సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టుకున్న ‘రామాయణ్‘

పురాణ పురుషుడు శ్రీరాముడి కథను వెండితెరపై ఇప్పటికే ఎన్నోసార్లు ఆవిష్కరించారు. పోయినేడాది ప్రభాస్ శ్రీరాముడుగా నటించిన ‘ఆదిపురుష్‘ విడుదలైంది. అయితే.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ‘ఆదిపురుష్‘ పూర్తిగా విఫలమయ్యింది. ఇక.. రణ్ బీర్ కపూర్ రాముడుగా మరో ‘రామాయణ్‘ను వెండితెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు చాన్నాళ్లుగా ప్రచారమవుతోంది. రణ్ బీర్ శ్రీరాముడుగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా ‘దంగల్‘ ఫేమ్ నితీష్ తివారి ‘రామాయణ్‘ను తెరకెక్కించబోతున్నాడు.

ఆమధ్య శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకున్న ‘రామాయణ్‘ మొదలవుతుందని వినిపించింది. అయితే.. ‘రామాయణ్‘ చిత్రాన్ని ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా చిత్రీకరణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రామ, సీత పాత్రల్లో రణ్ బీర్, సాయిపల్లవి కనిపిస్తున్న సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు మార్ఫింగ్ లా కూడా లేవు. దీంతో.. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ‘రామాయణ్‘ మొదలయ్యిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో పలు భాగాలుగా ‘రామాయణ్‘ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మైథలాజికల్ మూవీలో రావణుడి తమ్ముడు విభీషణుడి పాత్ర కోసం తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారట. రావణుడి మరో తమ్ముడు కుంభ కర్ణుడిగా బాబీ డియోల్.. హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ కనిపించబోతున్నారనేది బాలీవుడ్ టాక్. ఈ సినిమాలో లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టి నటిస్తాడని వినిపిస్తోంది. త్వరలోనే ‘రామాయణ్‘కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారట.

Related Posts