దిల్ రాజు మాట మీద నిలబడతాడా

సీనియర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న వ్యక్తి దిల్ రాజు. తన మాటే శాసనం అనేంత కాదుగానీ.. ఏదైనా సాధించుకునే సత్తా ఉన్న వాడు. అయితే కొన్నాళ్లుగా ఆయన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ పై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంతకు ముందు ఫలించలేదు. కానీ ఈ సారి సాధించాడు.

జూలై 30న జరిగిన టిఎఫ్ సిసి ఎన్నికల్లో ఛాంబర్ అధ్యక్షుడుగా గెలిచాడు. తమను తాము యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ గా చెప్పుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు రోజు ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా చెప్పిన మాటలను చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ప్రత్యర్థులు అయితే నిరంతరం గుర్తుంచుకుంటారు. మామూలుగా ఇప్పటి వరకూ సీనియర్ ప్రొడ్యూసర్లే ఎక్కువగా చాంబర్ అధ్యక్షులుగా చేశారు.

దిల్ రాజు లాంటి వారికి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. అందుకు కారణం.. వీళ్లు నిత్యం సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటారనే కారణమే. అదే దిల్ రాజు ప్రామిస్ చేశాడు. ఒక యేడాది కాలం పాటు ఛాంబర్ కు ఫుల్ టైమ్ కేటాయిస్తా అన్నాడు. ఈ యేడాదిలో తీసుకురావాల్సిన సంస్కరణలన్నీ తెస్తాం అన్నాడు. ఛాంబర్ పెట్టి యాభై యేళ్లు అవుతుంది. ఇప్పటికీ పాత రూల్స్ ఉన్నాయి. అవి మార్చి మళ్లీ రాబోయే కాలానికి సరికొత్త నిబంధనలు తీసుకువస్తాం అన్నాడు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా చాలా మారిందన్నాడు. టెక్నికల్ గానూ, బిజినెస్ పరంగానూ అనేక మార్పులు వచ్చాయని.. వీటికి అనుగుణంగా కొన్ని కొత్త మార్పులు చేస్తాం అని చెప్పాడు.

ఇంత వరకూ బానే ఉంది. మామూలుగా ఏ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవాళ్లైనా కొత్త హామీలు ఇవ్వడం మామూలే. అయితే అందరి అనుమానం ఏంటంటే.. అసలు దిల్ రాజు ఈ ఛాంబర్ కు టైమ్ ఇస్తాడా అని. తను చెప్పిన వాగ్దానాలు సరే.. అతను ఛాంబర్ కు మాగ్జమం టైమ్ ఇస్తా అన్న మాట మీద అయినా నిలబడతాడా అని.
అయితే కొన్నాళ్లుగా నిర్మాణ బాధ్యతలను పంచుతున్నాడు దిల్ రాజు. తన కూతురుతో పాటు సోదరుడి కొడుకులకు ఆ బాధ్యతను పంచుతున్నాడు.

బలగం సినిమాల నిర్మాతలుగా వాళ్ల పేర్లే వేశాడు. వారినే ముందుంచాడు. ఇకపై కూడా వారితో పాటు తన భార్యకు కూడా నిర్మాణ రంగంలోకి దించి తను మాత్రం ఈ ఛాంబర్ కు టైమ్ ఇచ్చి తీరతా అనేది అతని నిర్ణయం అంటున్నారు. ఏమైనా దిల్ రాజు చేసేవన్నీ చాలా పెద్ద ప్రాజెక్ట్స్. వాటిని మిగతా వాళ్లు హ్యాండిల్ చేయలేరు అనేది నిజం. మరి నిజంగా అతను తన వారసులకు ఆ బాధ్యత ఇచ్చి ఛాంబర్ లో సంస్కరణలు తెచ్చే బాధ్యత తీసుకునేందుకు మాటమీద నిలబడతాడా లేదా అనేది చూడాలి.

Related Posts