ఈ వేసవిలో చిన్న చిత్రాలదే పెద్ద వినోదం

సంక్రాంతి తర్వాత సినిమాలకు పెద్ద సీజన్ అంటే సమ్మర్. ఈ వేసవిలో పెద్ద సినిమాలు పెద్దగా లేవు. ఈ వేసవి అంతా చిన్న చిత్రాలదే రాజ్యం. మార్చి మూడో వారం నుంచి సమ్మర్ సీజన్ మొదలవుతోంది. ఇక.. సూపర్ హాట్ సమ్మర్ లో కూల్ ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి పలు చిన్న చిత్రాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. వీటిలో ముందుగా ఆడియన్స్ ముందుకొస్తుంది ‘ఓం భీమ్ బుష్‘.

గతంలో ‘జాతిరత్నాలు‘ వంటి ఫక్తు ఎంటర్ టైనర్ మూవీ మార్చి నెలలోనే వచ్చింది. ఇక.. ఈ మార్చి 22న అదే తరహాలో అదిరిపోయే ఫన్ పంచడానికి ‘ఓం భీమ్ బుష్‘ రాబోతుంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అంటూ ఎంటర్ టైన్ మెంట్ మెయిన్ మోటోగా వస్తోంది ఈ చిత్రం. ఇప్పటికే ‘హుషారు‘ వంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అందించిన హర్ష కొనుగంటి తెరకెక్కించిన ‘ఓం భీమ్ బుష్‘ చిత్రం ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకుంది. యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

మార్చి 22నే అల్లరి నరేష్ ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ విడుదలకు ముస్తాబవుతోంది. అసలు ఈ జెనరేషన్ లో కామెడీకి హీరోయిజాన్ని ఆపాదించిన హీరో అల్లరి నరేష్. కొన్నాళ్లుగా కామెడీని పక్కనపెట్టిన సీరియస్ మూవీస్ వైపు అడుగులు వేసిన అల్లరోడు.. మళ్లీ తనదైన పద్ధతిలో ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో కామెడీ పంచడానికి సిద్ధమవుతున్నాడు. మల్లీ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలకా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ ఇప్పటికే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

వేసవి కానుకగా వినోదాన్ని పంచడానికి మార్చి చివరి వారంలో వస్తోంది ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా, టిల్లు శైలి సంభాషణలతో సీక్వెల్ కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సిద్ధుకి దీటైన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతుంది. ఇప్పటివరకూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో మెరిసిన అనుపమ.. ఈ మూవీలో తన బోల్డ్ అవతార్ ని ఆవిష్కరించబోతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29న థియేటర్లలోకి వస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’ మంచి విజయాన్ని సాధించింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మళ్లీ ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈసారి విజయ్ కి జోడీగా లక్కీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ‘గీత గోవిందం’ వైబ్స్ తో రాబోతున్న ‘ఫ్యామిలీ స్టార్’ కూడా ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అలరించడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలోకి వస్తోంది.

సమ్మర్ పీక్స్ లో ఉండే ఏప్రిల్ నెలలో హారర్ కామెడీతో అలరించడానికి వస్తోంది ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. అంజలి టైటిల్ రోల్ లో రూపొందిన ఈ సీక్వెల్ మూవీని కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సునీల్, ఆలీ, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య వంటి కామెడీ స్టార్స్ ఉన్నారు. అసలు ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేద్దామనుకున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాని ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.

వేసవి కానుకగా ఎన్నో చిన్న చిత్రాల మధ్య రాబోతుంది బడా మూవీ ‘కల్కి 2898 ఎడి’. మే 9న ప్రభాస్ ‘కల్కి’ విడుదలకు ముస్తాబవుతోంది. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఉన్న నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నుంచి వస్తోన్న ప్రతిష్ఠాత్మక సినిమా ఇది. పాన్ వరల్డ్ రేంజులో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ కథ, కథనాల ప్రకారం కొత్త సంచలనాలు సృష్టిస్తుందని నమ్ముతున్నారు మేకర్స్.

Related Posts