ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బయోగ్రఫీ

ఇంతింతై వటుడింతై అన్న చందంగా… టాలీవుడ్ లో మొదలుపెట్టి ఇప్పుడు బాలీవుడ్ వరకూ బడా స్టార్ గా ఎదిగాడు బన్నీ. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్.. అన్నింటిలోనూ తనదైన స్టైలిష్ మార్క్ చూపించే అల్లు అర్జున్.. అందరికీ ఐకాన్ స్టార్ గా మారాడు. ఈరోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజు.

అల్లు అర్జున్.. బార్న్ విత్ సిల్వర్ స్క్రీన్. ఉరకలేసే ఉత్సాహానికి కేరాఫ్ అంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి. అతని ఎనర్జీ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆకతాయిగా కనిపించినా.. అవకాశం వస్తే అద్భుతమైన నటననూ చూపిస్తాడు. ఆరంభంలోనే ఆర్యగా అతను చేసిన హడావిడీ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గానే నిలుస్తోంది.

చిన్నతనం నుంచే ఇంట్లో సినిమా వాతావరణం ఉండటంతో పాటు.. ఆ రోజుల్లో యావత్ ఆంధ్రదేశానికి సరికొత్త ఇన్స్ స్పిరేషన్ గా నిలిచిన చిరంజీవి ఇంట్లోనే ఉండటంతో ఆటోమేటిక్ గా ఆ రంగంపై మక్కువ పెరిగింది. దీనికి తోడు చిరంజీవిలా డ్యాన్స్ చేయాలనే తపన మనోడిలోని సరికొత్త టాలెంట్ నేర్చుకునేందుకు స్టెప్పులు వేసింది. మామయ్య ప్రేరణతోనే వెండితెరపై వెలిగిపోవాలని కలలు కన్నాడు. వాటిని సాకారం చేసుకోవడానికి అన్ని విధాలుగా తర్ఫీదుతో పాటు స్వయంగానూ చాలా కష్టపడ్డాడు.

చిరు మెగాస్టార్ అయితే అరవింద్ మెగా ప్రొడ్యూసర్ గా అవతరించి.. ఆ ట్యాగ్ కరెక్టే అని తేల్చారు. దీంతో చిరంజీవి కుటుంబం కాకుండా అల్లు ఫ్యామిలీ నుంచి ఓ కొత్త హీరో వస్తున్నాడంటే ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా చూశారు. ప్రఖ్యాత హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా.. మెగాస్టార్ మేనల్లుడుగా.. చిత్ర రంగంలోకి నటుడిగా రాజమార్గంలో ప్రవేశించాడు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సెంచరీ మూవీ ‘గంగోత్రి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన తండ్రి అల్లు అరవింద్, అశ్వనీదత్ వంటి లెజెండరీ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో.. కీరవాణి మ్యూజికల్ మ్యాజిక్ తో ‘గంగోత్రి’ సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో.. డెబ్యూ మూవీతోనే బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు బన్నీ.

కుర్రాడు చురుగ్గా ఉన్నాడు.. ఆ చురుకుదనాన్ని ఎలివేట్ చేసే కథైతే ఖచ్చితంగా ఇరగదీస్తాడు అని గంగోత్రి చూసిన చాలామంది అనుకున్నారు. అది నిజమే అని నిరూపిస్తూ.. రెండో సినిమాకే చాలా ఆశ్చర్యకరమైన రేంజ్ లో మారిపోయాడు బన్నీ. మేకోవర్ నుంచి యాక్టింగ్ స్కిల్స్ వరకూ ఎవ్వరూ ఊహించని స్థాయిలో మారిపోయాడు. అదే ‘ఆర్య’. ‘ఆర్య’ టైటిల్ రోల్ లో బన్నీని తప్ప ఇంకెవరినీ ఊహించలేం అన్నంతగా చెలరేగిపోయాడు. వన్ సైడ్ లవర్ గా ఉంటూనే.. మనస్ఫూర్తిగా హీరోయిన్ ని ప్రేమించే పాత్రలో ఉన్న అన్ని రకాల వైవిధ్యాలనూ అద్భుతంగా పలికించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తను హీరోయిన్ ను ప్రేమిస్తున్నానని చెప్పి అదంతా ఆమెను ఏడిపించడానికే అని చెప్పిన సన్నివేశంల తన నటనతో అందరినీ ఏడిపించి శెభాష్ అనిపించుకున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘ఆర్య’ తెలుగుతో పాటు.. మలయాళంలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వారసత్వం అనేది ‘గంగోత్రి’కి పనికొచ్చినా.. అల్లు అర్జున్ టాలెంట్ తోనే ‘ఆర్య’ హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీలో బన్నీ యాక్టింగ్, డ్యాన్సెస్ ఆడియన్స్ కు కొత్తగా అనిపించాయి.

