మ్యూజికల్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ పాటలను అభిమానించని తెలుగు వారుండరు. అయితే.. రెహమాన్ ఎక్కువగా తెలుగులో సినిమాలు చేయకపోయినా.. తన అనువాద చిత్రాల పాటలతోనే ఇక్కడ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక.. రెహమాన్ తెలుగు సినిమాల విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తే.. 1993లో బాలకృష్ణ నటించిన ‘నిప్పురవ్వ’ చిత్రానికి సంగీత దర్శకులు బప్పిలహిరి, రాజ్ కోటి. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెహమాన్ సమకూర్చాడు.
ఆ తర్వాత కృష్ణంరాజు ‘పల్నాటి పౌరుషం’, వెంకటేష్ ‘సూపర్ పోలీస్’, రాజశేఖర్ ‘గ్యాంగ్ మాస్టర్’ వంటి చిత్రాలకు సంగీతాన్నందించాడు. ఈ సినిమాల తర్వాత ‘నీ మనసు నాకు తెలుసు, నాని, ఏమాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించాడు. అయితే.. వీటిలో ఎక్కువగా తమిళం- తెలుగు బైలింగ్వల్స్ మాత్రమే ఉన్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత రెహమాన్ కేవలం తెలుగులోనే పనిచేసిన చిత్రంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ని చెప్పాలి.
మొత్తానికి.. తెలుగులో రెహమాన్ పూర్తిస్థాయిలో సంగీతాన్నందించబోతున్న చిత్రం ‘RC16’. రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో మ్యూజిక్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందట. ఈ సినిమాలోని పాటలే కాకుండా, థీమ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ వంటివి ఎంతో విభిన్నంగా ఉంటాయట. అందుకే.. RC16 కోసం సంగీతం పరంగా ఎంతో కష్టపడుతున్నాడట ఏ.ఆర్.రెహమాన్.