మెగా ప్రిన్స్ తో మేర్లపాక గాంధీ మూవీ

ప్రస్తుతం టాలీవుడ్‌లో యువ దర్శకుల హవా నడుస్తోంది. వీరిలో ఎక్కువమంది షార్ట్ ఫిలింస్‌తో సత్తా చాటి.. సిల్వర్‌ స్క్రీన్‌పై దుమ్మురేపుతున్నారు. ఈకోవలోనే.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు మేర్లపాక గాంధీ. సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత శర్వానంద్ తో ‘ఎక్స్‌ ప్రెస్‌ రాజా’ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే.. ఆ తర్వాత చేసిన నాని ‘కృష్ణార్జున యుద్ధం’, నితిన్ ‘మాస్ట్రో’ ఫర్వాలేదనిపించినా పెద్ద విజయాలు సాధించలేదు. మధ్యలో ‘ఏక్ మినీ కథ’తో రచయితగా తనలోని పస తగ్గలేదని నిరూపించుకున్నాడు మేర్లపాక. లేటెస్ట్ గా ఈ యంగ్ డైరెక్టర్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

‘ఆపరేషన్ వాలెంటైన్’తో బాగా డీలాపడ్డ వరుణ్ తేజ్.. ప్రస్తుతం ‘మట్కా’ మూవీని లైన్లో పెట్టాడు. కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గురించి కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి.. వరుణ్ తేజ్ మార్కెట్ లెక్కలు చూసుకుని ముందుకు వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ‘మట్కా’ సస్పెన్స్ లో పడటంతో.. పక్కా బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న మేర్లపాక గాంధీతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వరుణ్. త్వరలోనే వరుణ్ తేజ్-మేర్లపాక గాంధీ మూవీపై అధికారిక ప్రకటన రానుందట.

Related Posts