కుర్రాడు ఎలా ఉన్నా.. వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి కాబట్టి ఖచ్చితంగా మాస్ ను ఎట్రాక్ట్ చేయాలి. అందుకే వినాయక్ ను రంగంలోకి దించారు. తన ముద్దు పేరునే టైటిల్ గా పెట్టి ‘బన్నీ’ తీశారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన బన్నీ అర్జున్ లోని మాస్ యాంగిల్ ను చూపించింది. తొలి రెండు సినిమాల్లో యాక్షన్ కు పెద్దగా స్కోప్ లేదు కాబట్టి ఆ సన్నివేశాల్లో బన్నీ ఎలా ఉంటాడా అనుకున్నవారికి ‘బన్నీ’ కరెక్ట్ ఆన్సర్ గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ కు ‘తొలిప్రేమ’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కరుణాకరన్ తో చేసిన ‘హ్యాపీ’ సినిమా బావున్నా ఎందుకో ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ కాలేదు. దీంతో నిర్మాత మాత్రమే హ్యాపీగా లేడు అనే పేరొచ్చిందా సినిమాకు. కానీ ఇప్పుడు టివిల్లో వస్తుంటే మాత్రం ఎవరూ హ్యాపీని ఆపలేరు… ఓ రకంగా ‘హ్యాపీ’ వరకూ అల్లు అర్జున్ కెరీర్ ఓ ప్రణాళిక ప్రకారం సాగిందని చెప్పుకోవాలి.. ఆ తర్వాతే అతని సినిమాల్లో పూర్తిగా అతని నిర్ణయాలు.. పెరిగాయి.

అల్లు అర్జున్ లో ఎనర్జీ లెవెల్స్ పీక్స్ లో ఉంటాయి.. కానీ నటుడిగా ఇంకొంత ఈజ్ చూపిస్తే బావుండు అని అప్పుడప్పుడూ అనిపించేది. దీంతో ఈ సారి పూరీ జగన్నాథ్ ను రంగంలోకి దించారు. ఇంకేముందీ బన్నీ ఎనర్జీని కావాల్సినంత వాడేసుకుని అతన్ని ‘దేశముదురు’గా చూపించాడు పూరీ. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ పర్ఫెక్ట్ మాస్ హీరోగా అవతరించాడు. ‘ఆర్య’ చిత్రం తర్వాత ‘బన్నీ, హ్యాపీ’ వంటి సినిమాలు చేసినా.. అల్లు అర్జున్ కి అసలు సిసలు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం ‘దేశముదురు’. సిక్స్ ప్యాక్ అనేది కేవలం బాలీవుడ్ హీరోలు మాత్రమే చేయగలరు అని అనుకుంటోన్న సమయంలో.. ‘దేశముదురు’తో ఆరుపకల దేహదారుఢ్యంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్.

ఒక్కసారి మాస్ హీరోగా ఇమేజ్ వచ్చిన తర్వాత ఎవరైనా సేఫ్ జోన్ లో జర్నీ చేస్తారు. కానీ బన్నీ అలా కాదు.. తనలోని నటుడ్ని చూపించేందుకు ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా వదులుకోలేదు. అందుకే బొమ్మరిల్లుతో సూపర్ హిట్ కొట్టిన భాస్కర్ డైరెక్షన్ లో ‘పరుగు’ చేశాడు. అప్పటి వరకూ తనకున్న ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ప్రకాష్ రాజ్ వంటి వెర్సటైల్ పర్ఫార్మర్ కు దీటుగా క్లైమాక్స్ లో అదరగొట్టాడు.

ఆ తర్వాత తను దర్శకుడుగా పరిచయమై.. బన్నీని హీరోగా నిలబెట్టిన సుకుమార్ తో ‘ఆర్య-2’ అంటూ వచ్చారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో బన్నీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. పాత్ర పరంగా అతని నటన అద్భుతం అనిపించుకున్నా.. అదే కొంత మైనస్ గా మారింది సినిమాకు. అలాగే.. తెలుగులో భారీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ పై ఎంతో నమ్మకంతో ‘వరుడు’ చేశాడు. ‘వరుడు’లో రిలీజ్ కు ముందు వరకూ హీరోయిన్ ఫేస్ చూపించకుండా ప్రయోగం చేశారు. ఇక్కడ కూడా అంతే ఏది ప్లస్ అవుతుందనుకున్నారో అదే మైనస్ గా మారి వరుడు బన్నీ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది.

నటుడిగా నిరూపించుకునే అవకాశం వచ్చిన ప్రతిసారీ అల్లు అర్జున్ ఇమేజ్ కు భిన్నంగా డేర్ చేశాడు. ఫలితం తేడా వస్తే కెరీర్ కు ఇబ్బంది తెలిసినా పాత్రతో కనెక్ట్ అయిన ప్రతిసారీ ముందడుగే వేశాడు. ‘గమ్యం’తో ఎంటైర్ టాలీవుడ్ ను ఎట్రాక్ట్ చేసిన క్రిష్ తో ‘వేదం’ చేయడానికి ఇదే కారణం. హీరో అనే పదానికి కాస్త దూరంగా ఉండే పాత్రతో కేబుల్ రాజుగా బన్నీ నటన కన్నీళ్లు పెట్టించింది. తనలోని కొత్తకోణాన్ని ఆడియన్స్ కే కాదు.. తన ఫ్యామిలీకీ తెలిసేలా చేశాడు.

