రివైండ్ 2023.. చిన్న సినిమాలు పెద్ద విజయాలు

కంటెంట్ బాగుంటే చాలు సినిమా చిన్నదా, పెద్దదా అని ఆలోచించరు ఆడియన్స్. సినిమా చిన్నదైనా.. పెద్ద విజయాలు అందిస్తుంటారు. 2023లో కూడా కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బలగం’ సినిమా గురించి.

‘జబర్దస్త్’ వేణుగానే ఎక్కువ మందికి పరిచయమున్న కమెడియన్ వేణు ‘బలగం’ సినిమాతో అందరికీ షాకిచ్చాడు. వేణు లో ఇంత టాలెంట్ ఉందా? అని మెగాస్టార్ సైతం ఆశ్చర్యపోయేలా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. తెలంగాణలోని ఓ పల్లెటూరి నేపథ్యం చుట్టూ సాగే ఈ సినిమాలో.. ఒక చావు కుటుంబ బలగాన్నంతా ఎలా దగ్గర చేస్తుంది అనేది ఎంతో హృద్యంగా.. సహజత్వంతో తెరకెక్కించాడు వేణు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ‘బలగం’ జాతీయ, అంతర్జాతీయంగా పలు అవార్డులు కూడా అందుకుంది.

ఈ ఏడాది జూన్ లో విడుదలైన ‘సామజవరగమణ’ క్లాసీ ఎంటర్ టైనర్ గా అలరించింది. టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల్లో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు. ఈకోవలోనే ‘సామజవరగమన’తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్ దండ నిర్మించిన ఈ సినిమా ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ను అలరించింది. శ్రీవిష్ణు, రెబ్బ మోనిక జాన్ జోడీ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్ పాత్రలు గుర్తుండిపోతాయి.

ఈ ఏడాది జూలైలో విడుదలైన కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామా ‘బేబి’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కామెడీ ఎంటర్ టైనర్స్ ను మాత్రమే తీయగలడనుకున్న సాయి రాజేష్ ఈ సినిమాని తెరకెక్కించిన విధానానికి.. అతని రైటింగ్ టాలెంట్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఇక.. జర్నలిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ గా మారిన ఎస్.కె.ఎన్. ను ‘బేబి’ సినిమా నిర్మాతగా అగ్ర పథాన నిలబెట్టింది. ఈ సినిమాలో నటించిన ఆనంద్, వైష్ణవి, విరాజ్ లకు మంచి స్టార్ డమ్ దక్కింది.
ప్రస్తుతం ‘బేబి’ సినిమా బాలీవుడ్ కి కూడా వెళుతుంది.

అక్టోబర్ లో విడుదలైన ‘మ్యాడ్’ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా కుర్రకారును బాగా ఆకట్టుకుంటుంది. సినిమాని ప్రేమించే వాళ్లలో యువత ఎక్కువగా ఉండడంతో.. సీజన్, అన్ సీజన్ తో సంబంధం లేకుండా యూత్ ఫుల్ కాలేజ్ స్టోరీస్ కి ఎప్పుడూ ఆదరణ దక్కుతూనే ఉంటుంది. కాలేజ్ లైఫ్, అక్కడ లవ్ స్టోరీస్, గొడవలు, ఫన్ ఎలిమెంట్స్ తో రూపొందే సినిమాలలో యువత తమను తాము ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. ఇవే ఎలిమెంట్స్ తో వచ్చిన ‘మ్యాడ్’ మంచి విజయాన్ని సాధించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా మరిచయమైన ఈ చిత్రం ఈ ఏడాది కాలేజీ కుర్రాళ్ళ ఫేవరేట్ సినిమాగా నిలిచింది.

కంటెంట్ బాగుంటే చాలు సినిమా చిన్నదా పెద్దదా అని ఆలోచించరు ఆడియన్స్. తమ మనసుకి నచ్చిన చిత్రాలకి వసూళ్ల వర్షం కురిపిస్తుంటారు. ఈకోవలోనే ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ ‘పొలిమేర 2’. కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైన ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యం రాజేష్ హీరోగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించింది. ఒక గ్రామంలో చేతబడులు, క్షుద్రపూజలు చుట్టూ సాగే కథతో రూపొందిన ఈ సినిమాలోని సత్యం రాజేష్ నటన, కథలోని ట్విస్టులు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

నవంబర్ లో ‘పొలిమేర 2’తో పాటు మరో చిన్న సినిమా ‘మంగళవారం’ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ‘ఆర్.ఎక్స్.100′ దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ క్రేజీ కాంబోలో వచ్చిన సినిమా ఇది. ఈ మూవీలో తన బోల్డ్ నెస్ తో పాటు పెర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న రోల్ లో అదరగొట్టింది పాయల్. ఈ మూవీలో అజయ్ ఘోష్ – లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీకి మంచి పేరొచ్చింది. సాంకేతికంగా ఈ సినిమాకు ప్రధాన బలం అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం. మొత్తానికి.. ‘మంగళవారం’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.

నవంబర్ లోనే వచ్చిన మరో చిన్న సినిమా ‘కోట బొమ్మాళి పి.ఎస్.’ కూడా భారీ విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తేజ మార్ని తెరకెక్కించిన సినిమా ఇది. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కి గ్రేట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది ఈ చిత్రం. పెర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ ఉన్న కథ దొరకితే శ్రీకాంత్ ఎలా నటిస్తారో ఖడ్గం మూవీలోని పాత్ర చూస్తే అర్థమవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ రోల్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇంకా.. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రైటర్ పద్మభూషణ్’, నవంబర్ లో విడుదలైన తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటి చిన్న చిత్రాలు కూడా విమర్శకుల ప్రశంసలు పొందాయి.

Related Posts