‘ఆర్య’ 20 ఇయర్స్ హైలైట్స్ ఇవిగో..!

‘ఆర్య’ సినిమా విడుదలై.. మే 7 తో 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా.. ఆనాటి ‘ఆర్య’ అనుభవాలను ప్రత్యేకంగా పంచుకుంది టీమ్. ఈ ఈవెంట్ లో ‘ఆర్య’ కథను మెగాస్టార్ చిరంజీవికి చెప్పిన విధానం గురించి వివరించారు డైరెక్టర్ సుకుమార్. అప్పట్లో మెగా కుటుంబానికి సంబంధించిన కథలన్నీ మెగాస్టారే ఫైనలైజ్ చేసేవారు. ముందుగా అల్లు అరవింద్ ‘ఆర్య’ కథను చిరంజీవికి చెప్పమన్నారట.

చిరంజీవికి 20 నిమిషాల్లో కథ చెప్పాలి అని అనడంతో.. అద్దం ముందు నిలబడి నెల రోజుల పాటు ప్రాక్టీస్ చేశారట సుకుమార్. అయితే చిరుకి స్టోరీ నచ్చి.. 20 నిమిషాలు కాస్తా 3 గంటల పాటు విన్నారట. ‘ఆర్య’ కథను ఆద్యంతం ఎంజాయ్ చేశారట చిరు. ఈ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో.. చిరు ‘ఆర్య’ కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సుకుమార్ థాంక్స్ తెలిపారు.

సుకుమార్ సినిమాల్లో లాజిక్స్ తో పాటు ఐటెం సాంగ్స్ కూడా ఎంతో ఫేమస్. ఇక.. ‘ఆర్య’ సినిమాలో ఐటెం నంబర్ గురించి కూడా సుకుమార్ ఓ కథ చెప్పారు. అసలు ‘ఆర్య’లో ఐటెం నంబర్ పెట్టాలనుకోలేదట. ‘దిల్ సే’లోని ‘ఛ‌య్య‌.. ఛ‌య్య‌’ పాటంటే సుకుమార్ కు చాలా ఇష్టమట. అలాంటి పాటే త‌న సినిమాలో ఉండాల‌నుకొని.. దేవిశ్రీకి చెప్పడం అతను ‘అ అంటే’ ఇవ్వడం జరిగిందట. ఆ తర్వాత ట్యూన్ తీసుకెళ్లి వేటూరికి ఇస్తే.. ఆయ‌నేమో దాన్ని ఐటెమ్ సాంగ్ గా లిరిక్స్ రాశారట. ఇక.. పాట రెడీ చేయ‌డానికి టైమ్ లేక‌పోవ‌డంతో ఆ లిరిక్స్ తోనే సర్దుకుని సాంగ్ రికార్డ్ చేశారట.

ఇక.. ‘అ.. అంటే అమలాపురం’ పాటలో అల్లు అర్జున్ తో నర్తించడానికి ఓ పాపులర్ హీరోయిన్ ను తీసుకున్నారట. కానీ.. ఆమెకు బిజినెస్ క్లాస్ టికెట్ తీయాల్సివ‌స్తుంద‌ని చెప్పి.. చివ‌రి నిమిషంలో కాన్సిల్ చేశారట నిర్మాత దిల్ రాజు. ఆ ప్లేసులోకి అభిన‌య శ్రీ‌ని ప‌ట్టుకొచ్చారట. దీంతో.. ‘నేను అడిగిన హీరోయిన్ ఏమిటి? దిల్ రాజు ఇచ్చిన హీరోయిన్ ఏమిటి’ అంటూ తెగ ఫీలై పోయారట సుకుమార్. చివరకు సెట్లో అభిన‌య శ్రీ డాన్స్ చూసి ‘ఈ పాట‌కు త‌నే క‌రెక్ట్’ అని డిసైడ్ అయ్యారట. ‘అ.. అంటే అమలాపురం’ ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత సుకుమార్-దేవిశ్రీ కాంబినేషన్ అంటేనే ఐటెం నంబర్ ఉండాలి అన్నతంగా ప్రేక్షకులు కూడా ఫిక్సైపోయారు.

ఈ వేడుకలో అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన లైఫ్ లో ‘ఆర్య’ చాలా ఇంపాక్ట్ చూపించిందన్నాడు. ఇంకొక 30, 40 ఏళ్ళ తర్వాత కూడా తాను వెనక్కి తిరిగి చూసుకుంటే తన లైఫ్ లో సుకుమారే ఉంటాడన్నాడు. ‘గంగోత్రి’ తర్వాత ఇంజిన్ లేని భోగిలా తాను వెళ్తుంటే ‘ఆర్య’ సినిమాతో వచ్చి తనను సుకుమార్ లైన్ లో పెట్టాడని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు.

Related Posts