‘బద్రీనాథ్’.. బన్నీ కెరీర్ లో మరో భారీ డిజాస్టర్ గా నిలిచింది. వివి వినాయక్ తో అంతకు ముందు చేసిన బన్నీ రిజల్ట్ ను రిపీట్ చేయలేకపోయింది ‘బద్రీనాథ్’. ఈ సినిమా అతనికి చాలా పాఠాలే నేర్పింది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన ‘జులాయి’తో కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇందులోనూ రెగ్యులర్ మాస్ హీరో టైప్ క్యారెక్టర్ కాకుండా ఇరగదీశాడు. చాలా యేళ్లుగా తన హీరోను ఒకేలా చూపిస్తోన్న పూరీ జగన్నాథ్ తో మరోసారి ట్రై చేశాడు. ‘ఇద్దరమ్మాయిలతో’ అంటూ కాసింత వైవిధ్యమైన కథతో వచ్చినా ఇది పెద్దగా ఆడలేదు. అందుకే మాస్ హీరో అనగానే ఎగిరి స్టెప్పులు వేయకుండా మళ్లీ త్రివిక్రమ్ తోనే ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా వచ్చాడు. తన నటనతో విమర్శకుల ప్రశంసలను పొందాడు. ఇక రామ్ చరణ్ తో కలిసి కాకపోయినా అతను హీరోగా నటించిన ‘ఎవడు’ చిన్న పాత్ర చేసి పెద్ద మనసును చాటుకున్నాడు.

‘రేసుగుర్రం’తో మరోసారి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో చెప్పినట్టుగా అతను పాత్రతో కనెక్ట్ అయిపోతే అందులో మనల్నీ కనెక్ట్ చేస్తాడు.. కలెక్షన్లు కొల్లగొడతాడు. ఓ రకంగా వరుస బ్లాక్ బస్టర్స్ తో మెగా హీరో అనే ట్యాగ్ నుంచి మెల్లగా బయటకు వస్తున్నాడనే చెప్పాలి. అంటే మెగా ఫ్యాన్సే తమ ఫ్యాన్స్ కాకుండా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు బన్నీ. అందుకే ఈ తరం కుర్రాళ్లలో తొలిసారిగా మళయాలంలో కూడా స్టార్ హీరో రేంజ్ లో మార్కెట్ సంపాదించుకున్నాడు.

తర్వాత బోయపాటితో చేసిన ‘సరైనోడు’ బన్నీ కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్ హిట్ గా నిలిచింది. ‘దువ్వాడ జగన్నాథమ్’గా కొంత వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశాడు. అయితే లాస్ట్ ఇయర్ రైటర్ నుంచి దర్శకుడుగా మారిన వక్కంతం వంశీతో చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చేదు జ్ఞాపకంగా నిలిచింది. ఈ మూవీ తర్వాత యేడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. నెక్ట్స్ తనతో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో ‘అల.. వైకుంఠపురములో’ చేశాడు. ఇది తెలుగులో నాన్-బాహుబలి రికార్డులను సృష్టించింది. కాస్త గ్యాప్ తీసుకున్నా.. ఆ గ్యాప్ ను పూడ్చేలా బన్నీ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది ‘అల.. వైకుంఠపురములో’.

ఇక.. సినిమా సినిమాకి కథల విషయంలో విలక్షణత చూపించే అల్లు అర్జున్.. తన మేకోవర్ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంటాడు. స్టైలిష్ యాక్టింగ్.. స్టైలిష్ డ్యాన్సులతో.. స్టైల్స్ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న అల్లు అర్జున్.. అసలు సిసలు స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు.

ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో పక్కింటబ్బాయి తరహా పాత్రలో జీవించి.. ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ‘పుష్ప’ మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. తొలుత అనువాదాలతో ఉత్తరాది ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన బన్నీ.. ‘పుష్ప’ సినిమాతో స్ట్రెయిట్ గా నార్త్ ఆడియన్స్ మనసుల్లోకి చొచ్చుకుపోయాడు. ఈ సినిమాలో ‘తగ్గేదేలే’ అంటూ రస్టిక్ రోల్ లో ‘పుష్ప’రాజ్ గా ఎవర్ గ్రీన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలోని పాత్రకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు.

ప్రస్తుతం ‘పుష్ప’ సెకండ్ పార్ట్ ‘పుష్ప.. ద రూల్’తో ప్రేక్షకుల్ని ఫిదా చేయడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో పాటు.. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ను పైప్ లైన్లో పెట్టాడు ఐకాన్ స్టార్. వాటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, అట్లీ వంటి దర్శకుల సినిమాలున్నాయి. మొత్తంమీద.. మునుముందు చిత్ర సీమలో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆకాంక్షిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ అందజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Related Posts