మూడు మెగా ప్రాజెక్ట్స్ తో మరకతమణి

మరకతమణి కీరవాణి.. టాలీవుడ్ లో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. మూడున్నర దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు అడపాదడపా పరభాషల్లోనూ తన మ్యూజికల్ మ్యానియాను చూపిస్తూనే ఉన్నాడు. ఆమధ్య సినిమాల నుంచి రిటైర్ మెంట్ తీసుకుంటానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీంతో.. ఇకపై కీరవాణి సినిమాలకు పనిచేయడు అనే అనుకున్నారంతా.

కట్ చేస్తే.. ఇప్పుడు కీరవాణి మళ్లీ ఫుల్ ఫామ్ లో దూసుకెళ్తున్నాడు. ఒకేసారి మూడు మెగా ప్రాజెక్ట్స్ కి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది SSMB29. తన తమ్ముడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో. అడ్వంచరస్ థ్రిల్లర్ గా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మ్యూజికల్ జర్నీ ప్రారంభించాడట కీరవాణి.

కీరవాణి కిట్టీలో ఉన్న రెండో మెగా ప్రాజెక్ట్ ‘విశ్వంభర’. మెగాస్టార్ చిరంజీవితో మూడు దశాబ్దాల గ్యాప్ తర్వాత కీరవాణి చేస్తున్న సినిమా ఇది. వశిష్ట డైరెక్షన్ లో రూపొందిన ‘బింబిసార’కు కీరవాణి మ్యూజికల్ సపోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’కి కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణలు కానున్నాయట.

ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీలో చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్ వంటి వారికి మెమరబుల్ మ్యూజికల్ హిట్స్ అందించిన కీరవాణి.. తొలిసారి పవన్ కళ్యాణ్ తో పనిచేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో షూటింగ్ డిలే అయ్యింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో ఫిక్షనల్ స్టోరీగా ‘హరిహర వీరమల్లు’ రెడీ అవుతోంది.

చిరంజీవి, మహేష్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు మెగా ప్రాజెక్ట్స్ తో పాటు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న ‘లవ్ మీ’ మూవీకి కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు కీరవాణి. ఇంకా.. మరికొన్ని ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయట. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి.. ఇకపై సినిమాల స్పీడు పెంచబోతున్నట్టు అర్థమవుతోంది.

Related Posts