అసలు ఎవరీ రహస్య గోరక్..కిరణ్ అబ్బవరంతో ప్రేమ ఎలా మొదలైంది?

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో యువ కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో తన తొలి చిత్ర నాయిక రహస్య గోరక్ ని వివాహం చేసుకోబోతున్నాడు. ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం జరుపుకుంది. ఈనేపథ్యంలో.. అసలు ఎవరీ రహస్య గోరక్. ఆమె నేపథ్యం ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి.

రహస్య గోరక్.. చక్కనైన రూపంతో కనిపించే అందమైన అమ్మాయి. రహస్య పుట్టిన తేదీ.. 1994వ సంవత్సరం మార్చి 26. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన రహస్య గోరక్.. మొదట మోడల్ గా పనిచేసింది. ఆ తర్వాత 2016లో ‘ఆకాశమంత ప్రేమ‘ అనే షార్ట్ ఫిల్మ్ తో డిజిటల్ దునియాలోకి ఎంట్రీ ఇచ్చింది. నితీష్ కరింగుల దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ లో ఈమె పేరును ఐశ్వర్య గోరక్ గా వేశారు. హర్ష నర్రా హీరోగా నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ లో సరయూ పాత్రలో అదరగొట్టింది ఐశ్వర్య గోరక్ అలియాస్ రహస్య గోరక్.

ఆ తర్వాత 2019లో ‘రాజా వారు రాణి గారు‘ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ టైటిల్ రోల్స్ లో ఈ సినిమా రూపొందింది. సురేష్ ప్రొడక్షన్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదలైన ‘రాజా వారు రాణి గారు‘ థియేట్రికల్ గా ఫర్వాలేదనిపిస్తే.. ఓటీటీలో మాత్రం దుమ్మురేపింది. ఈ సినిమాలో రాజా పాత్రలో కిరణ్ నటిస్తే.. రాణి గా రహస్య కనిపించింది. ఆద్యంతం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది. సినిమా ఆద్యంతం ఎంతో అందంగా కనిపించే రహస్య.. మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది. ఈ మూవీలో కిరణ్, రహస్య జోడీని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఆ రీల్ జోడీయే ఇప్పుడు రియల్ జోడీగా మారుతోంది.

‘రాజా వారు రాణి గారు‘ తర్వాత తెలుగులో ఎందుకనో సినిమాలు చేయలేదు రహస్య. ఒకవిధంగా కిరణ్ తో లవ్ స్టోరీయే అందుకు కారణమేమో. మరోవైపు తమిళంలో మాత్రం ‘షరబత్‘ అనే ఒక సినిమాలో నటించింది. కదిర్ హీరోగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది రహస్య. అయితే.. కరోనా సమయంలో వచ్చిన ఈ మూవీ డైరెక్ట్ కలర్స్ తమిళ్ టి.వి.లో రిలీజయ్యింది.

తాజాగా కిరణ్ అబ్బవరంతో రహస్య గోరక్ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారనే ప్రచారం ఉంది. పెళ్లి తేదీని త్వరలోనే ప్రకటించనున్నారట. మొత్తంమీద.. రహస్య పెళ్లి తర్వాత నటిస్తోందా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

Related Posts