పొంగల్ పోరులో రజనీకాంత్ ‘లాల్ సలామ్‘

టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి ఇప్పటికే చాలా బెర్తులు ఖరారయ్యాయి. కోలీవుడ్ పొంగల్ రేసులో మాత్రం ఇప్పటివరకూ అఫీషియల్ గా పెద్ద సినిమాలేవీ కన్ఫమ్ కాలేదు. విక్రమ్ ‘తంగలాన్‘, శివకార్తికేయన్ ‘అయలాన్‘ వంటి సినిమాలు పొంగల్ రేసులో ఉన్నాయి కానీ ఇంకా తేదీలు ప్రకటించలేదు. అయితే తాజాగా తమిళనాట పొంగల్ బరిలో విడుదల తేదీ ఖరారు చేసుకుంది ‘లాల్ సలామ్‘.

‘జైలర్‘తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్ స్పెషల్ అప్పీరెన్స్ లో నటిస్తున్న సినిమా ‘లాల్ సలామ్‘. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో మొయిదీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నాడు.

విష్ణు విశాల్, విక్రాంత్ లు హీరోలుగా నటిస్తున్నారు. తెలుగు నటీమణి జీవిత రాజశేఖర్ మరో కీలక పాత్ర చేస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఐశ్వర్య రజనీకాంత్ కి గతంలోనూ దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. తన మాజీ భర్త ధనుష్ హీరోగా ‘త్రీ‘ మూవీని తెరకెక్కించింది. ఇక రజనీకాంత్ గతంలో తన చిన్న కుమార్తె డైరెక్ట్ చేసిన ‘కొచ్చాడయాన్‘లో హీరోగా నటించాడు. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో తెరకెక్కిన ‘కొచ్చాడయాన్‘ ఆశించిన విజయాన్ని సాధించలేదు. మరిప్పుడు పెద్ద కుమార్తె డైరెక్షన్ లో ‘లాల్ సలామ్‘ చేస్తున్నాడు.

Related Posts