‘సలార్’ రివ్యూ.. ప్రభాస్ ఈజ్ బ్యాక్

నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, సప్తగిరి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రీయారెడ్డి, జాన్ విజయ్, ఝాన్సీ, పృథ్వీరాజ్, టిను ఆనంద్ తదితరులు
సినిమాటోగ్రఫి: భువన్ గౌడ
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
మ్యూజిక్: రవి బస్రూర్
నిర్మాత: విజయ్ కిరంగదూర్
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
విడుదల తేదీ: 22-12-2023

ప్రభాస్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన క్షణం రానే వచ్చింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన ‘సలార్’ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ‘సలార్’ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది? రెబెల్ స్టార్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడా? వంటి విశేషాలన్నీ ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
కథగా చెప్పుకుంటే వెయ్యేళ్లుగా ఖాన్సార్ అనే అటవీ ప్రాంతాన్ని మూడు తెగలు పరిపాలిస్తుంటాయి. ఎంతో వైలెంట్ గా ఉండే వారంటే అందరికీ భయమే. చివరకు బ్రిటీష్ వాళ్లు కూడా వీళ్లను ఏమీ చేయలేరు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఖాన్సార్ అనేది ప్రత్యేక ప్రాంతంగా చీకటి రాజ్యంగా కొనసాగుతూనే ఉంటుంది.

ఖాన్సార్ సామ్రాజ్యంలో ఉండే వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్), దేవా (ప్రభాస్) చిన్ననాటి
మిత్రులు. వరదరాజ్ మన్నార్ కి ఆపద వస్తే ఆదుకోవడంలో ముందుంటాడు దేవా. అలాగే.. దేవాకి ఎలాంటి సహాయాన్ని చేయడానికైనా వెనుకాడడు వరద. అలాంటి వీరిద్దరూ విడిపోవాల్సి వస్తుంది. తన అమ్మ కోసం వరదరాజ మన్నార్ కు దూరంగా ఖాన్సార్ సామ్రాజ్యాన్ని వదిలి అస్సాం వెళ్లిపోతాడు దేవా. పెరిగి పెద్దవాడవుతాడు.

ఈలోపులో ఆద్య (శృతిహాసన్) తన తండ్రికి తెలియకుండా విదేశాల నుంచి ఇండియా పారిపోయి వస్తుంది. ఆమెకు ప్రాణహాని ఉందని తెలిసి ఆద్య తండ్రి ఒక సహాయకుడి ద్వారా ఆమెను దేవా దగ్గరకు చేర్చుతాడు. ఆమెను దేవా ఎందుకు రక్షించాలనుకున్నాడు? అసలు ఖాన్సార్ సామ్రాజ్య చరిత్ర ఏంటి? అందులో తెగలు ఏంటి? ఆ తెగలకు దేవాకు, వరదరాజ మన్నార్ కు సంబంధం ఏంటి? అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ:
ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ నేరేషన్ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అతని సినిమాల్లో చాలా పాత్రలుంటాయి. ఆ పాత్రల పరిచయం కోసం వాయిస్ ఓవర్ ఉపయోగిస్తుంటాడు. ‘సలార్’ కూడా అదే స్టైల్ లో సాగుతోంది. ఖాన్సార్ సామ్రాజ్యం, తెగలు, అక్కడి వారి పేర్లు.. అంతా ఓ కొత్త ప్రపంచంలా ఉంటుంది. అయితే.. ఆ ప్రపంచానికి.. ప్రెజెంట్ ఇండియాకి ముడిపెడుతూ ‘సలార్’ని తీర్చిదిద్దాడు ప్రశాంత్.

సినిమా మొదలవ్వడమే ప్రభాస్ ను ఓ అండర్ డాగ్ క్యారెక్టర్ లో ప్రవేశ పెట్టాడు. ఇక సినిమా నడిచే కొద్దీ గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు పెరుగుతూ వచ్చాయి. రెబెల్ స్టార్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో.. ఆ కటౌట్ నుంచి ఎలాంటి ఎలివేషన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారో.. అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.

అయితే కథే కొంచెం కన్ప్యూజన్ గా ఉంటుంది. ఖాన్సార్ అనే సామ్రాజ్యం చుట్టూనే సినిమా సాగితే ఆ గందరగోళం ఉండేది కాదు. సినిమాలోని తొలి భాగం అంతా అస్సాం నేపథ్యంలోని ఓ మైనింగ్ చుట్టూ సాగడం.. అక్కడ ప్రభాస్ ను అండర్ ప్లే లో చూపించడంతో కొంచెం నీరసంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ఫస్టాప్ ను చూస్తే.. ప్రశాంత్ నీల్ ‘ఉగ్రం’ గుర్తుకు రాక మానదు. ఆ సినిమాకి ‘సలార్’ రీమేక్ అనే ప్రచారం జోరుగానే సాగింది. ఫస్టాప్ సన్నివేశాలు చూస్తే ‘ఉగ్రం’ను ప్రేరణగా తీసుకున్నాడనే చెప్పొచ్చు.

నటీనట, సాంకేతిక వర్గం:
బాహుబలి’ సిరీస్ తర్వాత అసలు సిసలు సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఆ విషయంలో ఫ్యాన్స్ కి ‘సలార్’ విజువల్ ట్రీట్ అందిస్తోంది. యాక్షన్ సీక్వెన్సెస్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది. ప్రభాస్ కటౌట్ కి సరిపోయేటట్టు ఆ యాక్షన్ ఘట్టాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ప్రభాస్ దేవా పాత్రలో నట విశ్వరూపం చూపించాడు. ఆ స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి.

పృథ్వీరాజ్ పాత్ర విషయానికొస్తే.. అసలు ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ చాలా లేటుగా ఉంటుందనే ప్రచారం ముందు నుంచీ జరిగింది. కానీ.. అందుకు రివర్స్ లో పృథ్వీరాజ్ రోల్ చాలా లేటుగా ఎంట్రీ ఇస్తోంది. మరో ప్రధాన పాత్ర శృతి హాసన్ రోల్ కూడా కథలో చాలా కీలకంగా ఉంది.

ఇంకా.. ప్రభాస్ తల్లి పాత్రలో ఈశ్వరి రావు ది పవర్ ఫుల్ రోల్. ఖాన్సార్ సామ్రాజ్యాధినేతగా జగపతిబాబు, ఆ సామ్రాజ్యంలో కీలకమైన పదవుల్లో ఉండే పాత్రల్లో శ్రీయ రెడ్డి, జాన్ విజయ్, గరుడ రామచంద్రరాజు పాత్రలు బాగున్నాయి. సాంకేతిక విభాగాల విషయానికొస్తే భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ మ్యూజిక్ ‘సలార్’ని మరో లెవెల్ లో నిలబెట్టాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా
‘సలార్’ మొదటి భాగం చూస్తే.. గతంలో ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ ని ఎలా అయితే అర్థాంతరంగా ఆపేసినట్టు అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఖాన్సార్ సామ్రాజ్యం గురించి చెప్పాలనుకునే కథంతా సెకండ్ పార్ట్ లో మిగిలిపోవడమే. అసలు ఖాన్సార్ సామ్రాజ్యానికి దేవా ‘సలార్’గా ఎలా మారాడు అనేది కూడా రెండో భాగంలోనే ఉండబోతుంది. మరి.. ఖాన్సార్ ను వెండితెరపై మరింత అద్భుతంగా ఆవిష్కరించే ‘సలార్ పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం’ కోసం వెయిట్ చేయాల్సిందే.

Related Posts