ఎన్టీఆర్,చరణ్ లకు హీరోయిన్.. బన్నీకి మాత్రం ఐటెమ్ గర్ల్?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ ఏడాది అది కార్యరూపం దాల్చబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది జాన్వీ. ఈ సినిమా మాత్రమే కాదు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు చేసే సినిమాలోనూ జాన్వీ కపూర్ ని నాయికగా ఎంచుకున్నారు. అలా.. ‘ఆర్.ఆర్.ఆర్‘తో గ్లోబల్ స్టార్స్ గా మారిన ఎన్టీఆర్, చరణ్ ఇద్దరితోనూ హీరోయిన్ గా నటించే అరుదైన అవకాశాన్ని జాన్వీ సొంతం చేసుకుంది.

ఒకవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన హీరోయిన్ గా చేస్తోన్న జాన్వీ.. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2‘లో ఐటెమ్ నంబర్ గా నటించబోతుందనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా స్ప్రెడ్ అవుతోంది. ఐటెమ్ సాంగ్స్ ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే సుకుమార్.. ‘పుష్ప 2‘లోనూ స్పెషల్ సాంగ్ ను సమ్ థింగ్ స్పెషల్ గా డిజైన్ చేశాడట. ఈ పాటకోసం ఇప్పటికే ఓ అదిరిపోయే మాస్ మసాలా ట్యూన్ ఇచ్చాడట దేవిశ్రీప్రసాద్. ఇక.. ఈ ప్రత్యేక గీతంలో నర్తించేందుకు చాలామంది హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా మొన్నటివరకూ బాలీవుడ్ నుంచి నోరా ఫతేహి పేరు వినిపించింది. లేటెస్ట్ గా జాన్వీ పేరు తెరపైకి వచ్చింది.

జాన్వీ కపూర్ కి స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేమీ కాదు. బాలీవుడ్ లో ఇప్పటికే రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. అయితే.. తెలుగులో ఈ అమ్మడు ఐటెమ్ నంబర్ చేస్తోందా? లేదా? అనేదే అనుమానం. ఎందుకంటే.. జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న ‘దేవర‘ కంటే ముందే అంటే ఈ ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప2‘ విడుదలకు ముస్తాబవుతోంది. మరి.. తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే ఐటెమ్ సాంగ్ తో ఇవ్వాలా? అనేది ఇప్పుడు జాన్వీ సంశయమట.

Related Posts