విజయ్ సేతుపతికి మరోసారి శ్రీలంక సెగ.. ‘రామాయణ’ నుంచి ఔట్?

కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమాల స్పీడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు హీరోగా దుమ్మురేపుతూనే మరోవైపు క్యారెక్టర్స్ లోనూ చెలరేగిపోతుంటాడు. ప్రత్యేక పాత్రల విషయానికొస్తే అది ఎలాంటి రోల్ అయినా.. ఆ పాత్రకు తాను వంద శాతం న్యాయం చేకూరుస్తున్నాడు. ఈకోవలోనే విజయ్ సేతుపతికి.. బాలీవుడ్ మూవీ ‘రామాయణ’లో విభీషణుడి పాత్ర పోషించే అవకాశం వచ్చింది.

రణ్ బీర్ కపూర్ రాముడుగా, సాయిపల్లవి సీతగా.. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఉత్తరాది, దక్షిణాది నటీనటుల సమ్మేళనంతో రూపొందుతోన్న ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా, హనుమాన్ పాత్రలో సన్నీడియోల్, సూర్ఫనఖ గా రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టి దాదాపు ఖరారు అయ్యారు. ఈ లిస్టులో విభీషణుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు.

తొలుత ఈ చిత్రంలో నటిస్తానని చెప్పిన విజయ్ సేతుపతి.. వేరే ప్రాజెక్ట్స్ తో డేట్స్ క్లాష్ అవుతుండడంతో ‘రామాయణ’కి నో చెప్పాడట. దీంతో ఆ పాత్రకోసం బాలీవుడ్ నటుడు హర్మన్ బవేజాను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట నితీష్ తివారి. రాబోయే శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే.. ‘రామాయణ’ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడానికి అసలు కారణం శ్రీలంక అని తెలుస్తోంది. గతంలో శ్రీలంకకు చెందిన క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో మురళీధరన్ పాత్రను ముందుగా విజయ్ సేతుపతి చేస్తానన్నాడు. అయితే.. శ్రీలంక తమిళుల ఆందోళనకు మద్దతు ఇవ్వని క్రికెటర్ జీవితకథలో నటించడానికి వీళ్లేదని తమిళులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించడంతో ఆ బయోపిక్ నుంచి తప్పుకున్నాడు సేతుపతి. ఇప్పుడు లంకాధిపతి రావణుడి తమ్ముడైన విభీషణుడి పాత్ర విషయంలోనూ ఇలాంటి ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విజయ్ సేతుపతి ‘రామాయణ’ నుంచి తప్పుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

Related Posts