లోకేష్ విష్ లిస్ట్ లో ఆ ముగ్గురు హీరోలు.. టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ

తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఆన్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టిస్తుంటాడు లోకేష్ కనకరాజ్. ఈరోజు (మార్చి 14) లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు. సందీప్ కిషన్ నటించిన ‘మానగరం’తో దర్శకుడిగా తన టాలెంట్ ను బయటపెట్టిన లోకేష్ కి.. ‘ఖైదీ’ రూపంలో బడా హిట్ వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ‘ఖైదీ‘ అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తెలుగులోనూ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. హీరోయిన్ లేకుండా.. పాటలు లేకుండా సరికొత్త పంథాలో సాగుతూ.. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించి.. లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ కి శ్రీకారం చుట్టింది ‘ఖైదీ‘.

లోకేష్ లోని టాలెంట్ ను ‘ఖైదీ’ కంటే ముందే పసిగట్టిన విజయ్.. ‘మాస్టర్’తో ఈ యంగ్ డైరెక్టర్ కి మెమరబుల్ ఆఫర్ ఇచ్చాడు. ఇళయదళపతి ఇచ్చిన అవకాశాన్ని లోకేష్ ‘మాస్టర్’ చిత్రంతో బాగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతిని ఒకే ఫ్రేములో చూపించి బంపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్ ‘విక్రమ్‘తో లోకేష్ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

‘లియో‘తో ట్రాక్ తప్పాడనే విమర్శలు వినిపించినా.. ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల గురించి వింటే అది తప్పనే అనిపిస్తుంది. టాక్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ‘లియో‘ కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ప్రస్తుతం రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న లోకేష్ కనకరాజ్.. తన తర్వాతి చిత్రంతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే సన్నాహాల్లో ఉన్నాడట.

కన్నడలో డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో ఫేమస్ అయిన కె.వి.ఎస్. ప్రొడక్షన్స్.. ప్రస్తుతం యష్ హీరోగా ‘టాక్సిక్‘ సినిమాని తెరకెక్కిస్తుంది. ఈ ప్రొడక్షన్ హౌస్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక తెలుగు సినిమాని ప్లాన్ చేసిందట. ప్రధానంగా తెలుగులో తెరకెక్కించి.. ఆ తర్వాత తమిళం, కన్నడ, హిందీ వంటి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఈ సినిమాలో ప్రభాస్ లేదా ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఒకరు హీరోగా నటిస్తారనే ప్రచారం జరుగుతుంది. లోకేష్ చెచ్చిన స్టోరీ ఈ హీరోలలో ఎవరికి నచ్చుతుందో.. ఎవరు ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారో? చూడాలి.

Related Posts