హ్యాపీ బర్త్ డే సునీల్

స్వయంకృషితో అగ్ర పథానికి దూసుకెళ్లిన నటుడు సునీల్. అతను కమెడియన్ గా పరిచయం కాలేదు. జస్ట్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తోనే నవ్వించాడు. పెద్దగా క్రెడిట్ లేని పాత్రలు చేసినా.. కనిపించడం మొదలుపెట్టిన తర్వాత కడుపుబ్బా నవ్వించి.. ఓ దశలో అలీ, బ్రహ్మీలకే స్ట్రాంగ్ పోటీ ఇచ్చాడు. ఈతరం కమెడియన్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే.. కమెడియన్ నుంచి హీరోగా ప్రమోషన్ తీసుకున్న ‘భీమవరం బుల్లోడు’.. కొన్ని విజయాలైతే అందుకున్నాడు కానీ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. మళ్లీ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ తో సరికొత్త పాత్రలతో టాలీవుడ్ టు కోలీవుడ్ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 28) సునీల్ బర్త్ డే.

మిత్రుడు త్రివిక్రమ్ అండదండలతో ‘నువ్వే కావాలి’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయిన సునీల్.. ప్రేక్షకుల దృష్టిలో పడటానికి పెద్దగా టైమ్ పట్టలేదు. అదే సంవత్సరం రిలీజైన ‘చిరునవ్వుతో’ సినిమాలోనూ అవకాశం దక్కించుకుని.. తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ను సెట్ చేసుకున్నాడు. గోదావరి యాసలో ప్రాసలతో కూడిన పంచెస్ సునీల్ స్పెషాలిటీ. అందుకే.. రచయితలంతా సునీల్ ని దృష్టిలో పెట్టుకుని ఆ తరహా పంచెస్ ను ప్రత్యేకంగా రాసేవారు. ‘నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, నువ్వు-నేను’ చిత్రాలు సునీల్ ని స్టార్ కమెడియన్ గా మార్చేశాయి.

కమెడియన్ గా ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సునీల్ 2006లో ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా టర్న్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాదరామన్న’లో కథానాయకుడిగా నటించే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ రెండు సినిమాల విజయాలతో ఇకపై హీరోగానే కొనసాగాలని డిసైడయ్యాడు. అలా.. ‘పూల రంగడు, Mr. పెళ్ళి కొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, 2 కంట్రీస్’ వంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించాడు. కానీ.. హీరో అనే ట్యాగ్ లైన్ సునీల్ కి నిరాశే మిగిల్చింది. ఆరంభంలో విజయాలు వరించినా.. రాను రాను ఫ్లాపులు పలకరించాయి. దీంతో.. ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

కమెడియన్ గానే కాకుండా అడపాదడపా విలనీ రోల్స్ లోనూ మురిపిస్తున్నాడు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఫుల్ బిజీగా దూసుకెళ్తున్నాడు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. మునుముందు కూడా ఎన్నో విభిన్న తరహా పాత్రలతో సునీల్ అలరించాలని ఆకాంక్షిస్తూ ఈ భీమవరం బుల్లోడికి మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం.

Related Posts