కమల్-శంకర్ ‘ఇండియన్‘ మూవీకి 28 ఏళ్లు

స్వాతంత్ర్యోద్యమంలో వీరోచితంగా పోరాడిన ఓ భారతీయుడు.. స్వాతంత్ర్యానంతరం జరుగుతోన్న అవినీతిపై ఎలా ఉక్కు పాదం మోపాడన్న కథతో ‘ఇండియన్’ చిత్రం వచ్చింది. 1996, మే 9న విడుదలైన ‘ఇండియన్‘ ఒరిజినల్ తమిళంతో పాటు.. తెలుగు, హిందీ భాషల్లోనూ అనువాద రూపంలో రిలీజై సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈరోజుతో (మే 9) ‘ఇండియన్‘ రిలీజైన 28 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.

అప్పటికే ‘జెంటిల్ మేన్, ప్రేమికుడు‘ వంటి వరుస విజయాలందుకున్న డైరెక్టర్ శంకర్ కి దక్కిన హ్యాట్రిక్ హిట్ ‘ఇండియన్‘. ఇక.. విశ్వనటుడు కమల్ హాసన్ ను మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిపిన సినిమా కూడా ‘ఇండియన్‘. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం పోషించాడు కమల్. సీనియర్ కమల్ కి జోడీగా సుకన్య నటిస్తే.. జూనియర్ కమల్ కి జంటగా మనీషా కోయిరాలా, ఊర్మిళ నటించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ.ఎమ్.రత్నం నిర్మించిన ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయ్యింది.

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ రీ రిలీజుల సంప్రదాయం కొనసాగుతోంది. ఈ కోవలోనే.. ‘ఇండియన్‘ని కూడా త్వరలోనే రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు.. ‘ఇండియన్‘కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘ఇండియన్ 2‘ జూన్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts