‘కె.జి.యఫ్‘ స్టైల్ లోనే ‘ఘోస్ట్‘

‘బాహుబలి‘ సిరీస్ తెలుగు చిత్ర సీమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినట్టే.. ‘కె.జి.యఫ్‘ సిరీస్ కన్నడ ఇండస్ట్రీని జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. ‘కె.జి.యఫ్‘ స్ఫూర్తితో ఆ తర్వాత కన్నడ నుంచి కొన్ని సినిమాలొచ్చాయి. కానీ.. మళ్లీ ఆ రేంజ్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాయి. వాటిలో ఉపేంద్ర నటించిన ‘కబ్జా‘ ఒకటి. ‘కె.జి.యఫ్‘ను మక్కీకి మక్కీ దించేశారా అన్నట్టు ‘కబ్జా‘ను తీర్చిదిద్దారు మేకర్స్. ఆ కాపీ క్యాట్ కామెంట్స్ కూడా ‘కబ్జా‘ ఫెయిల్ అవ్వడంలో కీలక పాత్ర పోషించాయి.

సినిమాలో కంటెంట్ ఉంటే అలాంటి కామెంట్స్ ను అస్సలు పట్టించుకోనవసరం లేదు. శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్‘ విషయంలో ఇదే జరుగుతుందంటున్నారు మేకర్స్. శాండల్ వుడ్ లో సెంచరీ స్టార్ గా పేరుతెచ్చుకున్న శివరాజ్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్‘. కన్నడలో ‘బీర్బల్‘ ట్రయాలజీతో యాక్టర్ గా, డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఎమ్.జి.శ్రీనివాస్ ‘ఘోస్ట్‘ సినిమాని తెరకెక్కించాడు. ఒకవిధంగా ‘బీర్బల్‘ ట్రయాలజీలో ఒక భాగమే ‘ఘోస్ట్‘.

భారీ బడ్జెట్ తో పీరియాడ్ డ్రామాగా తెరకెక్కిన ‘ఘోస్ట్‘ ట్రైలర్ రిలీజయ్యింది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే ‘కె.జి.యఫ్‘ ట్రైలర్ ను గుర్తు చేసేలా ఉంది. ‘యుద్ధం మానవ ప్రపంచానికి ఒక మాయని గాయం. ఇలాంటి యుద్ధాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా అవి చేసిన నష్టాలే ఎక్కువ. సామ్రాజ్యాల్ని నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నోసార్లు మరిచిపోయి ఉండొచ్చు. కానీ విధ్వంసం సృష్టించే నాలాంటి వాడిని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. దే కాల్డ్ మీ.. ఈ ఈజ్ ఘోస్ట్‘ అనే డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం గ్రాండ్యుయర్ విజువల్స్ తో ఆకట్టుకుంటోంది.

ఇంకా ‘బలమున్న వారి గురించి చరిత్ర లిఖిస్తారు కానీ.. సలాం కొట్టే వాడి గురించి ఒక్క అక్షరం కూడా రాయరు‘, ‘నేను నార్మల్ గా ఎవరి జోలికి వెళ్లను.. ఓడిపోతానన్న భయం కాదు.. నేను వెళితే రణరంగం మారణహోమం గా మారుతోంది‘. అంటూ సాగే డైలాగ్స్ కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ లో యంగ్, మిడిల్ ఏజ్ లుక్స్ లో శివన్న మేకోవర్ బాగుంది. టాలెంటెడ్ యాక్టర్స్ అనుపమ్ ఖేర్, జయరామ్ లు కీ రోల్స్ పోషించారు.

దసరా కానుకగా అక్టోబర్ 19న ‘ఘోస్ట్‘ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే సమయానికి తెలుగు నుంచి ‘భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు‘.. తమిళం నుంచి విజయ్ ‘లియో‘.. హిందీ నుంచి ‘గణపత్‘ సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి. మొత్తంమీద.. దసరాకి బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర అయితే మామూలుగా లేదు.

Related Posts