యానర్ లో ప్రభాస్ తో సినిమా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.నిజం.. వీళ్లు ఇప్పటి వరకూ ప్రపంచంలోనే లేని కంటెంట్ ఏదో చూపించబోతున్నట్టుగా ముందు నుంచి ఆడియన్స్ ను పట్టించుకోలేదు. తమ సినిమా అప్డేట్స్ అంటే చెప్పలేదు. కనీసం పోస్ట్ పోన్ అయిన విషయమైనా ఇన్ టైమ్ లో చెబితే ఇతర సినిమాలు షెడ్యూల్ అవుతాయి కదా. ఆ విషయం ఎవరో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కు చెబితే వాళ్లు మేటర్ లీక్ చేస్తే అప్పుడు సెప్టెంబర్ 28 సినిమాలు సిద్ధమయ్యాయి. ఇదే విషయంలో హొంబలే బ్యానర్ పై అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. అయినా చాలా ఆలస్యంగా స్పందించారు.


ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది చెబితే ఆల్రెడీ షెడ్యూల్ అయిన సినిమాలు వాయిదా పడటమో లేక మరో డేట్ చూసుకోవడమో చేస్తారు కదా. ఈ విషయంలోనూ హొంబలే బ్యానర్ టాలీవుడ్ తో అవమానకరంగా బిహేవ్ చేస్తోంది. వచ్చేది డైనోసార్ కావొచ్చు. కానీ డైనోసార్లను కూడా బంధించిన సినిమాలున్నాయి అన్న సంగతి మర్చిపోకూడదు. ఇక్కడ స్టార్డమ్ కంటే కంటెంటే పెద్దది. అది బయటకు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు. ఇక ఇప్పుడు సలార్ మూవీ మేకర్స్ టాలీవుడ్ లో ఇన్సల్టింగ్ గేమ్ ఆడుతున్నారు. ఇంకా చెబితే ఇది కేవలం తెలుగు స్టార్ హీరో నటించిన సినిమానే తప్ప తెలుగు సినిమా కాదు అనే వాదనలూ ఉన్నాయి. మేకర్స్, ప్రొడ్యూసర్ కన్నడిగులు, సినిమా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్. ప్రభాస్ తెలుగువాడు కాబట్టి డబ్బింగ్ సులువుగా చెబుతాడు అంతే. కానీ కేవలం ప్రభాస్ స్టార్ కాబట్టి.. ఈ చిత్రం రిలీజ్ డేట్ తో తెలుగు సినిమాలను ఆటాడుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అనేది సగటు ఇండస్ట్రీ పర్సన్ కు అనిపిస్తే తప్పేముంది.


సలార్ కొత్త రిలీజ్ డేట్ గా డిసెంబర్ 22 వినిపిస్తోంది. ఇప్పటికే ఆ టైమ్ కు వెంకటేష్ సైంధవ్, నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మేన్ తో పాటు సుధీర్ బాబు హరోంహర షెడ్యూల్ అయి ఉన్నాయి. వీళ్లు నలుగురు వచ్చినా పోటీ ఉన్నా.. ఎవరికి తెగే టికెట్స్ వారికి తెగుతాయి. కానీ సలార్ వస్తే అలా కాదు కదా. ఖచ్చితంగా వీళ్లు సలార్ తో పోటీ పడతారు అని చెప్పలేం. పోటీ పడ్డా.. ఫస్ట్ డే లేదా టాక్ బయటకు వచ్చే వరకూ సలార్ డామినేషన్ ఉంటుంది. అది వీరి ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుంది. అంచేత వీళ్లు కొత్త డేట్ చూసుకోవడానికైనా మర్యాదతో సలార్ మేకర్స్ అఫీషియల్ గా కొత్త రిలీజ్ డేట్ చెప్పాలి అనేది లాజిక్ కాదు.. డిమాండ్ కూడా.


సలార్ మేకర్స్ చెప్పకపోయినా.. ఇప్పటికే ఈ సినిమాలన్నీ జనవరిలో వస్తే ఎలా ఉంటుంది అనే ప్లానింగ్ లో ఉన్నాయి. అటు జనవరిలో సంక్రాంతి బరిలో కూడా సినిమాలున్నాయి. అందువల్ల వీళ్లు కొత్త యేడాది ఫస్ట్ వీక్ లో రావాలి లేదా థర్డ్ వీక్ కు వెళ్లాలి. ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే ముందు అసలు సలార్ వస్తుందా రాదా అనేది తెలియాలి. అప్పటి వరకూ ఓ టెన్షన్ ఉంటుంది కదా.. అటు హొంబలే నిర్మాతలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఫెలో ప్రొడ్యూసర్స్ సమస్యను అర్థం చేసుకుని దర్శకుడితో చర్చించి ఖచ్చితమైన డేట్ ను అనౌన్స్ చేస్తే ఎవరి పని వాళ్లు చూసుకుంటారు కదా..? ఏదేమైనా కేవలం ప్రభాస్ ను చూపిస్తూ తెలుగు సినిమాలతో ఆడుకోవడం మాత్రం క్షమించరాని విషయమే. కాకపోతే ఈ విషయం ఆయా చిత్రాల మేకర్స్ అడిగితే ఇంకాస్త బలంగా ఉంటుంది.

Related Posts